సాగునీటి రంగాన్ని దారుణంగా నాశనం చేసింది ఆయనే
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపాటు
కాళేశ్వరం కూలిపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆరే కారణం
ఆ ప్రాజెక్టు చేపట్టకుండా ఉంటే మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై 90 శాతం పచ్చి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని దారుణంగా, దుర్మార్గంగా నాశనం చేసింది ఆయనే అని ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తి, అవగాహన లోపం, అసమర్థత, చేతకానితనంతో 10 ఏళ్లలో ప్రాజెక్టులపై రూ.లక్షా 81 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు జీరో ప్రయోజనం చేశారని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లు కూలిపోవడానికి.. సీఎంగా, నీటిపారుదల, ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్‌దే బాధ్యత అని, కేసీఆరే ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా తేలి్చందని అన్నారు. ఆదివారం రాత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం చేపట్టకుంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి..
‘కాళేశ్వరం అంత పెద్ద కుంభకోణం మరొకటి జరగదేదని ఘోష్ కమిషన్, విజిలెన్స్, కాగ్ ఎన్డీఎస్‌ఏ తేల్చాయి. ఈ విషయంలో చట్టప్రకారం ముందుకు పోతున్నాం. అంతర్జాతీయ నిపుణులతో కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణను వాటి నిర్మాణ సంస్థలతోనే పూర్తి చేయిస్తాం. రూ.38,500 కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్ల పనులు పూర్తయ్యాక అధిక కమీషన్ల కోసం అర్ధాంతరంగా వదిలేసి దాని స్థానంలో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం చేపట్టకుండా ప్రాణహిత–చేవెళ్లనే నిర్మిస్తే మిగిలిపోయే రూ.65 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి..’ అని ఉత్తమ్ అన్నారు.
ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు?
‘కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టుతో పాటు పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ సమాధానం ఇవ్వాలి. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్‌లో ఎన్నికలకు 2 ఏళ్ల ముందు శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకాలను ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్కటైనా పూర్తి చేశారా? మార్పులు చేయకుంటే రూ.4,500 కోట్లతో ఈ ప్రాజెక్టులు పూర్తయి 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది.
పాలమూరు కింద ఎకరా ఆయకట్టు ఇవ్వలేదు..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని కేసీఆర్ అంటున్నారు. దాని కింద ఒక్క ఎకరమైనా ఆయకట్టు ఇచ్చారా? ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు గత ప్రభుత్వమే సవరించగా, రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ను 2023 ఏప్రిల్ 12న కేంద్రం తిప్పి పంపింది. అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రి కేసీఆరే..’ అని ఉత్తమ్ చెప్పారు.
45 టీఎంసీలకు తగ్గింపు అబద్ధం...
‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించేందుకు కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని కేసీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే 90 టీఎంసీలతో ప్రాజెక్టుకు జీవో ఇచ్చాం. తొలి విడత ప్రాజెక్టును మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలతో చేపట్టడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అనుమతించింది. గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచి్చన మరో 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకి కేటాయించాలని కేంద్రంతో మేము నిరంతరం కొట్లాడుతున్నాం..’ అని మంత్రి పేర్కొన్నారు.
ఏపీకి కేసీఆర్ సహకరించారు
‘ఉమ్మడి ఏపీలో 2004–14 మధ్యలో ఏపీ రోజుకి 4.1 టీఎంసీల సామర్థ్యంతో కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోగా, తెలంగాణ వచ్చాక కేసీఆర్ సహకారంతో రోజుకు 9 టీఎంసీలు అక్రమంగా తరలించుకునేలా సామర్థ్యాన్ని పెంచుకుంది. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు కేసీఆర్ సహకరిస్తే మేము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులను ఆపివేయించాం. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఏపీ 2004–14 మధ్యలో 727 టీఎంసీలను అక్రమంగా తరలించగా, కేసీఆర్ సీఎం అయ్యాక 2014–23 మధ్యలో 1442 టీఎంసీలను అక్రమంగా తరలించుకుంది. పోతిరెడ్డిపాడు విస్తరణకు కేసీఆర్ సహకరించారు. ఆయన కాలంలోనే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ఉత్తమ్ తెలిపారు.


