breaking news
-
రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం
సాక్షి,న్యూఢిల్లీ: ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజా సింగ్‌కు లేఖ రూపంలో తెలియజేశారు. మీ రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు పార్టీ పని విధానం , సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. మీరు లేవనెత్తి అంశాలు అసందర్భం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో మీ రాజీనామాను ఆమోదిస్తున్నాం అని అరుణ్ లేఖలో తెలియజేశారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచందర్‌రావు ఎన్నికను వ్యతిరేకిస్తూ గోషామహల్(హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి జూన్ 30వ తేదీన రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాపై వివరణ ఇవ్వమని హైకమాండ్ కోరితే అందుకు తాను సిద్ధమని చెప్పారాయన. కానీ, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే ఇప్పుడు రాజీనామాకు అధిష్టానం ఆమోదం తెలపడం గమనార్హం. -
అలాంటి రామచందర్ రావుకు అధ్యక్ష పదవా?.. బీజేపీపై భట్టి సీరియస్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దళితులు, గిరిజనులను వేధించిన వారికి బీజేపీ ఉన్నత పదవులు ఇస్తుందనే దానికి తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకమే ఉదాహరణ అంటూ భట్టి విమర్శలు చేశారు.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్ రావు కారణం. ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవితో రివార్డు ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలి. రోహిత్ వేముల ఆత్మహత్యకి కారణమైన సుశీల్ కుమార్‌కి ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారు. ఇది వ్యవస్థాగత హత్య. ఏబీవీపీ నాయకులతో కలిసొచ్చి రామచందర్ రావు ధర్నా చేశారు.ఢిల్లీ నుంచి రామచందర్ రావు పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి రోహిత్ వేములను డిస్మిస్ చేయించారు. దేశ ద్రోహం కేసులు పెట్టించారు. ఈ వేధింపులకు వ్యతిరేకంగా రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. రోహిత్ వేముల కేసును రీ ఓపెన్ చేస్తున్నాం. కోర్టు అనుమతి కోసం అభ్యర్థన పెట్టాం. దోషులకు తగిన శిక్షలు పడాలి. ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి ఉండాలి. వివక్ష ఉండకూడదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ఎస్సీ సెల్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ మాట్లాడుతూ..‘రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ రివార్డులు ఇస్తోంది. రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చింది. బీజేపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను పక్షపాతంతో ఫెయిల్ చేస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. -
‘అయ్యా రేవంత్.. 400 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్‌లు నీవేనా?’
సాక్షి, బీఆర్కే భవన్: దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది. 50ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీవి.. అవే మోసాలు, అవే అబద్ధాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పినవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా భవన్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు.. కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్‌కు అవగాహన లేదని బాధతో చెప్తున్నా. 299 టీఎంసీల పేరుతో శాశ్వత ఒప్పందం అని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేతకాక కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడే 299 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం చేశారు.చంద్రబాబుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా..శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్-3పై ఎందుకు పోరాటం చేస్తారు?. సెక్షన్-3 విషయంలో ఉమా భారతి, గడ్కరీని కలిశారు. కేంద్రంపై పోరాటం చేసి సెక్షన్-3ని కేసీఆర్ సాధించారు. బోర్డు తాత్కాలిక నీటి వినియోగం కోసం మాత్రమే వినియోగిస్తారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడారు.. చాలా బాధతో చెప్తున్నాను. కృష్ణా నదిని దోచుకో అని రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని నేను బయటపెట్టిన తర్వాత సీఎం మాట మార్చారు.నిజాం కట్టినవీ నీవేనా..సీఎం రేవంత్‌కి ఎలాగూ తెలియదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదు అంటే బాధేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా?. 573 టీఎంసీలు చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అజ్ఞానం. 400 ఏళ్ల కింద కాకతీయ, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. బీఆర్ఎస్ పాలనలో 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.తుమ్మడిహట్టి నుంచి బ్యారేజీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చింది.. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించు. ఎనిమిదేళ్లలో 160 టీఎంసీలకు కేంద్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి తేలేదు?. దీనిపై అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం. మా మైక్ కట్ చేయకుండా, అసెంబ్లీ నుంచి పారిపోవద్దు. 20 నెలల పాలనలో ఇప్పుడు ఒక్క చెరువు, చెక్ డ్యామ్ కట్టించారా?. మీరు ఏమీ చేయకుండానే నీళ్లు ఎలా వచ్చాయి.. పంటలు ఎలా పండాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను వాడటం లేదు.. ఆరు శాతం నీళ్లను తక్కువగా వాడారు’ అని చెప్పుకొచ్చారు. -
బీసీ రిజర్వేషన్‌పై తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు(గురువారం, జూలై 10) జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ప్రతీ 15 రోజుకు ఒకసారి కేబినెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతీ మూడు నెలలకు గత కేబినెట్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలపై పునః సమీక్ష చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇది చరిత్రాత్మక నిర్ణయంస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. 42 శాతం బిసి రిజర్వేషన్ల తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక అడుగు.. ఈ రోజు ప్రభుత్వం క్యాబినెట్ లో బిసి రిజర్వేషన్లు అమలు కోసం ఆర్డినెన్స్ తేవడానికి నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నాం. 2018 చట్టాన్ని సవరించి బిసి రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సామాజిక విప్లవానికి నాంది.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చేసిన డిమాండ్ ను దేశంలో మొదటగా అమలు చేస్తున్నాం.. 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వర్గానికి పేరు పేరునా ధన్యవాదాలు. తెలంగాణ సమాజం, ప్రధానంగా బిసిలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. -
‘ఆ అవకాశం కేసీఆర్‌కు ఎప్పుడో వచ్చింది.. కానీ వదిలేశారు’
హైదరాబాద్: ఏబీఎన్ రాధాకృష్ణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రాధాకృష్ణది కొత్త పలుకు కాదు.. చెత్త పలుకని పేర్కొన్న జగదీష్‌రెడ్డి.. సెటిలర్లు ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉన్నారన్న విషయం తెలుసుకోవాన్నారు. వారు చంద్రబాబును ఎప్పుడో తిరస్కరించారని, ఓ వర్గం పనిగట్టుకుని బీఆర్ఎస్ నేతలపై విషం కక్కుతుందన్నారు. ‘మీ రాతలతో కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్పై విషం వెళ్లగక్కారు. మీ రాతలు అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. మీతో పాటు, మీ గురువును జైలుకు పంపించే అవకాశం కేసీఆర్ ఏనాడో వచ్చింది. రాజకీయ కక్షల ఆలోచన వద్దని కేసీఆర్ వదిలేశారు’ అని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. -
సీఎం రేవంత్‌కు కవిత సవాల్
కొత్తగూడెం: పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. జూలై 10వ తేదీ) కొత్తగూడెంలో తెలంగాణ జాగృతి విస్తృత సమావేశంలో కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలనేది డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో భాగంగా చేస్తున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామన్నారు. ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దాం. మేం మహిళలం అందరం పోలీస్ కమాండ్ సెంట్రల్ఖు వస్తాం. వీటిపై చర్చిద్దాం’ అని కవిత సవాల్ చేశారు. LIVE: తెలంగాణ జాగృతి విస్తృత సమావేశం, కొత్తగూడెం https://t.co/q9knIqkTGN— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 10, 2025 -
‘మీకు మేం ముఖ్యమో? కొండా ఫ్యామిలీ ముఖ్యమో? తేల్చుకోండి?’
సాక్షి,హైదరాబాద్: తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. ఇదే అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వద్ద ప్రస్తావించిన నేతలు.. మీకు మేం ముఖ్యమో? కొండా ఫ్యామిలీ ముఖ్యమో? తేల్చుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇవాళా (జులై10) గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని క్రమశిక్షణా కమిటీకి తేల్చిచెప్పారు. ‘క్రమశిక్షణ కమిటి ముందుకు రావాలి అంటేనే అవమానంగా ఉంది. తిట్లు తిన్నది మేము.. కమిటి కూడా మమల్ని పిలిచింది అంటే ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కొండా మురళీపై చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే మాకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వండని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి తేల్చి చెప్పారు.మీకు మేము ముఖ్యమో..కొండా ఫ్యామిలీ ముఖ్యమో తేల్చాలంటూ అధిష్టానికి ఎమ్మెల్యేలు సూచించారు.మరోవైపు,క్రమశిక్షణ కమిటీ సమావేశంపై మల్లు రవి మాట్లాడారు. వరంగల్ నేతల పంచాయితీపై చర్చిచాం. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చెప్పారు. వరంగల్ నేతలతో మరోసారి భేటీ అవుతామని అన్నారు. వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేసిన కొండా మురళి కామెంట్స్ వివాదం వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇప్పటికే తమను కించ పరుస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.. వివాదంపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళికి నోటీసులు జారీ చేశారు.దీంతో క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాల్సిన కొండా మురళి ఊహించని విధంగా వ్యవహరించారు. గత నెలలో భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్‌కు నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమ య్యారు. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్‌రావులతో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు. ఆ లేఖలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.ఈ క్రమంలో.. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇవాళ వరంగల్ నేతలు క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. -
బాబు.. 2,45,000 కోట్ల బడ్జెట్ ఏమైంది.. అప్పులపై అడిగితే దేశద్రోహులమా?: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు.. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిని అభివృద్ధి చేయలేక వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తున్నారని అడిగతే మేము దేశద్రోహులమా?. మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఎందుకు?. అమరావతిని అభివృద్ధి చేయలేక మాపై విమర్శలు చేస్తున్నారు. మేం అప్పు చేస్తే తప్పు.. మీరు అప్పులు చేస్తే ఒప్పా?. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి. రూ.2,45,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయింది?. ఒక్క పెన్షన్లకు తప్ప ఏ సంక్షేమ పథకానికైనా కేటాయింపులు చేస్తున్నారా?. రాష్ట్రంలో పొగాకు, మామిడి, మిర్చి రైతుల పరిస్థితి ఏంటి?. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేశారా?. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా?. తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు?. ఉచిత గ్యాస్ సిలిండర్ అడిగితే దేశద్రోహులమా?. ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు పెడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అంటున్నారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ ఇచ్చారా?. దీపం ఎంత మందికి వచ్చంది?. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
బనకచర్ల.. గురు శిష్యుల డ్రామా?
రాజకీయాల్లో కొందరు గాల్లో కత్తులు తిప్పుతూంటారు. అదే యుద్ధమని జనాన్ని నమ్మించే ప్రయత్నమూ జరుగుతూంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల్లో హడావుడి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి గత ఏడాది అధికారంలోకి వచ్చింది మొదలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సుమారు రూ.85 వేల కోట్లతో గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని ప్రతిపాదించారు. కేంద్రం కూడా నిధుల రూపంలో సాయం చేయాలని కోరారు. అయితే.. పలు లిఫ్ట్‌లు, రిజర్వాయర్లు, సొరంగాలతో కూడిన బనకచర్ల ప్రాజెక్టు అంత తేలికగా అయ్యేది కాదన్నది అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వమేమో సాయం సంగతి దేవుడెరుగు... పంపిన ప్రతిపాదననే తిప్పి పంపింది. జలసంఘం ఆమోదం తరువాత పర్యావరణ అనుమతులు కూడా తీసుకుని మాట్లాడమని సూచించింది. ఇదంతా ఒక పార్శ్వమైతే.. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఇంకో రకమైన రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఈ అంవాన్ని పెద్ద వివాదంలా మార్చి వాదోపవాదాలు సాగిస్తున్నాయి. రెండు పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూండటం గమనార్హం. కానీ... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను అంగీకరించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్పష్టం చేస్తూనే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు. వీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తే, దీనికి పోటీగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురు శిష్యులని, అందుకే బనకచర్ల ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని హరీష్ అంటున్నారు. చంద్రబాబు, రేవంత్‌లు హైదరాబాద్‌లో భేటీ అయినప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే చేశారని హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ఉత్తం కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చంద్రబాబు వద్ద బజ్జీలు తిని మరీ ఈ ప్రాజెక్టుకు ఓకే చేసి వచ్చారని అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నీటి వాటాలలో నష్టం జరిగిందని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైనప్పుడు ఇందుకు బీజం పడిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్, జగన్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక భేటీ జరిగిన మాట నిజమే. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి జూరాలకు తరలించడానికి కేసీఆర్ ప్రతిపాదించగా, దానిని పరిశీలించడానికి జగన్ ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం ఏర్పడడంతో అది ముందుకు సాగలేదు. కేసీఆర్, జగన్‌లు అయినా, చంద్రబాబు, రేవంత్ అయినా సమావేశమైతే ఉభయ రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తదుపరి చంద్రబాబుకు చెప్పే కాంగ్రెస్‌లో చేరారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి, పిమ్మట పీసీసీ అధ్యక్షుడై, ఎన్నికలలో గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు.అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా తెలంగాణ టీడీపీ కూడా సహకరించడం బహిరంగ రహస్యమే.చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్‌తో కూడా స్నేహం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాలలో ఉన్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్‌లు కలిసి కూర్చుని విభజన సమస్యలను చర్చించి పరిష్కారం కనుక్కుని ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.ఏడువేల కోట్ల విద్యుత్ బకాయిలు రావల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో వాటా తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించి ఉండాల్సింది. తనను చంద్రబాబు శిష్యుడని చెప్పడాన్ని రేవంత్ అంత ఇష్టపడక పోయినట్లు కనిపిస్తుంటారు. అయినా వారిద్దరి మధ్య సంబంధ, బాంధవ్యాలు బాగానే ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ ఉదాసీనంగా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గోదావరి జలాలలో 1500 టీఎంసీల నీటిని కేటాయించిన తర్వాత ఏపీ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం వాదనగా ఉంది. అయితే తాము వరద జలాలను మాత్రమే వాడుకోదలిచామని, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులపై గతంలో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ తెలంగాణ అడ్డుపడింది. ఇప్పుడు బనకచర్ల విషయంలో కూడా తెలంగాణ గట్టిగా అడ్డుపడుతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ కోణంలో చూస్తే వారికి తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏపీకి ఎంతవరకు సహకరిస్తుందన్నది సందేహమే. ఇక్కడ విశేషం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏమీ లేదని, తెలుగుదేశానికి మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో సహా మరికొందరు ప్రత్యేకంగా సమావేశం పెట్టి ప్రకటన చేశారు. అంతేకాక 18.5 కిలోమీటర్ల వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల తవ్వకాలు రెండున్నర దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయని, అయినా అవి ఒక కొలిక్కి రాలేదని, అలాంటిది ఇప్పుడు ఏకంగా నల్లమల అడవులలో, కొండల్లో 26.5 కీలోమీటర్ల మేర సొరంగం తవ్వకం ఆరంభిస్తే అది ఎప్పటికి పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. తాను ఏమైనా ప్రతిపాదిస్తే, ఎవరూ దాన్ని వ్యతిరేకించరాదని భావిస్తారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే అభివృద్ది వ్యతిరేకులంటూ వారిపై తట్టెడు బురద వేసి ప్రజల మైండ్ ఖరాబు చేస్తుంటారు. ఇందుకు తనకు మద్దతు ఇచ్చే మీడియాను పూర్తిగా వాడుకుంటారు. అందువల్ల ఏపీలో తెలుగుదేశం మినహా ఇతర రాజకీయ పార్టీలేవి ఈ ప్రాజెక్టుపై పెద్దగా స్పందించడం లేదు. ఇదంతా ఏపీలోని కూటమి ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా అని ఆయా రాజకీయ నేతలు భావిస్తున్నారు. సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్ కలిసి ఈ డ్రామా నడుపుతున్నారని, చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు పూర్తిచేసే ఉద్దేశం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కూడా ఇదే తరహా ప్రాజెక్టుకు డీపీఆర్ పంపించింది. ప్రభుత్వం మారడంతో బనకచర్ల ప్రాజెక్టు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం అంత తేలిక కాదన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే ఏకంగా రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుంది. అది అక్కడితో ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్రం దీనికి నిధులు కేటాయించితే పెద్ద విశేషమే. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదు. అయినా కేసీఆర్ రుణాలు తెచ్చి ఆ ప్రాజెక్టును నిర్మించారు. కాని అందులో ఒక భాగం దెబ్బతినడం కేసీఆర్ ప్రభుత్వానికి ఇరకాటమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల వాయిదాలు సరిగా చెల్లించలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బనకచర్లకు రుణాలు వచ్చే అవకాశం ఎంతన్నది చెప్పలేం. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టినా, తెలంగాణకు వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. అయినా రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలు సాగిస్తూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయి. మరో వైపు ఏపీ ప్రభుత్వం తామేదో పెద్ద ప్రాజెక్టును చేపడితే ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం తగ్గించిన అంశాన్ని పక్కన బెట్టి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు భారీ ప్రాజెక్టులపై అంత విశ్వాసం ఉండేది కాదు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తించి, ఇప్పుడు ఆయన కూడా ఆ రాగం ఆలపిస్తున్నారు. అయితే ఆ పాట పాడుతున్నది చిత్తశుద్దితోనా, రాజకీయం కోసమా అన్నదానిపై ఎవరికి కావల్సిన విశ్లేషణ వారు చేసుకోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నిజాలు చెప్పే దమ్ము లేదు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగంపై చర్చకు రావాలంటూ రంకెలు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో బుధవారం నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు ఆహ్వానించలేదని మాజీమంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. సభ్యుల హక్కులకు భంగం కలిగించినందుకు స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అబద్ధాల పుట్ట అంటూ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం సవాలులో నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ను కూడా ఆహ్వానించి ఉండేవారన్నారు. ఎన్ని కొరడాలైనా తక్కువే.. ‘ఐదు దశాబ్దాలుగా తెలంగాణ నీటి హక్కులను కాలరాసి, గోదావరి, కృష్ణాలో తెలంగాణ వాటాను ఆంధ్రకు అప్పజెప్పిన కాంగ్రెస్‌ను కొట్టేందుకు ఎన్ని కొరడాలైనా సరిపోవు. బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణా నీళ్లను ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్న సీఎం రేవంత్‌ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలో చెప్పాలి. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పేరిట కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలతో సీఎం రేవంత్, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ తమ అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడానికి ఇంత నీచమైన స్థాయికి దిగజారడాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. సీఎం, మంత్రులు చెబుతున్న అబద్ధాలను అసెంబ్లీ లోపలా, బయటా అనేకసార్లు సాక్ష్యాధారాలతో సహా వివరించాం. అయినా కుక్క తోక వంకర అన్నట్టు పదే పదే చెప్పిన అబద్ధాలు చెబుతూ నిజాలుగా భ్రమింపచేసే కుట్రలకు పాల్పడుతుండటం సిగ్గుచేటు’అని హరీశ్ విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డిపై కుట్రలు ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి రంగారెడ్డి, నల్లగొండ ప్రాంతాలను విస్మరించామని విభజన చట్టం చూపుతూ రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నాడు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 12.30 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే విషయం గురించి దాచిపెట్టే కుట్ర చేస్తుండు. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందని పచ్చి అబద్ధాలు చెబుతున్న రేవంత్‌రెడ్డి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు మూలనపడింది. ప్రాణహిత–చేవెళ్ల తరహాలోనే మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా పండ బెడుతున్నారు. కేవలం 7 టీఎంసీల సామర్థ్యమున్న జూరాలపై అదనంగా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే పాలమూరు ప్రాజెక్టు భారం మోపడం సాధ్యం కాదని రేవంత్‌రెడ్డికి తెలియదా.. కృష్ణా జలాల్లో 299:512 వాటాకు రాష్ట్రం ఏర్పడక ముందే ఒప్పుకొని కాంగ్రెస్ మరణ శాసనం రాయడం వల్లే తెలంగాణ శిక్ష అనుభవిస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. నేడు పీసీ ఘోష్ కమిషన్ వద్దకు హరీశ్రావుకాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను గురువారం ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి హరీశ్‌రావు కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరింత అదనపు సమాచారం అందించేందుకు హరీశ్ సమయాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కలవడానికి కమిషన్ సమయం ఇచ్చింది. -
మీరు ఎప్పుడంటే అప్పుడే.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయన ఏ తారీఖు ఇచ్చినా శాసనసభ, మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్లలో మీరు, ఏడాదిన్నరలో మేము తీసుకున్న నిర్ణయాలపై చర్చిద్దాం..’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. న్యాయ, సాగునీటి రంగ నిపుణులను పిలిపించి వారి అభిప్రాయాన్ని కూడా ప్రజలకు వినిపిద్దామని అన్నారు. ‘ఏ చిన్న గందరగోళం ఏర్పడకుండా, ఎవరి గౌరవానికి భంగం కలిగించకుండా చట్ట పరిధిలో సభ నిర్వహించే బాధ్యత నాది. ఆరోగ్యం సహకరించక కేసీఆర్ రాకపోతే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మా మంత్రుల బృందాన్ని పంపిస్తా. తారీఖు చెప్తే మా వాళ్లు మొత్తం సెటప్ తీసుకుని వస్తారు. అక్కడే మాక్ అసెంబ్లీ నిర్వహించి చర్చ పెడదాం. కోదండరాం అందులో కూర్చోవాలి. కేసీఆర్ పిలిస్తే నేనూ వస్తా..’ అని సీఎం సవాల్ విసిరారు. మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి తప్పుడు నిర్ణయాలు, ఏపీ కృష్ణా జలాల అక్రమ తరలింపు అంశాలపై బుధవారం ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట సభల్లో చర్చిద్దాం..లేదంటే ఫామ్‌హౌస్‌కు వస్తా ‘చట్టసభల్లో కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఏ తారీఖున వస్తారో చెబుతూ స్పీకర్‌కు లేఖ రాయమన్నాం. అంతేకానీ సవాలు విసరలేదు. ఆయన (కేటీఆర్) సడన్‌గా బయలుదేరిండు. పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది. పొద్దటి పూట క్లబ్బుల్లో, రాత్రిపూట పబ్బుల్లో చర్చజేద్దామని ఉబలాటపడుతున్నడు. వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా మనం చట్టసభల్లో చర్చిద్దాం. క్లబ్బులు, పబ్బులకు, ఆ కల్చర్‌కు నేను చదువుకునే రోజుల నుంచే దూరం. నన్ను వాటికి పిలవద్దు. అయితే అసెంబ్లీకి, లేకుంటే మండలికి, లేకపోతే ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌కి వస్తా..’ అని రేవంత్ అన్నారు. వీధి భాగోతాలు మంచివి కావు.. ‘ప్రదాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి. ప్రజలకు ఉపయోగపడాలని అని నేను అంటుంటే ఆయన ఎందుకూ పనికి రాడు..ఆయనతో ఏం పని అని ఆయన కొడుకు (కేటీఆర్) అంటాడు. నేపాల్‌లో రాజ్యం రాలేదని డిన్నర్‌కి పిలిపించి (యువరాజు)16 మందిని ఏకే 47తో పటపటా కాల్చిండు. అందరూ పోయాక వాడొకడే మిగిలి నేపాల్‌కు రాజైండు. కుటుంబంలో సమస్యలుంటే కుటుంబ పెద్దలు, కుల పెద్దలతో కూర్చొని పంచాయతీ తేల్చుకోవాలి. తమ్ముడు చెల్లెలకు, బావబామ్మర్దికి పంచాయతీలు ఉంటాయి. కానీ ఈ వీధి భాగోతాలు మంచివి కావు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏపీకి అన్ని రకాలుగా సహకరించారు ‘కృష్ణా జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను 2015, 2020లో కేసీఆర్ మంజూరు చేసి వచ్చిండు. సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీలను కృష్ణా బేసిన్‌కు అక్కడి నుంచి పెన్నా బేసిన్‌కు తీసుకెళ్లండని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి సలహాలిచ్చిండు. ఏపీకి అన్ని రకాలుగా సహకరించిండు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని ప్రకటించిండు. కృష్ణా బేసిన్‌లోని రైతులకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరూ ఇవ్వలేదు. హైదరాబాద్‌లో ఏపీ, ఇతర రాష్ట్రాల ప్రజలు 20 శాతం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర కోటా నుంచి నగర అవసరాలను వేరు చేసి మిగిలిన జలాలను పంపకాలు చేద్దాం అని ఆనాడు కేసీఆర్ అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా జలాల దోపిడీకి అవకాశం కల్పించారు ‘జూరాల ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల తరలింపు కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి సర్వేలు జరపాలని 2011లో కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో ఇచ్చారు. అయితే కేసీఆర్ సోర్సు(నీటిని తీసుకునే ప్రదేశం)ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. తుంగభద్ర, కృష్ణా, భీమా నదుల నుంచి తెలంగాణలోని గద్వాల, ఆలంపూర్లో ముందుగా కృష్ణా జలాలు ప్రవేశిస్తాయి. ఆ నీళ్లను అక్కడే ఒడిసి పట్టుకుని తెచ్చుకుని ఉంటే.. ఈ రోజు శ్రీశైలం బ్యాక్‌వాటర్ వద్ద ఏపీకి మనం పైనుంచి వదిలితేనే నీళ్లు దొరుకుతుండే. పోతిరెడ్డిపాడు, రాయలసీమ, మల్యాల, ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా నీళ్లు తరలించుకుపోవడానికి ఏపీకి అవకాశం ఉండేది కాదు. కిందికి పోయాక పట్టుకోవాలనే నిర్ణయంతో పూర్తిగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలిపోతున్నాయి. అక్కడి నుంచి అక్కడే దారిదోపిడీ చేసే అవకాశాన్ని ఏపీకి కేసీఆర్ కల్పించాడు..’ అని ముఖ్యమంత్రి ఆరోపించారు. సీమాంధ్ర పాలకుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం ‘శ్రీశైలం నుంచి ఏపీ పెద్ద మొత్తంలో నీళ్లు తీసుకుంటుండడంతో శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుదుత్పత్తి అవకాశాన్ని తెలంగాణ కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ‘పాలమూరు’ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి టీఎంసీకి తగ్గించి కేసీఆర్ మరో అన్యాయం చేశారు. శ్రీశైలం నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని ఏపీ రోజుకు 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచుకోగా, కేసీఆర్ మాత్రం తెలంగాణ సామర్థ్యాన్ని తగ్గించారు. కృష్ణా జలాల్లో కేసీఆర్ చేసిన ద్రోహం ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ. కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి సీమాంధ్ర పాలకులను ఒక కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిందే. బేసిన్లు లేవు..భేషజాలు లేవని చెప్పే అధికారం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చి రంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టును పూర్తిగా, నల్లగొండ జిల్లాలోని 4 లక్షల ఆయకట్టును కేసీఆర్ తొలగించిండు. కృష్ణా బేసిన్‌లోని రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తే కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపుల సమస్య వస్తది అని సమర్థించుకుండు. ప్రాజెక్టుల నిర్మాణంతో ఉమ్మడి రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే ఎకరాకు రూ.93 వేలు ఖర్చు కాగా, కేసీఆర్ ధనదాహంతో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఎకరాకు రూ.11 లక్షలు ఖర్చు పెట్టిండు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు. ఏపీ సీఎంకు అభ్యంతరం ఎందుకు? ‘బనకచర్లతో వరద జలాలే తీసుకెళ్తామంటున్న ఏపీ సీఎంకు, మా నల్లగొండకు వరద, నికర జలాలు తీసుకెళ్తే అభ్యంతరం ఏమిటి? మా ప్రాజెక్టులన్నీ కట్టుకుంటే వరద ఉందా? లేదా? అనేది తేలుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కాబట్టి కింద మీకు వరద కనిపించవచ్చు..’ అని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. కాగా మంత్రి శ్రీధర్‌బాబుకు మాజీమంత్రి హరీశ్‌రావు ఫోన్ చేసి ప్రజాభవన్‌లో సమావేశాల నిర్వహణపై అభ్యంతరం తెలపడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గడీ కాదని అన్నారు. -
కేసీఆర్ ఒప్పుకుంటే ఫామ్‌హౌజ్‌లోనే మాక్ అసెంబ్లీ: సీఎం రేవంత్
నేనెవరికీ చాలెంజ్‌లు విసరలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మని మాత్రమే పిలిచాం. కేసీఆర్ బాగుండాలని నేను అంటుంటే.. కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీరే చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కుటుంబంలో పంచాయితీ ఉంటే కులపెద్దల సమీక్షలో పరిష్కారం చేసుకోండి అంటూ సీఎం రేవంత్ సెటైర్లు సంధించారు. హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్న సవాళ్ల పర్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రాజెక్టులపై చర్చించేందుకు కేసీఆర్‌ను సభను రమ్మనే తాను సూచించానని, తానెవరికీ సవాళ్లు విసరలేదని అన్నారాయన. బుధవారం ప్రగతి భవన్లో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర ఏండ్ల పాటు కేసీఆర్ కుటుంబం ఇరిగేషన్ శాఖను చూశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు అభ్యర్థులు దొరక్కపోతే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌కు నేనేం సవాల్ విసరలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చట్ట సభల్లో చర్చ జరుపుదాం.. రండి అని అన్నాను అంతే. 👉కేసీఆర్ ఎప్పుడంటే అప్పుడు సభ పెడతాను. ప్రాజెక్టుల పై అసెంబ్లీలో చర్చ జరుపుదాం. ప్రత్యేకమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాజెక్టుల పై అవగాహన ఉన్న నిపుణులను సైతం చర్చకు పిలుద్దాం. అసెంబ్లీ స్పీకర్‌కు కేసీఆర్ లేఖ రాస్తే చర్చకు మేము సిద్ధం. మీరు పదేళ్లలో చేసింది.. ఏడాదిన్నర కాలంలో మేము చేసింది ఏంటో చర్చ పెడదాం. సభలో ఎవరి గౌరవానికి భంగం కలుగకుండా బాధ్యత నేను తీసుకుంటా. సభ ప్రశాంతంగా జరిపేలా నేను చూసుకుంటా. కేసీఆర్ సూచనలు సలహాలు చేస్తే స్వీకరిస్తాం. 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని కోరుతున్నా.👉కేసీఆర్ మా సవాళ్లను స్వీకరించాలి. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు మా మంత్రుల బృందాన్ని పంపుతాం. కేసీఆర్ ఒప్పుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ పెడతాం. కేసీఆర్ పిలిస్తే నేను సైతం ఫామ్ హౌస్‌కు వస్తాను. డేట్, ప్లేస్ మీరు చెప్పినా సరే.. మేమైనా చెప్తాం. కానీ, క్లబ్ లు, పబ్‌లు అంటే మాకు కష్టం. గతంలో ఎన్నో చాలెంజ్‌లు చేశాం. కానీ, క్లబ్బులు, పబ్బుల కల్చర్‌కు నేను దూరం. నన్ను పిలవొద్దు. 👉ప్రజా భవన్ లో మీటింగ్ పెట్టినా BRS ఒప్పుకోవడం లేదు. ప్రజా భవన్ లో ఎలా పెడతారు? అని హరీష్ రావు అంటున్నారు. ప్రజా భవన్ ప్రజల కోసమే ఉంది..అందుకే ఇక్కడ పెట్టుకున్నాం. కేసీఆర్ బాగుండాలని నేను అంటుంటే కేటీఆర్ ఒప్పుకోవడం లేదు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీరే చూసుకోండి. వీధి బాగోతాలు మంచివి కావు. కుటుంబంలో పంచాయతీ ఉంటే కులపెద్దల సమీక్షలో పరిష్కారం చేసుకోండి. 👉స్టేక్ ఓల్డర్లతో త్వరలో PPT పెడతాం. ఏపీ సీఎంకు సూచనలు చేస్తున్న. వరద జలాల్లో లెక్కలు తేల్చుకుందాం. వరద జలాల లెక్కలు తేల్చిన తరువాత పైన మేము కట్టుకుంటాం..కింద మీరు కట్టుకోండి. మా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా మిగులు జలాలు అంటే ఎలా?. నికర, మిగులు జలాల పై కేంద్రం వద్ద చర్చ జరుపుకుందాం. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే చూస్తూ ఊరుకోం. మీరు ఎవరు మాకు సలహాలు ఇవ్వడానికి. కృష్ణా, గోదావరి జలాల కోసం కోట్లాడుతాం. కృష్ణా, గోదావరి జలాల పై తెలంగాణను తాకట్టు పెట్టం. తెలంగాణ హక్కుల కోసం దేవుడినైనా ఎదురిస్తాం.👉కొంతమంది పేరును ప్రస్తావించినా నా స్థాయిని తగ్గించుకున్నట్లు అవుతుంది. బేసిన్లు భేషజాలు లేవని.. రాయలసీమకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్‌కు లేదు. జూరాల నుంచి నీళ్లు తేవాలని చిన్నారెడ్డి అసెంబ్లీలో అంటే.. కేసీఆర్ ఆయన్ను అవమానించారు. రెండు టీఎంసీ లు ఉన్న పాలమూరు రంగారెడ్డిని ఒక టీఎంసీ కేసీఆర్ తగ్గించారు. కృష్ణాజలాల పై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు. 👉ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సీమాంధ్ర నేతలు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ వెయ్యి రెట్లు ద్రోహం చేశారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లను ఏపీ తీసుకుపోతోంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఆయకట్టను కేసీఆర్ ఎందుకు తొలగించారు?. రంగారెడ్డి జిల్లాలో రెండున్నర లక్షలు, నల్గొండ తో కలిపి ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు కేసీఆర్ తొలగించారు. కేసీఆర్ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు. గోదావరి జలాలను రంగారెడ్డి, నల్గొండ కు ఎందుకు తేలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. అనాడు రాజశేఖర్ రెడ్డి నీళ్లు తెస్తానని టెండర్లు పిలిస్తే.. కేసీఆర్ ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలి.. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేశారా ? అలాంటప్పుడు బేసిన్లు, భేషజాలు లేవని కేసీఆర్ ఎలా చెప్తారు?. వాస్తవాలు చర్చ జరుపుదాం అంటే కేసీఆర్ రావడం లేదు అని రేవంత్ మండిపడ్డారు. -
‘లెక్కలతో సహా వస్తాం.. శాసనసభలో తేల్చుకుందాం’
మహబూబాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాళ్లపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. తాము చేసిన సవాల్‌కు సిద్ధమేనని, కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు వచ్చి చర్చకు సిద్ధంగా కావాలన్నారు. ప్రజల పట్ల ఏ మాత్రం నిబద్ధత ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు రావాలని, తాము కూడా లెక్కలతో సహా వస్తామని, శాసనసభలోనే తేల్చుకుందామన్నారు మల్లు. ఈ మేరకు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ ఒక పెద్ద మనిషి హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వచ్చి సవాళ్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి...! నీకు అర్ధం అయ్యింది ఏంటి..?, ముఖ్యమంత్రి.. మాజీ ముఖ్యమంత్రిని రమ్మని సవాల్ విసిరితే ఆయన్ను రానివ్వడం లేదు. CM సవాల్ ను జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. కేసీఆర్‌ను రమ్మంటే ఆయన్ను రానివ్వకుండా ప్రెస్ క్లబ్ ఎవరో వచ్చి సవాళ్లు చేస్తున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రెస్‌క్లబ్‌కు రమ్మంటావా?, ముఖ్యమంత్రి రేవంత్.. మాజీ ముఖ్యమంత్రిని చర్చకు రమ్మని స్పష్టంగా చెప్పారు.. ముఖ్యమంత్రికి ఏ బేసిన్ గురించి తెలియదు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా.. గోదావరి.. కృష్ణా జలాలు.. బేసిన్ గురించి.. ప్రజలకు తెలియ జేయడానికి చర్చించడానికి సిద్ధం. అసెంబ్లీలో చర్చకు మాజీ ముఖ్యమంత్రి రావాలి’ అని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
కేటీఆర్.. ఎందుకు నీకింత అహంకారం?
సాక్షి, ములుగు: ప్రభుత్వం తప్పులు చేసిందని అనిపిస్తే అసెంబ్లీలో నిలదీయాలని.. అంతేగానీ రోడ్ల మీదకు రావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఉద్దేశించి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె.. కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలంటే నీకు గిట్టదు. సొంత చెల్లె నీ అహంకారాన్ని చూసి నీపై మట్టి పోస్తోంది. నువ్వు ఓర్తలేవని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇప్పుడు ఆదివాసి మహిళా అని చూడకుండా నన్ను టార్గెట్ చేస్తున్నావ్.. ఎందుకు?. ఇలా చేసి నువ్వు సాధించిందేది ఏమిటి?. కేటీఆర్.. నీకు ఎందుకు ఇంత అహంకారం. నీవు నిజంగా వాస్తవాల మీద బతికిన వాడివైతే చెప్పు.. మేము ఎంతమందిని ఇబ్బంది పెట్టాం ఎవరిని జైలుకు పంపించాం.70 ఏళ్ల చరిత్రలో కోయ వర్గానికి మంత్రి పదవి రాలేదు. ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. నేను తప్పులు చేశానని చెప్పడం కాదు.. అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలి. అంతేగానీ పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి రోడ్లమీద పోర్లాడితే సానుభూతి వస్తుందనుకోవడం నీ మూర్ఖత్వం. .. పదేళ్లు అధికారంలో ఉండి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమైన మీరు.. ములుగులో సీతక్క రాజ్యం . పోలీస్ రాజ్యం అంటూ ధర్నాలు చేస్తారా?. ములుగు లో నడుస్తుంది ప్రజారాజ్యం .ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన. ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టామో మీ దగ్గర లెక్క ఉంటే తీయండి. నిలదీయండి. దుబాయ్ లాంటి ప్రాంతాల్లో స్టూడియోలు ఏర్పాటు చేసి మాపై రోత వార్తలు రాపియడం ప్రజలు గమనిస్తున్నారు. ఆదివాసీ బిడ్డనైన నన్ను టార్గెట్ చేయడానికి మిడుతాల దండును పంపిస్తున్నావా కేటీఆర్. మేం సమ్మక్క సారక్క వారసులం. మా జోలికి వస్తే నాశనమై పోతావు అని మంత్రి సీతక్క అన్నారు.తాజాగా మంత్రి పొంగులేటితో జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలు కాపాడాలంటూ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల అరెస్టుతో ములుగు కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
Harish Rao: రెండోసారి కాళేశ్వరం విచారణకు..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం కమిషన్ ముందు మరోసారి హాజరు కానున్నారు. మళ్లీ విచారణకు రావాలంటూ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు సిద్ధమయ్యారు. అయితే..విచారణకు ముందు హరీష్‌రావు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాతే ఆయన బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. గత విచారణలో.. ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతులు ఉన్నాయని హరీష్‌రావు స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. గతంలో ఇచ్చిన వాంగ్మూలం, ప్రభుత్వం అందించిన కేబినెట్ నోట్స్ మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇవాళ మరోసారి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.మాజీ ENC అనిల్ కుమార్ హాజరు.. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో బుంగలు పూడ్చడంపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. కమిషన్‌కు తెలియకుండా బ్యారేజీల్లో గ్రౌంటింగ్ చేయడంతో అనిల్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది. కేబినెట్ మినిట్స్ పరిశీలనక్యాబినెట్ రాటిఫికేషన్స్ పై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేబినెట్ ప్రొసీజర్ పై ఇరిగేషన్, ఫైనాన్స్ ఉన్నతాధికారులను అడిగిన కమిషన్.. కేబినేట్ నిర్ణయాల ప్రొజిజర్ ఎలా ఉంటుందనే వివరాలను GAD అధికారులను అడిగి తెలుసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 28 ప్యాకేజీల్లో కేబినెట్ ముందుకు ఎన్ని వచ్చాయనే విషయాన్ని అడిగిన జస్టిస్ పీసీ ఘోష.. ప్రాజెక్టు లొకేషన్లు, డిజైన్ల మార్పుకు సంబంధించిన ఫైల్స్ కేబినేట్ ముందుకు వచ్చాయా? విషయంపై కమిషన్ ఆరా తీశౠరు. అలాగే.. నిధుల మంజూరులో పారదర్శకత ఉందా లేదా అనే విషయం పైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. -
మహానేత వైఎస్సార్ జయంతి.. తెలంగాణ నేతల నివాళులు
సాక్షి, హైదరాబాద్: నేడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి. ఈ సందర్భంగా మహానేత వైఎస్సార్‌కు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు నేతలు ఘన నివాళి అర్పిస్తున్నారు. ప్రజలకు వైఎస్సార్ అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ..‘జనహృదయ నేతకు నివాళి. రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత, అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా చిరస్మరణీయుడైన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళి. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, వారి అడుగుజాడల్లో ప్రజాపాలన సాగిస్తున్నాం’ అని అన్నారు.తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ..‘అవిశ్రాంత ప్రజా సేవకులు. వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనం. మహానేత, అభివృద్ధి ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు’ అర్పించారు.మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ..‘జన హృదయనేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారికి నా హృదయపూర్వక నివాళి. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని.. ప్రజాసంక్షేమమే విధానంగా ప్రభుత్వం నడవాలని.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, చిర స్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు వైఎస్సార్’ అని అన్నారు. -
10న రాష్ట్ర మంత్రివర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 10న మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. విధానపరమైన అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి నెలా రెండు పర్యాయాలు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీ సుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ సమావేశా న్ని నిర్వహించనుంది.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమరి్పంచిన తుది నివేదికపై మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. దీని ఆధారంగా బరాజ్‌ల పునరుద్ధరణకు తదుపరి కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేయనుంది. ఈనెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిపై కూడా మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. స్టాంపుల చట్ట సవరణ బిల్లును మంత్రివర్గం ఆమోదించనుంది. -
గొర్రెలు.. బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలి?..తనకు కేటాయించిన శాఖలపై మంత్రి అసంతృప్తి
సాక్షి, కరీంనగర్ జిల్లా: తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కింద ఇచ్చిన శాఖలపై శ్రీహరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి.ఇది అదృష్టమో, దురదృష్టమో తెల్వదు.పదేళ్లలో ఆగమైన శాఖలను నాకు ఇచ్చారు. పశుసంవర్థక శాఖ గందరగోళంగా ఉంది.ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయి.యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలి..? గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి?అని వ్యాఖ్యానించారు. -
నీళ్ల విలువ తెలియని వ్యక్తులా మన నాయకులు.. హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణభవన్: నీళ్ల విలువ తెలియని నాయకులు తెలంగాణలో పాలన చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మోటర్లు ఆన్ చేయని పక్షంలో రైతులతో కన్నెపల్లి వైపు కదులుతామని హరీష్ రావు హెచ్చరించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీరోజు ఏ నదిలో ఎంత నీరు ఉందో తెలుసుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని విస్మరిస్తోంది. నీళ్ల విలువ తెలియని నాయకులు మనకు పాలకులుగా ఉన్నారు. ఇప్పుడు నీరు వస్తున్నా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బటన్ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?. కాళేశ్వరం మోట్లరు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. వెంటనే కాళ్లేశ్వరం మోటర్లు ఆన్ చేయండి. కాళేశ్వరం నీటితో రిజర్వాయర్లు నింపండి. లేదంటే లక్షలాది మంది రైతులతో కన్నెపల్లి వైపు కదులుతాం’ అని హెచ్చరికలు జారీ చేశారు. కాళేశ్వరానికి మాత్రమే NDSA వర్తిసుందా? SLBC కి NDSA వర్తించదా?. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అన్నదాతకు అక్షయ పాత్ర కాళేశ్వరం. మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి నీళ్ళను ఎత్తి పోయేచ్చు. పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజల నోరు కొడుతుండు. శ్రీశైలానికి వరద నీళ్లు వచ్చి 36 రోజుల అవుతుంది.కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చెయ్యడం లేదు. కల్వకుర్తి మోటార్లు ఇప్పటికైనా ఆన్ చేస్తరా, లేదంటే రైతులను ఆన్ చెయ్యమంటరా?. భీమా, కోయిల్ సాగర్ మోటార్లు ఆన్ చేయడంలో పూర్తిగా నిర్లక్యం చేశారు. గేట్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్. కృష్ణా జలాల వాడుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్యం చేస్తోంది. ఏపీకి నీళ్ళు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికైనా కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ హెచ్చరించారు. -
కొండారెడ్డిపల్లికి వస్తావా? కొడంగల్‌కు రమ్మంటావా?
సాక్షి, హైదరాబాద్: ‘రైతులకు ఎవరు మంచి చేశారో చర్చిద్దాం.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రొటీన్‌గా రంకెలు వేస్తూ చాలెంజ్‌లు చేస్తున్నారు. ఆయన ముచ్చట తీర్చేందుకు బీఆర్ఎస్ తరఫున నేను సిద్ధం. ఆయన స్థాయికి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి లేదా అయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో చర్చకు సిద్ధం. లేదంటే మా నాయకుడు కేసీఆర్ సొంతూరు చింతమడక, ఆయన నియోజకవర్గం గజ్వేల్ అయినా సరే. అసెంబ్లీలో పెడతావో, అంబేడ్కర్ విగ్రహం దగ్గర పెడతావో చర్చ నీ ఇష్టం. వేదిక, తేదీ, సమయం అన్నీ సీఎం ఇష్టమున్నట్లుగా నిర్ణయించుకోవచ్చు. బేసిక్స్ కూడా తెలియని సీఎం.. చర్చకు ప్రిపేర్ అయ్యేందుకు 72 గంటల గడువు ఇస్తున్నా.లేదంటే ఈ నెల 8న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 గంటలకు మేమే వేదిక ఏర్పాటు చేసి సీఎం కోసం కుర్చీ వేసి ఎదురుచూస్తాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సవాలు చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ‘తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ మినహా ఎవరూ సంతోషంగా లేరు. దండుపాళ్యం ముఠా రీతిలో బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరించి దోచుకుంటూ హామీలు అమలు చేయడం లేదు. రూ.2 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను ఏటీఎంగా మార్చి రేవంత్.. ‘పే సీఎం’లా తయారయ్యారు. చంద్రబాబు కోవర్టులా మారిన రేవంత్ ఇక్కడి నీళ్లను ఆంధ్రకు తరలిస్తున్నారు’అని మండిపడ్డారు. నిధులు ఢిల్లీకి.. నీళ్లు ఆంధ్రకు ‘తెలంగాణలో రైతు రాజ్యాన్ని తెచ్చి, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దింది ఎవరో ప్రజలకు తెలుసు. అన్నీ తెలిసీ నిజం ఒప్పుకోకుండా నటించడం రేవంత్‌కు మాత్రమే తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదం స్ఫూర్తిని దెబ్బతీస్తూ నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీ కాంగ్రెస్‌కు మళ్లిస్తూ.. కొందరు తొత్తులను రేవంత్ పదవుల్లో నియమించుకున్నారు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు ఊడదీసి కొట్టాలి అంటున్న రేవంత్‌కు కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో చెప్పులతో నిలబడటమే ఇందిరమ్మ రాజ్యం అని తెలియదా. ఎమర్జెన్సీ విధించి ఎంతోమందిని అన్యాయంగా జైల్లో పెట్టిన ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడితే నికృష్టంగా ఉంది.మాకు ఓటేస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని చెప్పి.. నిజంగానే ఆ పాత దుర్ధినాలను రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. ఎరువులను పంచడం కూడా చేతగాని సీఎం రేవంత్, చర్చకు కేసీఆర్ రావాలని సవాలు చేయడాన్ని చూసి జనం నవ్వుతున్నారు. నాలుగు పంటలకు గాను ఒక్క పంటకు ఒక్కసారి రైతుబంధు వేసి దానికి పండుగ చేసుకోమని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు. ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకుంది. వంద అసెంబ్లీ సీట్లు వస్తాయని రేవంత్ పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా ఈసారి ఓటేయదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ధర్మయుద్ధం ప్రారంభిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధర్మ పాలన సాగుతోందని.. ఎన్నో హామీలతో మభ్యపెట్టి ఓట్లు దండుకున్న కాంగ్రెస్... ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. ప్రజలను వంచించిన అధర్మ ప్రభుత్వంపై ధర్మ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్‌రావు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అప్పుల కుప్పలు.. ‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సర్వనాశనం చేశాయి. పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రాష్ట్రం పరువును బజారుకీడ్చింది. అప్పులపాలైందంటూ ప్రపంచమంతటా ప్రచారం చేస్తోంది. హామీలు అమలు చేయాలని అడిగితే ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ప్రజలను మోసగిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసినప్పుడు హామీలు ఎందుకివ్వాలి? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్నివిధాలా సాయం అందిస్తోంది. 11 ఏళ్లలో రూ. 12 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచి్చంది. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ దు్రష్పచారం చేస్తున్నారు. కేంద్రం ఏమి ఇచ్చిందో లెక్కలతో సహా వివరాలున్నాయి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం’అని రాంచందర్‌రావు చెప్పారు. యూరియా కొరత పట్టదా? కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సదస్సు అంటూ బహిరంగ సభ పెట్టి ప్రధాని మోదీ, బీజేపీని తిట్టడాన్ని రాంచందర్‌రావు తప్పుబట్టారు. సామాజిక న్యాయమంటే మోదీని, బీజీపీని తిట్టడం కాదన్నారు. ఏడాదిన్నరలో ఏం చేశారో చెప్పకుండా చిల్లర మాటలు మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని.. కేంద్రం దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపినా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల, అధికార యంత్రాంగం చేతులెత్తేయడం వల్ల రైతులకు యూరియా అందడంలేదని విమర్శించారు. ఏఐసీసీ అంటే ఆలిండియా చీటింగ్ కమిటీ బీజేపీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, కాంగ్రెస్ అధికారం కోసం, అవినీతి కోసం పనిచేసే పార్టీ అని రాంచందర్‌రావు ఆరోపించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పారు. అధికారంలోకి వచి్చన రెండేళ్లలోపే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసిన ప్రజలు... ఈసారి బీజేపీకి అవాకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ధర్మ యుద్ధం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన వ్యాఖ్యానించారు. సీఎంకు బహిరంగ లేఖ.. ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేయాలని.. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. -
కేటీఆర్.. మీరొక ఎమ్మెల్యే కదా! అసెంబ్లీలోనే చర్చిద్దాం
సీఎం రేవంత్ విసిరిన సవాల్‌కు స్పందించే క్రమంలో.. 72 గంటల డెడ్‌లైన్ విధిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. మంత్రులు పొన్నం, సీతక్కతో పాటు పలువురు కీలక నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు, సవాల్‌పై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. ‘‘కేటీఆర్ ఈ దేశంలో లేకపోవడం వల్ల మా సీఎం మాట్లాడింది తెలియనట్లు ఉంది. కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధం అన్నారు. కానీ కేటీఆర్ శాసన సభ కాదని ప్రెస్ క్లబ్‌కు రావాలని సవాల్ చేస్తున్నారు. అక్కడకు చర్చకు పిలవాల్సింది మీరు కాదు. మీరు (కేటీఆర్) ఒక ఎమ్మెల్యే. కాబట్టి అసెంబ్లీలోనే చర్చకు రండి. అంతకంటే ముందు.. ప్రతిపక్ష నేత కేసీఆర్ చేత ముందు చర్చ కోసం స్పీకర్‌కు రాయించండి.సీఎం ఒక్క మాట మాట్లాడితే కేటీఆర్‌కు ఎందుకు అంత భయం?. మనం వీధుల్లో కోట్లాడుకునే వీధి మనుషులం కాదు. శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలం. అక్కడే చర్చిద్దాం రండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్‌కు అర్దం కానట్లు ఉంది. విదేశాలలో ఉన్న కేటీఆర్ ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటే మంచిది. అసెంబ్లీ లో చర్చిద్దాం అంటే.. ప్రెస్ క్లబ్‌కు రమ్మనడం ఏంటి?. డెడ్ అయిన పార్టీ(బీఆర్ఎస్ను ఉద్దేశించి..) డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉంది. నీ సొంత చెల్లే(కవితను ఉద్దేశించి).. నిన్ను నాయకునిగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష నాయకుడు(కేసీఆర్) అసెంబ్లీకి రాడా?. సమస్యల పై చర్చింద్దాం రా అంటే భయమెందుకు?.. అని అన్నారామె.చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందిస్తూ.. కేటీఆర్ లండన్ లో బాగా రెస్ట్ తీసుకుని వచ్చి మళ్లీ రోస్టు మొదలుపెట్టారు. మా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆడిపోసుకోవడమే ఆయనకు పనిగా మారింది. అక్కసు, కుళ్లు తప్ప కేటీఆర్ లో మాటల్లో ఏ మాత్రం పస లేదు. మా ప్రభుత్వ పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. మా ప్రభుత్వ పనితీరుపై ఎప్పుడైనా మేం చర్చకు సిద్దం.ప్రజాస్వామ్యంలో చర్చకు చట్ట సభలున్నాయి. అక్కడ జరిగే చర్చలు రికార్డు అవుతాయి. అసెంబ్లీలో చర్చకు రాావాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా సవాల్ విసురుతున్నారు. కృష్ణా, గోదావరి జలాలతో పాటు అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు మేం సిద్దం. దమ్ముంటే స్పీకర్ దగ్గరకు వెళ్లి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు కోరుతు మీ పార్టీ తరపున లేఖ ఇవ్వండి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకువచ్చి చర్చ చేయమనండి అని అన్నారు. -
పొన్నం.. రేవంత్‌తో రాజీనామా చేపించు: రామచందర్‌రావు
హైదరాబాద్, సాక్షి: పార్టీని నమ్ముకున్నవారికి బీజేపీ నిరంతరం అండగా నిలుస్తుందని, అందుకు తాను ఒక ఉదాహరణ అని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పేర్కొన్నారు. అలాగే బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు పార్టీని వీడినా నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.పార్టీ అభివృద్ధికి పని చేసిన ప్రతీఒక్కరికీ కచ్చితంగా అవకాశాలు వస్తాయని రాంచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రాంచందర్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దీనికి ముందు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో అందరూ ఒకటేనని, తమ మధ్య అభిప్రాయ బేధాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ లేదని రాంచందర్‌రావు ఆరోపించారు. మతం ఆధారంగా తాము ఏ బిల్లును ఆమోదించబోమని, అసెంబ్లీలో మా పార్టీ ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడని ప్రశ్నించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు ఏమైందని రాంచందర్‌రావు కాంగ్రెస్‌ను నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులు చేయలేక తప్పులను తమపై నెడుతున్నదన్నారు. ప్రతీసారి ఢిల్లీ వెళ్లినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారన్నారు. లోకల్ బాడీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని రాంచందర్‌రావు ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేత రాజీనామా చేయించాలని, అప్పుడు బీసీని సీఎం చేస్తే, తన పదవిని రాజీనామా చేస్తానని రాంచందర్‌రావు సవాల్ విసిరారు. -
సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు రెడీ. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో 8వ తేదీన 11 గంటలకు చర్చ వస్తామని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక పథకం. రైతు బంధుపై ఆక్స్‌ఫర్డ్‌లో ప్రశంసలు వచ్చాయి. ఎరువులు కూడా ఇవ్వలేని సీఎం మమ్మల్ని విమర్శిస్తారా?. ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండితే మేము కళకళలాడేలా చేశాం. చంద్రబాబు రైతులు గొంతు కోశారు. జల దోపిడీని సీఎం రేవంత్ అడ్డుకోవడం లేదు. దత్తత పేరుతో పాలమూరును దగ చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. ఫ్లోరైడ్ మహమ్మరిని తరిమికొట్టింది కేసీఆర్ కాదా?. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే రూ.30వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చాం’ అని చెప్పుకొచ్చారు. 18 నెలలుగా తెలంగాణ టైమ్ పాస్ పాలన నడుస్తుంది. మీ స్తాయికి కేసీఆర్ అవసరం లేదు మేము చాలు.. ఎక్కడికి పిలిచిన రెడీ. 72 గంటల సమయం రేవంత్‌కు ఇస్తున్నాం. ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇస్తున్నా. ప్లేస్ ఎక్కడ అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే కాలిపోతున్న మోటార్లు, అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు. ప్రతీ మండలం లో ఎరువుల కోసం క్యూ లైన్ లో రైతులు ఎదురు చూసే పరిస్థితి. కేసీఆర్ ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చారు. రైతులకు రైతు భీమా ఎగ్గొట్టి రైతుల ఉసురు తీస్తుంది కాంగ్రెస్..చంద్రబాబు బనకచర్ల ద్వారా తెలంగాణ రైతుల గొంతు కోస్తున్న మాట వాస్తవం. ఆంధ్రా ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఒక్క హామీ అయినా నెరవేర్చారా రేవంత్?. బురద చల్లడం పక్కకు వెళ్ళడం రేవంత్‌కు అలవాటు. రుణ మాఫీ 12 వేల కోట్లు మాత్రమే చేసి రైతులను మోసం చేశారు. రేవంత్ ప్రభుత్వం రైతులను, మహిళలను, కౌలు రైతులను మోసం చేసింది. 400 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. ఒక్క కొత్త పథకం ప్రారంభించ లేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఢిల్లీకి మూటలు పంపించడం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం తప్ప రేవంత్‌కు మరో పని లేదు. రేవంత్‌కు ఓట్లు వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. చంద్రబాబు కోవర్టు రేవంత్. తెలంగాణలో జరుగుతుంది కోవర్టు పాలన’అని విమర్శించారు. -
తెలంగాణ తెచ్చుకుంది కడుక్కు తాగేందుకు కాదు
సాక్షి, హైదరాబాద్: ‘సుదీర్ఘ కాలం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కడుక్కుని తాగేందుకు, కరిగించుకుని తినేందుకు కాదు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వెనుక ఉన్న గాఢతను అర్థం చేసుకునే తెలివితేటలు ప్రస్తుత పాలకులకు లేవు. రొడ్డకొట్టుడు ఉపన్యాసాలతో, నాసిరకం పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పుట్టిందనే విషయం అందరికీ తెలుసు. కానీ ప్రస్తుత పాలకులకు సాగునీటి రంగంపై అవగాహన లేకపోవడంతో జరుగుతున్న నష్టంపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.ఒకటి రెండు రోజుల్లో నేను స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తా’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పార్టీ నేతలతో అన్నారు. వైద్య పరీక్షల కోసం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌ను పలువురు పార్టీ నేతలు శుక్రవారం పరామర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ సాగు నీటి రంగంపై ప్రస్తుత పాలకులకు కనీస అవగాహన లేదు. వారికి తోక తెలియదు.. మూతి తెలియదు. బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టంపై నేనే స్వయంగా ఆదివారం (సూచనప్రాయంగా) మీడియాతో మాట్లాడతా. నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేడు సాయంత్రం డిశ్చార్జి అయిన తర్వాత నందినగర్ నివాసంలోనే ఉంటా’అని కేసీఆర్ తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ నేతలతో ఇష్టాగోష్టి తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించినట్లు తెలిసింది. బనకచర్లపై తన ప్రెస్‌మీట్ తర్వాత పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చిరుమర్తి లింగయ్య, శంకర్‌నాయక్, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేశ్, నాగేశ్, సతీశ్‌రెడ్డి తదితరులు ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.