పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న ఆటోలు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న ఆటోలు సీజ్‌

Nov 10 2025 7:58 AM | Updated on Nov 10 2025 7:58 AM

పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న ఆటోలు సీజ్‌

పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న ఆటోలు సీజ్‌

మునగాల: హైదరాబాద్‌–విజయవాడ జాతీ య రహదారిపై మునగాల మండల కేంద్రంలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి.. పరిమితికి మించి ప్రయాణికులు, వ్యవసాయ కూలీలను తరలిస్తున్న ఆటోలను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పది ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్న వ్యవసాయ కూలీలతో పాటు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు ఎస్‌ఐ బి. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. పది ఆటోలకు రూ.9,200 జరిమానా విధించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు జరిమానా చెల్లించిన తర్వాత తిరిగి అదే తప్పును కొనసాగిస్తే ఆటోలను సీజ్‌ చేసి కోదాడ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తామని హెచ్చరించారు. ఆటోల యాజమానులు, డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య

చౌటుప్పల్‌: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. లక్కారం గ్రామానికి చెందిన రాచకొండ సతీష్‌కుమార్‌(40) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన ఇంట్లోని వంట గదిలో దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడి భార్య సురేఖ గమనించి చున్నీని కత్తితో కట్‌ చేసి కిందకు దింపి చూడగా అప్పటికే సతీష్‌కుమార్‌ మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులతోనే సతీష్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టిన కారు

ముగ్గురికి గాయాలు

చిలుకూరు: కారు అదుపుతప్పి గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చిలుకూరు మండల కేంద్రం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. చిలుకూరు మండలం సీతరాంపురం గ్రామానికి చెందిన పులగం వంశీకృష్ణ, ఆసోజు త్రివాసు, పులగం ప్రశాంత్‌ శనివారం ఉదయం కారులో ఖమ్మంలో ఫంక్షన్‌కు హాజరై తిరిగి రాత్రి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో చిలుకూరు మండల కేంద్రం శివారులోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే కారు అదుపుతప్పి ముందువెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంశీకృష్ణకు తీవ్ర గాయాలు కాగా.. త్రివాసు, ప్రశాంత్‌ స్వల్ప గాయాలయ్యాయి. వంశీకృష్ణను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌రెడ్డి తెలిపారు.

బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ

ఇద్దరు ప్రయాణికులకు గాయాలు

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట): ఆర్టీసీ బస్సు ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామ స్టేజీ సమీపంలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సూర్యాపేట గ్రామ స్టేజీ సమీపంలో ఆదివారం సాయంత్రం బైక్‌ అదుపుతప్పి కిందపడింది. అదే సమయంలో సూర్యాపేట నుంచి తొర్రూర్‌ వెళ్తున్న సూర్యాపేట డిపో ఆర్టీసీ బస్సు నెమ్మదిగా వెళ్తుండగా.. వెనుక నుంచి కలప లోడుతో వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏనుబాముల గ్రామానికి చెందిన కల్లేపల్లి ఉపేంద్ర, నెమ్మికల్‌ గ్రామానికి చెందిన చెందిన రాణికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ పరారయ్యాడు.

తప్పిపోయిన పిల్లలు.. తల్లిదండ్రులకు అప్పగింత

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఆదివారం పలువురు చిన్నారులు తప్పిపోయారు. వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఆర్‌ఐ శేషగిరిరావు వెల్లడించారు. రద్దీ కారణంగా ఈఓ వెంకట్రావ్‌ ఆదేశాలతో ఆర్‌ఐ శేషగిరిరావు కొండపైన తప్పిపోయిన పిల్లల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొండపైన కంట్రోల్‌ రూం వద్దకు తప్పిపోయిన చిన్నారుల తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేయడంతో కంట్రోల్‌ రూం వద్ద ఉన్న సీసీ టీవీని పరిశీలించి, మైక్‌ ద్వారా అనౌన్స్‌మెంట్‌ చేశారు. దీంతో వేర్వేరుగా తప్పిపోయిన ముగ్గురు చిన్నారులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించామని ఆర్‌ఐ శేషగిరిరావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement