సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: తెలంగాణ వ్యాప్తంగా సోమవారం గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో పల్లెల్లో కొత్త పాలన మొదలైంది. మొత్తంగా 12,702 పంచాయతీలకు సర్పంచులు, ఉప సర్పంచులు, 1,11,803 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొన్నిచోట్ల పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో, కొన్నిచోట్ల భవనాలు నిర్మాణ దశలో ఉండటంతో ఓ చోట కిరాణా షాపులో, మరోచోట ఆరుబయట, ఇంకోచోట చెట్ల కింద సర్పంచులు, వార్డుసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పలుచోట్ల కొలువుదీరిన మొదటి రోజునుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలకవర్గాలు తీర్మానాలు చేయడం విశేషం.

కిరాణా షాపులో అధ్యక్షా..
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్, ఇతర భవనాలు అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్‌గా ఎన్నికైన పావని తన కిరాణా దుకాణంలోని సగభాగంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పాలకవర్గ సభ్యులకు ఇబ్బందికరంగా ఉండటంతో ఆరుబయట ప్రమాణ స్వీకారం చేశారు.

చెట్ల నీడలోనే...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూ రుపాడు మండలంలోని నల్లబండబోడు, చింతలతండా గ్రామపంచాయతీల భవనాలు నిర్మాణంలో ఉండటంతో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు చెట్ల కిందే టెంట్ నీడలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఇదే మండలం గురువాగుతండా, శంభునిగూడెం, సాయిరాంతండా, గాం«దీనగర్‌ల్లో సొంత భవనాలు లేక పాఠశాల భవనాల్లో పాలకవర్గాలు ప్రమాణం చేశాయి.

మద్యపాన నిషేధంతో మొదలు
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు స్వగ్రామం, సిద్దిపేట జిల్లా భూంపల్లి–అక్బర్‌పేట మండలం బొప్పాపూర్‌లో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి రోజు సంపూర్ణ మద్య నిషేధంపై తొలి తీర్మానం చేశారు. బెల్ట్‌షాపులపై నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్మానం చేశారు. తర్వాత స్వచ్ఛ బొప్పాపూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పని చేసి.. ప్రమాణం చేశారు..
నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలోని కొంపల్లి నూతన సర్పంచ్ జంగాల సాలమ్మ ప్రమాణస్వీకారానికి ముందు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానికులతో కలిసి చీపురుపట్టి వీధులను శుభ్రపరిచారు. ఆ తరువాత పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ప్రమాణం చేశారు.

అద్దె ఇల్లు తీసుకుని..
సిద్దిపేట జిల్లా గాంధీనగర్, బంజేరుపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో సర్పంచ్‌లు అద్దె ఇల్లును తీసుకున్నారు. ఇది అనువుగా లేకపోవడంతో ఆరుబయటే ప్రమాణం చేశారు. మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంతో పాటు వంగపల్లి, హనుమతండా, రెడ్యానాయక్ తండా, దుబ్బతండా గ్రామాల్లో సొంత భవనాలు లేకపోవడంతో ఓ చోట టెంట్ వేసి ప్రమాణం చేశారు.

బడిలో ‘పంచాయతీ’
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలో నడిమితండా, సీతానగర్ పంచాయతీ కార్యాలయాలు ప్రాథమిక పాఠశాలలోని ఓ తరగతి గదిలో కొనసాగుతుండగా, గొల్లకుంట తండా పంచాయతీ కార్యాలయం ఓ ఇంట్లో నిర్వహిస్తున్నారు. అలాగే, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలను స్కూళ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాల ఆవరణలోనే టెంట్ వేసి ప్రమాణం చేశారు.

గుర్రంపై వచ్చిన సర్పంచ్
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రవీందర్ పటేల్ ప్రమాణ స్వీకారానికి గుర్రంపై వచ్చాడు. బ్యాండుమేళాలతో పెళ్లి బారాత్ ఊరేగింపు మాదిరిగా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు.
రంగుల ‘పంచాయితీ’
కాంగ్రెస్ కార్యాలయంలా రంగులు వేసిన పంచాయతీ భవనంలో తాము ప్రమాణం చేయబోమని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు నిరసన వ్యక్తంచేయడంతో పోలీసులు, అధికారులు వచ్చి సర్దిచెప్పారు.
అంబులెన్స్‌లోనే ప్రమాణం
జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా గెలుపొందారు. రెండు రోజుల క్రితం అలేఖ్య అనారోగ్యం బారినపడి అస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఉపసర్పంచ్‌గా ఆమె తండ్రి చండి పర్శయ్య, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆస్పత్రిలో ఉన్న అలేఖ్య అంబులెన్స్‌లో గ్రామానికి రాగా.. అధికారులు అందులోనే అలేఖ్యతో ప్రమాణం చేయించి సంతకాలు తీసుకున్నారు.
పురిటి నొప్పులతో వచ్చి..
నారాయణపేట జిల్లా ఊట్కూరు సర్పంచ్‌గా గెలుపొందిన రేణుకకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు కుటుంబసభ్యులు ఆమెను పంచాయతీ కార్యాలయానికి తీసుకురాగా కార్యదర్శి శ్రీనివాసరావు ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది.
ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి
నల్లగొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన బోయపల్లి రాజేష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. ఆయన తండ్రి మాజీ సర్పంచ్ బోయపల్లి సురేందర్ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ప్రమాణం వాయిదా పడకూడదని భావించిన రాజేష్ బాధను దిగమింగుతూ బాధ్యతల స్వీకరణ పత్రాలపై సంతకాలు చేశారు.
కింద కూర్చునే బాధ్యతల స్వీకరణ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి (కె) కొత్త పంచాయతీ. కార్యాలయానికి పాఠశాల ఆవరణలోని ఓ గదిని కేటాయించారు. కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో నిరసనగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కింద కూర్చునే పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఒక గ్రామం.. ఇద్దరు సర్పంచ్‌లు!
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయ తీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలో మొత్తం 1,268 ఓట్లు ఉండగా.. 1,141 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన సనప సుజాతకు 549 ఓట్లు, బీఆర్‌ఎస్ మద్దతుతో బరిలో ఉన్న నూనావత్ స్వాతికి 552 ఓట్లు వచ్చినట్లు ఫలితాల సందర్భంగా అధికారులు ప్రకటించారు. దీంతో స్వాతికి గెలుపుపత్రం ఇచ్చారు. సుజాత రీకౌంటింగ్ కోరగా.. తిరిగి ఓట్లను లెక్కించారు. స్వాతికి 549 ఓట్లు, సుజాతకు 550 ఓట్లు వచ్చినట్లు తేల్చారు. ముందుగా స్వాతికి ఇచ్చిన గెలుపు పత్రం వెనక్కి తీసుకోకుండానే... రిటర్నింగ్ అధికారి సుజాతకు మరో గెలుపు పత్రం అందజేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం కోసం ఇరువర్గాలకు చెందిన వారు తమ అనుచరులతో పంచాయతీ కార్యాలయానికి రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సుజాత గెలిచినట్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ప్రకటించి ప్రత్యేకాధికారి మంగీలాల్ ఆమెతో ప్రమాణం చేయించారు.

95 ఏళ్ల వయస్సులో సర్పంచ్‌గా
తిరుమలగిరి (తుంగతుర్తి): 95 ఏళ్ల వయసులో సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌తో కలిసి ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
ర్యాలీలో ఉద్రిక్తత
మర్రిగూడ (చింతపల్లి): నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య తన ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ర్యాలీలో ప్రత్యర్థి వర్గీయులు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వెంబడించడంతో వారు పరారయ్యారు. పలువురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు.


