వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. చలి ప్రభావం పెరుగుతుంది. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చల్ల గాలులు వీస్తాయి.
లోక్ అదాలత్‌లో
సత్వర పరిష్కారం
నిర్మల్‌టౌన్: లోక్ అదాలత్‌లో కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని జిల్లా జడ్జి శ్రీవాణి, ఎస్పీ జానకీషర్మిల అన్నారు. నెల 15 న నిర్వహించే ప్రత్యేక లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కోర్టులో పోలీస్ అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులపై చర్చించారు. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చన్నారు. లోక్ అదాలత్ సేవలు ప్రజలకు ఉచితంగా అందుతాయని తెలిపారు. రాజీ పద్ధతిలో క్రిమినల్, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం, బ్యాంకు రికవరీ, చెక్‌బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులకు సంబంధించిన ఇరుపక్షాల సమ్మతితో రాజీతో పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ.. రాజీమార్గం రాజమార్గమని, చిన్నచిన్న కేసులతో కోర్టుల చుట్టూ.. తిరుగుతూ సమయం, డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుకోవాలని తెలిపారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ రాధిక, పోలీస్ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


