పండ్ల అలంకరణలో తిరుపతమ్మవారు
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో కార్తిక మాస ప్రత్యేక అలంకరణల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని వివిధ రకాల పండ్లతో అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విశేష అలంకరణలోని అమ్మవారి దర్శించుకున్నారు. పాలు, పొంగళ్లతో బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. పండ్ల అలంకరణకు వత్సవాయి మండల గోపినేనిపాలెం గ్రామానికి చెందిన కామినేని రాంబాబు, అనిల్, గన్నవరం పట్టణానికి చెందిన చిలకపాటి లక్ష్మీగణేష్ సహకారం అందజేశారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈవో భూపతిరాజు వెంకట సత్య నాగకిషోర్‌కుమార్, ఈఈ ఎల్ రమ, ఏఈఓ జంగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలో ఆదివారం ఓ ప్రైవేటు నివాస గృహంలో మంత్రులు పాత్రికేయులతో మాట్లాడారు. తుపాను సమయంలో సీఎం చంద్రబాబునాయుడు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసి తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారన్నారు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన నిరాశ్రయులకు నిత్యావసర సరుకులను అందజేశామన్నారు. హెక్టారుకు రూ. 25వేలు నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మునిసిపల్ మాజీ చైర్మన్ బాబాప్రసాద్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందించేందుకు కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(కోపా) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోపా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ దావులూరి కై లాసరావు, దుట్టా రమేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్, డిప్లొమా తదితర కోర్సులు చదువుతున్న మెరిట్ విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు kopakrishnavja@gmail. com మెయిల్‌కు రిక్వెస్ట్ పంపితే తాము దరఖాస్తు పంపిస్తామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లు జత చేసి తమకు పంపించాలని వారు కోరారు. మరింత సమాచారం కోసం 94402 39989, 70936 39919లో కానీ, మెయిల్ ఐడీ ద్వారా కానీ సంప్రదించాల్సిందిగా వారు కోరారు.
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన యలవర్తి శశిధర్, వారి తల్లి యలవర్తి పద్మజ రూ.1,01,116 విరాళం అందజేశారు. ఆదివారం త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ కార్యాలయంలో విరాళం చెక్‌ను సూపరింటెండెంట్ చల్లా శ్రీనివాసరావుకు అందించారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి రూ.12,24,960 ఆదా యం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ స్వామివారికి సేవా టికెట్ల ద్వారా రూ. 6,80,370, లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయం ద్వారా రూ. 2,69,045, నిత్యాన్నదాన కార్యక్రమం ద్వారా రూ.1,30,348, శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం రూ. 1,10,867, స్వామివారి కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ.30,840 సమకూరినట్లు వివరించారు. సుమారు 40వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు.
పండ్ల అలంకరణలో తిరుపతమ్మవారు
పండ్ల అలంకరణలో తిరుపతమ్మవారు


