ఇప్ప లడ్డూకు జై | - | Sakshi
Sakshi News home page

ఇప్ప లడ్డూకు జై

Nov 11 2025 7:23 AM | Updated on Nov 11 2025 7:23 AM

ఇప్ప

ఇప్ప లడ్డూకు జై

‘భీంబాయి’ స్ఫూర్తితో.. ఇక రాష్ట్రమంతా అందుబాటులోకి అన్ని జిల్లాల్లో యూనిట్ల ఏర్పాటు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం మన్‌కీ బాత్‌లో ఇప్పటికే ప్రధాని మోదీ ప్రశంసలు

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఎక్స్‌రోడ్‌ కేంద్రంగా తయారవుతున్న ఇప్పపువ్వు లడ్డూకు మరోసారి గుర్తింపు దక్కినట్లయింది. ఇటీవల నిర్వహించిన మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలతో జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన ఈ లడ్డూ ఇక రాష్ట్రమంతా అందుబాటులోకి రానుంది. భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం స్ఫూర్తితో అన్ని జిల్లాల్లో తయారీ యూనిట్లను ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సెర్ప్‌ సీఈవోను ఆదేశించింది.

రక్తహీనతను అధిగమించేలా...

అటవీప్రాంతంలో సహజసిద్ధంగా దొరికే ఇప్పపువ్వు ఆదివాసీల జీవనంలో ఒక భాగమైంది. తొలినాళ్లలో దీంతో సారా తయారు చేసేవారు. కాల క్రమేణ వంటకాలకు ఉపయోగించారు. అయితే వారసంతలు, గిరిజన వేడుకల్లో కనిపించే ఇప్పపువ్వు వంటకాలను అందరికి అందించేలా చూడటంతో పాటు ఆదివాసీలకు మేలు చేయాలని గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన దివ్యదేవరాజన్‌ సంకల్పించారు. ఏజెన్సీ ప్రాంతంలోని మహిళలు, యువతులు ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు రక్తహీనతతో బాధపడుతుండడాన్ని గుర్తించారు. దానికి చెక్‌పెట్టేలా ఇప్పలడ్డూ తయారీకి నిర్ణయించారు. ఐటీడీఏ ద్వారా రూ.14లక్షల వ్యయంతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ఆధ్వర్యంలో 2019 మే లో ఉట్నూర్‌లో ప్రారంభించారు. నాటి నుంచి ఈ లడ్డూలను తయారు చేస్తున్నారు. 12 మంది సంఘ సభ్యులు ఉపాధి పొందుతున్నారు.

రూ.కోటికి పైగా విక్రయాలు...

అటవీ ప్రాంతం నుంచి సేకరించిన ఇప్పపువ్వులో నెయ్యి, పల్లీలు, బెల్లం, బాదం, జీడీ పప్పు నువ్వులు, పల్లీలను మిశ్రమంగా చేసి లడ్డూలను తయారు చేస్తున్నారు. రోజుకు 20 నుంచి 30 కిలోల చొప్పున సిద్ధం చేస్తున్నారు. ముడి సరుకును సంఘ సభ్యులు సొంతంగానే సమకూర్చుకుంటున్నారు. కేంద్రంలో తయారు చేసిన లడ్డూలను ఆరోగ్య పోషణమిత్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒక్కో విద్యార్థికి తలా రెండు లడ్డూలను అందిస్తున్నారు. ఒక్కో లడ్డూను రూ.7 చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతను ఐటీడీఏ అందజేస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఆశ్రమ పాఠశాలలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళాశక్తి క్యాంటిన్లలోనూ విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో కేటాయించిన స్టాల్‌లో మహువా లడ్డూలను విక్రయిస్తున్నారు. అయితే ఈ లడ్డూ అవశ్యకతను తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన చాలా మందితో పాటు ఉట్నూర్‌ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు స్వయంగా ఆ కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు చేస్తున్నారు. కేజీకి సాధారణ లడ్డూలు రూ.400 కిలో విక్రయిస్తుండగా డ్రైప్రూట్స్‌తో చేసినవి రూ.600 నుంచి రూ.800వరకు విక్రయిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు వీటి విక్రయాల ద్వారా రూ.1.27 కోట్ల వార్షిక ఆదాయం గడించి ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచారు. ఈ సంఘం స్ఫూర్తితోనే ప్రభుత్వం ఇతర జిల్లాల్లోనూ ఈ లడ్డూ విక్రయాలను చేపట్టాలని భావిస్తోంది.

ఎంతో ఆనందంగా ఉంది

ఇప్పపువ్వు లడ్డూను తొలుత స్వయం ఉపాధి కోసం తయా రు చేశాం. తొలి నాళ్లలో అంతగా అమ్ముడుపోయేవి కావు. ఐటీడీఏ చేయూతతో విక్రయాలు పెరిగాయి. ప్రభుత్వ ఆశ్ర మ పాఠశాలలతోపాటు బయట మార్కెట్‌లోనూ అమ్ముతున్నాం. ప్రతినెలా రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు లడ్డూల అమ్మకాలు జరుగుతున్నాయి. సభ్యులకు తలా రూ. 20వేల వరకు మిగులుతుంది. మేం చేసే లడ్డూలను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి మోదీ అభినందించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈ లడ్డూ యూనిట్లను ఏర్పాటు చేయాల ని ఆలోచించడంతో మరింత మందికి ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం చేయూతనందిస్తే మరింతగా ముందుకు సాగుతాం. – బాగుబాయి భీంబాయి, ఆదివాసీ మహిళా సహకార సంఘం అధ్యక్షురాలు

ప్రధాని ప్రశంసలు..

ఉట్నూర్‌లో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ద్వారా తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డూల ప్రాధాన్యతను స్వయంగా ప్రధాని మోదీ ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. సంఘం మహిళలను ప్రత్యేకంగా ప్రశంసించారు. దీంతో ఆదిలాబాద్‌ జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. ఇదే స్ఫూర్తితో రాష్ట ప్రభుత్వం మహువా లడ్డూను రాష్టవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

ఇప్ప లడ్డూకు జై1
1/2

ఇప్ప లడ్డూకు జై

ఇప్ప లడ్డూకు జై2
2/2

ఇప్ప లడ్డూకు జై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement