మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర అయోమయం నెలకొంది. ఒకే పదవికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గెలుపు పత్రాలు జారీ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
వివరాలు ఇలా.. మొదటగా మూడు ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూనావత్ స్వాతి గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు గెలుపు పత్రాలు అందజేశారు. అయితే అనంతరం కాంగ్రెస్ పార్టీ రీకౌంటింగ్‌కు డిమాండ్ చేయడంతో మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. రీకౌంటింగ్ అనంతరం ఒక్క ఓటు ఆధిక్యంతో సానుప సుజాత గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు కూడా గెలుపు పత్రాలు ఇవ్వడం గమనార్హం. దీంతో ఇద్దరు అభ్యర్థులు తామే విజేతలమని చెప్పుకుంటూ పోటీ పడుతున్నారు.
ఇదే సమయంలో దామరవంచ గ్రామంలో మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఉండగా, అందులో 5 మంది కాంగ్రెస్ పార్టీకి, 5 మంది బీఆర్‌ఎస్‌కు చెందినవారు గెలుపొందారు. ఈ సమబలం పరిస్థితి కూడా గ్రామ రాజకీయాల్లో అయోమయానికి దారి తీసింది. ఒకే ఎన్నికలో ఇద్దరికి గెలుపు పత్రాలు ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ గ్రామనికి సర్పంచ్ ఎవరని తేల్చాల్సింది అధికారులే


