సాక్షి, విజయవాడ: అధికార టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని, వారికి అనవసరంగా సీటు ఇచ్చామని ఇటీవల చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, ఎమ్మెల్యేల దోపిడీపై తాజా సర్వే ఒకటి చంద్రబాబును టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది.
తాజాగా చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కొందరు మంత్రులపై చంద్రబాబు మండినట్టు సమాచారం. అలాగే, ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని చంద్రబాబు, లోకేష్‌లు అంగీకరించారు. ఎమ్మెల్యేల దోపిడీపై ఎస్-9 సంస్థ సర్వేలో(టీడీపీ సొంత సర్వే) తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలిసింది. సర్వే రిపోర్టులు, కార్యకర్తల ఫిర్యాదులతో చంద్రబాబు, లోకేష్ గగ్గోలు పెట్టినట్టు తెలిసింది. అంతకుముందు.. కొంత మందికి టికెట్లు అనవసరంగా ఇచ్చానని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కాగా, యువకులను ఎంకరేజ్‌చేసే పనిలో భాగంగా టికెట్లు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నప్పటికీ కొందరు నేతలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసినట్టు తెలిసింది. మరోవైపు.. తాజాగా తొలిసారి ఎమ్మెల్యేలకు మంచి చెడులు తెలియడం లేదన్న లోకేష్ వ్యాఖ్యలు చేయడం ఈ ఎపిసోడ్‌లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనా తండ్రి, కొడుకుల వ్యాఖ్యలతో టీడీపీ ఎమ్మెల్యేల దోపిడీ బండారం బట్టబయలైంది. ఇక, ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.



