అందుకే కేసీఆర్ బయటకు వచ్చారు
కుటుంబ రాజకీయాలే ఆ పార్టీ పతనానికి కారణం
పాలమూరు–రంగారెడ్డిపై కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు: మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రజలు ఏమనుకుంటున్నారో అనే స్పృహ కూడా లేకుండా మాట్లాడారు: మంత్రి వాకిటి శ్రీహరి
తోలుతీసే సమస్యలేమి ఉన్నాయో అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీకి తోలు తప్ప కండ లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కండ కరిగిపోయిందని గ్రహించిన తర్వాతే కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం ఇప్పుడు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పతనానికి కుటుంబ రాజకీయాలే కారణమని చెప్పారు. ‘కొడుకు, అల్లుడు వ్యవహారశైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందని కేసీఆర్‌కు ఆలస్యంగా అర్ధమైంది.
అందుకే పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు. రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వదిలి బయటకు వచ్చారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు. గాడిద గుడ్డు కాదు’అని అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వమే దద్దమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.
బండ కూడా పగలకొట్టలేదు..
సంగంబండ ప్రాజెక్టులో బండ పగలకొడితే 20 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్న ఆలోచన కూడా పదేళ్లలో కేసీఆర్‌కు రాలేదని, కాళేశ్వరంపై ఉన్న తపన ఆయనకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని రాష్ట్ర క్రీడా, పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా చూశారని, కానీ ఆయన పాత పురాణమే చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు ప్రజలు ఏమనుకుంటారోననే స్పృహ కూడా లేకుండా ఆయన మాట్లాడారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తోలు తీశారని చెప్పారు.
సలహాలు సూచనలు ఇవ్వాలని అడిగాం
ప్రభుత్వపరంగా ఏదైనా పొరపాటు జరిగితే ప్రతిపక్ష పార్టీగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఇప్పటికే అనేకసార్లు తాము బీఆర్‌ఎస్‌ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని, అందుకే అన్ని ఎన్నికల్లో ఎవరి తోలు తీయాలో వారి తోలు తీశారని చెప్పారు. అయినా ప్రభుత్వం తోలు తీసే సమస్యలేవైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ సీఎం కేసీఆర్‌కు సూచించారు.


