పాలమూరు–రంగారెడ్డిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం
సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ పట్టు
కేఆర్‌ఎంబీ మీటింగ్స్ మినట్స్ పెట్టేందుకు వివరాల సేకరణ
అసెంబ్లీ సమావేశాల్లోపే ప్రధానికి లేఖ రాసే యోచనలో కేసీఆర్
నేడో రేపో మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో బీఆర్‌ఎస్ అధినేత సమావేశం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెనక్కి వచ్చినా ఏడాదిగా ప్రభుత్వం స్పందించక పోవడం.. 45 టీఎంసీలు చాలు అంటూ లేఖ రాయడం వంటి అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఓ వైపు అధికార పక్షం సవాలు విసురుతుండగా, దీటుగా ప్రతిస్పందించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు నదీజలాల్లో తెలంగాణ వాటా, ఏపీ నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్రం వైఖరి తదితరాలను శాసనసభలో కేసీఆర్ స్వయంగా వివరించే అవకాశాలు ఉన్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ మినట్స్‌ను సేకరించే పనిలో బీఆర్‌ఎస్ నిమగ్నమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకూ అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరేందుకు బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సన్నద్ధమవుతోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లోపే నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాయనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా తర్వాతే కేసీఆర్ హాజరుపై స్పష్టత వచ్చే అవకాశముంది.
సంక్రాంతి తర్వాత తొలి బహిరంగ సభ
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులతోపాటు నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరుబాట పట్టిన బీఆర్‌ఎస్.. అసెంబ్లీ సమావేశాల తర్వాతే బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే నెల జనవరి మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయనే ప్రచారమున్న నేపథ్యంలో ఆ తర్వాతే సభల నిర్వహించేలా షెడ్యూలు ప్రకటించే అవకాశముంది. సభల నిర్వహణ తేదీలు, వేదికలు ఖరారు చేసేందుకు ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించే అవకాశముంది.
26న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ జరిపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మూడు ఉమ్మడి జిల్లాల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి నిర్వహించాల్సిన సన్నాహక సమావేశాలకు సంబంధించి ఈ భేటీల్లో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో చేవెళ్ల, నల్లగొండ జిల్లా పరిధిలో మల్లేపల్లిలో సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర లేదా నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో పరిధిలో నిర్వహించే సభా వేదికను ఖరారు చేయాల్సి ఉంది. జన సమీకరణ, నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు వంటి అంశాలపై కేసీఆర్‌తో జరిగే భేటీలో స్పష్టత వస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.


