మళ్లీ.. అధికారం మాదే: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Fires On BRS Leader KCR | Sakshi
Sakshi News home page

మళ్లీ.. అధికారం మాదే: సీఎం రేవంత్‌

Dec 25 2025 2:46 AM | Updated on Dec 25 2025 2:46 AM

CM Revanth Reddy Fires On BRS Leader KCR

119 ఉంటే 80.. 153 ఉంటే 100 సీట్లకు పైగా గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్‌ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ.. 

కొడంగల్‌ గడ్డ మీద నుంచి ఇదే నా సవాల్‌.. ఇదే నా శపథం 

బీఆర్‌ఎస్, కల్వకుంట్ల చరిత్ర గతమే.. తెలంగాణ భవిష్యత్‌ కాంగ్రెస్సే.. 

పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు,చిన్న జీపీలకు రూ.5 లక్షలు ఇస్తాం 

అన్ని ప్రభుత్వ బడుల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం  

పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం వెల్లడి

వచ్చే ఏడాది మార్చిలో రూ.3 వేల కోట్లు పంచాయతీలకు ఇస్తాం. నూతన సంవత్సరం కానుకగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఇస్తాం. చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు,పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అదనం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నుంచి నేరుగా సర్పంచ్‌లకు ఈ నిధులు పంపించే బాధ్యత తీసుకుంటాం. గ్రామ పంచాయతీల్లో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ నిధులు వాడుకోండి. దుర్వినియోగం చేయొద్దు.

విద్యతోనే రాష్ట్ర, దేశాభివృద్ధి సాధ్యం. కొడంగల్‌ నియోజకవర్గంలో సర్కారు బడుల్లో చదువుకుంటున్న 25 వేల మంది పిల్లలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో అల్పాహారం, భోజనం అందుబాటులోకి తెస్తాం. మంచి భోజనంతోపాటు నాణ్యమైన విద్యనూ అందిస్తాం. కావాల్సిన వసతులు కల్పిస్తాం. మీ పిల్లలను సర్కారు బడులకు తీసుకురండి.


సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 119 నియోజకవర్గాలు ఉంటే 80 సీట్లతో, డీలిమిటేషన్‌తో 153 ఉంటే 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తాం’అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘నీ రాజకీయమేందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కాలకూట విషం లాంటి కేసీఆర్‌ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ. కొడంగల్‌ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్‌ కుటుంబానికి అధికారం అనేది ఓ కల. బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ చరిత్ర గతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్‌ లేదు. రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేదేమీ లేదు. తెలంగాణ భవిష్యత్‌ కాంగ్రెస్సే’అని రేవంత్‌ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్‌ హాల్లో బుధవారం కొడంగల్‌ నియోజక వర్గంలోని పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నూతన సర్పంచ్‌లకు శాలువాలు కప్పి సన్మానించిన తర్వాత సీఎం మాట్లాడారు. ఆయన మాటల్లోనే...  

మీరు రండి.. ముఖాముఖి చర్చిద్దాం.. 
‘కేసీఆర్‌.. నీ వయసు, అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడిగా మీకు హోదా ఉంది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశాం. 29 నుంచి చర్చలు జరగనున్నాయి. ఆ రోజు మీరు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తాం. మీరు చెప్పినవన్నీ చర్చకు పెడతాం. ముఖాముఖి చర్చిద్దాం. వెనుక మాట్లాడి.. వెనుక ఉరుకుడు కాదు. అభివృద్ధి, రైతు భరోసా, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడుదామా చెప్పండి. లేకపోతే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి. అప్పులా, నీళ్లా, మీరు కట్టి కూలిన కాళేశ్వరమా, టెలిఫోన్‌ ట్యాపింగా, ఇంకా అభివృద్ధి మీదనా. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లపైనా.. దేనిపైనైనా నేను సిద్ధం. మీరు మొహం చాటేసి.. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్‌కు వచ్చి.. పది మంది చెంచాలను పెట్టుకుని వారి ముందు పొంకనాలు కొట్టుడు కాదు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ అంటూ సభ పెడతాడట. మీరు ఎక్కడైనా పెట్టుకోండి. నేను వద్దన్నానా. ఎన్నికలు ముగిసినయ్‌.. ఇంకా సందులకు రమ్మంటే ఎలా? చర్చ చేయడానికి సభ ఉంది. ప్రజలు అసెంబ్లీలో చర్చ చేయమని చెబుతుండ్రు. ఎవరేం మాట్లాడుతారో వారు వింటరు. ఆ తర్వాత విజు్ఞలైన ప్రజలే తీర్మానం చేస్తరు.  

ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా.. 
కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌నే బందీఖానా చేసుకున్నడు. ఆయన్ను అరెస్ట్‌ చేసి చర్లపల్లి, చంచల్‌గూడకు పంపించినా ఇదే అయితది. ప్రభుత్వానికి తిండి బరువు. ఆయన మీద ఒక్క కేసూ పెట్టలేదు. కేసీఆర్‌ నా మీద 181 కేసులు పెట్టి చర్లపల్లి, చంచల్‌గూడ జైల్లో బంధించాడు. నన్ను ఎన్నో రకాలుగా సతాయించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలను ఆస్తులను గుంజుకుండ్రు. కేసులు పెట్టి హింసించిండ్రు. నాకు ఈ బాధ్యత వచ్చాక ఆలోచన చేశా. బాధను దృష్టిలో పెట్టుకుని పగ సాధించే కార్యక్రమం పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించా. పైన దేవుడు చూస్తున్నడు. వాళ్ల పాపాలన్నీ దేవుడు మిత్తితో తీరుస్తుండు. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన నడుం ఇరిగింది. అసెంబ్లీలో ఓడగొట్టినం. పార్లమెంట్‌ ఎన్నికల్లో గుండుసున్నా చేసినం. ఇటీవల జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12,726 స్థానాల్లో 8,335 మందిని గెలిపించుకున్నాం. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా?  

నన్ను గెలక్కు.. అన్నీ చూశా.. 
నా తోలు తీస్తానని అంటావా.. షేక్‌పేటలో మటన్‌ కొట్టు మస్తాన్‌ ఉంటడు. ఆయన రోజూ మేకలు కోసి మండి నడుపుతుంటడు. కేసీఆర్‌ ఖాళీగా ఉన్నడు. తోలు తీస్తడు.. ఆయనకు నౌకరీ ఇవ్వమని చెప్పిన. నౌకరీ అయ్యాక ఇంటికి పోయేటప్పుడు దావత్‌కు ఉచితంగా ఇంత బోటి, కాళ్లు, తలకాయ పెట్టు పాపం.. సాయంత్రం రెండేసేటప్పుడు తీసుకుంటడని. మాజీ సీఎంగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, సీఎంగా పనిచేశానని చెప్పుకునే నువ్వు ఇలాంటి మాటలా మాట్లాడేది. మేము ఫ్యూచర్‌ సిటీ కడుతుంటే తొక్క, తోలు అంటవా. మా సర్పంచులు వచ్చారు. నువ్వు తోలు తీసుడు కాదు. నిన్ను చీల్చి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీసి కొడ్తరు. కొడంగల్‌ వస్తవా.. మమ్మల్నే చింతమడకకు రమ్మంటవా. ఒక్కటైనా అక్కరకొచ్చే మాట మాట్లాడావా? నన్ను గెలక్కు. నేను అన్నీ చూసిన. నల్లమల అడవుల నుంచి వచ్చిన.  

కక్ష సాధింపు రాజకీయాలు చేయం.. 
హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోయిందని కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ విమర్శిస్తడు. తండ్రి ఏమో ప్రభుత్వం రియల్‌ దందా చేస్తోందంటడు. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ వల్ల అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారం, ఆదాయం పెంచుతుంది. నేను అయ్య పేరు చెప్పి మంత్రిని కాలే. పాస్‌పోర్టు బ్రోకర్ల దందా చేయలే. ఆంధ్రలోని గుంటూరు, గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ గురించి. మీ జాతినంతా తెచ్చుకో.. మా ఊరికొస్తవా? లేదా మేమే మీ ఊరికి రావాలా? గతంలో గజ్వేల్‌ వచ్చి చూడు అన్నావ్‌. లక్షల మంది కార్యకర్తలతోపోయి తొక్కితే పాతాళానికి పోయినవ్‌. మేం కక్ష సాధింపు రాజకీయాలు చేయం. ఎవరి సొమ్ము గురించి ఆలోచన చేయం. మా కాళ్లలో కట్టెలు పెడితే మాత్రం ఊకోం. మా సంగతి చూపిస్తాం.  

ఇప్పటికైనా మారండి.. 
సొంత బిడ్డ అని చూడకుండా ఇంటి అల్లుడి ఫోన్లనే ట్యాపింగ్‌ చేసిండ్రు. ఇంతకన్న సిగ్గులేనోడు ఉంటడా అని వాళ్ల బిడ్డ వాళ్లే అంటుండ్రు. సొంత చెల్లికే బుక్కెడు బువ్వ పెట్టనోడు ఒక మనిషా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తదని మెడబెట్టి బయటకు పంపితివి. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేనోడు నాకు సవాల్‌ విసురుతుండు. నా సంగతి నీకు తెల్వదు. మీ నాయనను అడుగు.. నా గురించి చెబుతడు. ఇంకో ఆయన కేసీఆర్‌ గర్జించాడని మాట్లాడుతుండ్రు. గాండ్రింపులు, ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. మీ తోలు సంగతి ముందు తెలుసుకోండి. మేం నాటు కోడి తోలు తీసి, పసుపు పూసినట్లు పూస్తాం. అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు పోతున్నయ్‌. ఇప్పటికైనా మారండి. లేకపోతే దేనికీ పనికి రాకుండా పోతరు. తెలంగాణలో ప్రతిపక్షం లేదంటే సిగ్గుపోతది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement