హైవేపై కారు బోల్తా
చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ పరిధిలో ఆదివారం లారీని తప్పించబోయి బీఎండబ్ల్యూ కారు బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ పరిధిలో రాగానే ముందున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేయడంతో కారు అదుపుతప్పి పక్కన వెళ్తున్న స్విఫ్ట్ కారును ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారులో ఇద్దరు ప్రయాణిస్తుండగా.. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. కారు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.


