breaking news
-
పవన్.. అప్పుడు ఊగిపోయావు.. ఇప్పుడేమైంది?: జగ్గారెడ్డి
సాక్షి, విజయవాడ: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మోదీ కన్నుపడింది. అందుకే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ స్టీల్‌ప్లాంట్‌పై ఊగిపోతూ మాట్లాడారు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కుకి ఎంతో చరిత్ర ఉంది. 1966లో స్టీల్ ప్లాంట్ కోసం అమృతరావు నిరాహారదీక్ష చేశారు. పార్లమెంట్లో విశాఖ స్టీల్‌పై ఇందిరాగాంధీ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రరాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారింది. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. ఆంధ్రుల ఆస్తి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టాలనే కుట్ర మొదలైంది. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్‌కు నాయకులు లేకుండా పోయారు.. కార్యకర్తలు మిగిలారు. ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఊగిపోతూ మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి తీసుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు చంద్రబాబు సీఎం అయ్యాడు. ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారు. కుల పిచ్చిలో ఏపీ ప్రజలు నాయకులను ఎన్నుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
అసెంబ్లీ తర్వాతే 3 జిల్లాల్లో ‘పాలమూరు’ సభలు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ తలపెట్టిన పోరుబాట బహిరంగ సభల షెడ్యూల్‌ను అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాతే ఖరారు చేయాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ పథకానికి నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరి«ధిలో బహిరంగ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో కేసీఆర్ శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు.ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుతోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో సభల నిర్వహణ షెడ్యూల్‌పై చర్చించినప్పటికీ అసెంబ్లీ సమావేశాల తర్వాతే ఖరారు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే బహిరంగ సభల తేదీల ఖరారు కోసం ఎదురుచూడకుండా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.ఈ పథకంతో ప్రయోజనం చేకూరే అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో సన్నాహక సభలు, సమావేశాలు నిర్వహించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి నియో జకవర్గ స్థాయి వరకు సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సభలు, సమావేశాల పోస్టర్లు, కరపత్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మరోవైపు ఈ నెల 29న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తొలి రోజు భేటీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం.అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఏయే అంశాలను చర్చిస్తారనే ఎజెండాను చూసిన తర్వాత మిగతా రోజుల్లో సభకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై స్పష్టత రానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్‌కు సంబంధించిన అంశాలకే పరిమితం కాకుండా ప్రజాసమస్యలన్నింటిపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా ఫీజు రియింబర్స్‌మెంట్, పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు, రైతాంగ సమస్యలు, ఎరువుల కొరత వంటి అంశాలపై చర్చ కోసం పట్టుబట్టాలని ఆదేశించారు. -
అసెంబ్లీకి కేసీఆర్?.. మాస్టర్ ప్లాన్ ఇదేనా!
సాక్షి,హైదరాబాద్: వచ్చే వారంలో ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ అంశంపై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన వెలువడనుంది.శుక్రవారం పార్టీ నేతలతో కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చ జరిగింది. సమావేశంలో నేతలతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లి బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని, అసెంబ్లీ వేదికగా నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో ఈ రెండు ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలోనూ తెలంగాణకు ద్రోహం చేసిందని ఆరోపించారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు లేదని స్పష్టం చేశారు. -
రేవంత్‌ను భీమవరం బుల్లోడు అనాలా?: కేటీఆర్
ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని రేవంత్‌రెడ్డి నెరవేర్చలేదని.. అది అడిగినందుకే కేసీఆర్‌పై ఆయన నోరు పారేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారం దక్కనివ్వనని శపథం చేసే బదులు.. ఆ హమీలేదో నేరవేర్చేందుకు శపథం చేయాలంటూ సెటైర్లు వేశారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు(KTR Slams CM Revanth Reddy). శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. రోజూ తిట్ల పురాణం తప్ప రేవంత్ చేసేదేమీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఏం భాష?. హైదరాబాద్ గల్లీల్లో తిరిగిన నేను కూడా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు లో బూతులు తిట్టగలను. ఏనుగు లాంటి కేసీఆర్ ను తిడుతున్నారు, చావు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని గీతమ్మ జాగ్రత్తగా చూసుకోవాలి..ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. సోనియా, ప్రియాంక గాంధీ మీద ఒట్టు పెట్టి హామీలు ఎగవేశారు. నెలకు రూ. 2500 ఇవ్వడానికి మొఖం లేదు కానీ, కోటి మంది మహిళలను కోటీశ్వరులు కావాలట!. సీఎం పెద్ద పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారు. రోడ్లపై పెయింట్ వేసుకునే రేవంత్ రెడ్డి పెద్ద స్థాయికి వస్తే మంచిదే. కానీ మంచి పనులతో రావాలి. పేమెంట్ కోటాలో సీఎం అయ్యి... ఇప్పుడు కూడా నెలనెలా ఢిల్లీకి సంచులు పంపుతున్నారుకాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమే. కాంగ్రెస్ పాలనలో ఒక్క చెరువు కట్టలేదు. మేడిగడ్డ ఆనకట్టను కూల్చిన కాంగ్రెస్ నేతలు... ఇపుడు బీఆర్ఎస్ కట్టిన చెక్ డ్యాంలను బాంబులతో పేలుస్తున్నారు. ఇసుక దందాల కోసమే ఆ పని చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి కొడుకు భూములు కబ్జా చేస్తుంటే కేసు పెట్టిన పోలీసు అధికారిని లూప్ లైన్లో పెట్టారు..కేసీఆర్ దయతో అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే అయ్యాడు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పేరు గాంధీ... చేసేవి గాడ్సే పనులు. భూకబ్జాలకు పాల్పడుతున్నారాయన. దమ్ముంటే గాంధీ శేరిలింగంపల్లి క్షేత్రానికి రావాలి, ఆ ఉప ఎన్నికల్లో తేల్చుకుందాం. కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్లోనే ఉన్నామని చెబుతున్నారు. స్పీకర్ కళ్లు ఉండి చూడలేని ధృతరాష్ట్రునిలా తయారయ్యారు. ఎన్నికలకు భయపడి పదిమంది ఎమ్మెల్యేలు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంగల్లా కలిసినా మనం గట్టిగా కొట్లాడదాం. ..ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని రేవంత్‌రెడ్డి అమలు చేయడం లేదు. ముందు ఆ హామీలను నెరవేరుస్తానని శపథం చేయాలి. కోటి మంది మహిళలకు జనవరి ఒకటి నుంచి నెలకు రూ.2500 ఇస్తామని రేవంత్ రెడ్డి శపథం చేయాలి. హామీ ఇచ్చినట్లు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి శపథం చేయాలి. పాలమూరు - రంగారెడ్డి గురించి కేసీఆర్ అడిగితే సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హామీల అమలు గురించి కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారుకేసీఆర్ బయటకు రా అని కాంగ్రెస్ నేతలు అన్నారు. తీరా కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్ పెడితేనే ముచ్చెమటలు పట్టి చలిజ్వరం తెచ్చుకున్నారు. అలాటింది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తారు. నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి? తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా?. మా నాన్నను తిడుతున్నందుకు నాకు చాలా కోపం ఉంది, నేను గుంటూరులో చదివితే తప్పేమిటి... రేవంత్ రెడ్డి లాగా చదువు లేకుండా తిరగలేదు. నేను ఆంధ్రాలో చదివితే తప్పు అట కానీ, ఆయన ఆంధ్రా అల్లుడిని తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా?. రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు. అమెరికాలో ఎవరి పని వారు చేసుకోవాలి, నేను చేసుకుంటే తప్పా?.. ఆయనలా దొంగ పనులు చేయలేదు. ఢిల్లీకి సంచులు మోసుకుంటూ గులాంలాగా బతకబోం. తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వబోమని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు ఆయన్ను కొడంగల్‌లో గెలవకుండా చూద్దాం. నిజమైన మార్పు ఊళ్ళల్లో సర్పంచ్ ఎన్నికల్లో ప్రారంభం అయింది. బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్న హైదరాబాద్ వాసులకు పాదాభివందనం చేసినా తప్పులేదు. హైదరాబాద్‌ను ఎన్ని కార్పొరేషన్లు చేసినా గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలి. 2026లో గట్టిగా కష్టపడితే... 2027లో ఎన్నికల వాతావరణ వస్తుంది, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు పోరాడదాం అని బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. -
సావు భాష తప్ప సోయి లేని వ్యక్తి రేవంత్: హరీష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ చిల్లర రాజకీయాలకు, విధ్వంసకర పాలనకు రైతులు బలైపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా..‘సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందే. అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు. నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని నువ్వు ముఖ్యమంత్రివా? అని ప్రశ్నించారు.అలాగే, యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన నీ యూరియా యాప్ ఏమైంది?. యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?. మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుంటే, రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదేనా మీరు చెప్పిన “మార్పు”?. గత సీజన్లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి కూడా మీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా? అంటూ ఘాటు విమర్శలు చేశారు. సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందే.“అందరినీ తొక్కుకుంటూ వచ్చాను” అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు.నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు… pic.twitter.com/9ZLU4tce3v— Harish Rao Thanneeru (@BRSHarish) December 26, 2025 -
ఎవరికీ భయపడను.. నా బ్రాండ్ ఇమేజ్ అదే: దానం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడను అని.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు కుండబద్దలు కొట్టారు. అదే తన బ్రాండ్ ఇమేజ్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దానం హాట్ టాపిక్‌గా మారారు.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. నేను ఏ విషయమైనా డైరెక్ట్‌గానే చెబుతాను. ఎవరికీ భయపడే రకం కాదు. నేను కాంగ్రెస్ ఉన్నానని ధైర్యంగా చెబుతున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం శ్రమిస్తాను. జీహెచ్ఎంసీ వార్డుల విభజన శాస్త్రీయబద్దంగా జరిగింది. దేశంలో హైదరాబాద్ నెంబర్-1గా ఉండటానికి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. హైడ్రా నా సలహాలు పరిగణనలోకి తీసుకుంది. అందుకే పేద, మధ్య తరగతి ఇళ్ల జోలికి వెళ్లడం లేదు అని చెప్పుకొచ్చారు.ఇక, అంతకుముందు కూడా దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా. నేను ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది.. అదీ నా స్పెషాలిటీ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. స్తంభాలు కనిపించకుండా భూగర్భం నుంచి కేబుల్స్ వేసేందుకు రూ.4వేల కోట్లు కేటాయించారు. ఇది నగర రూపురేఖలను పూర్తిగా మార్చే కీలక నిర్ణయం. జనవరి నుంచి హైదరాబాద్‌లో రోజూ మంచినీటిని సరఫరా చేయాలన్న సీఎం నిర్ణయం హర్షణీయం. గ్రేటర్ హైదరాబాద్ అంతటా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తా. 300 డివిజన్లలో పార్టీ గెలిచి సత్తా చాటుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అలాగే, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఎమ్మెల్యేల గురించి దానంను విలేకరులు ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదన్నారు. -
మళ్లీ కేసీఆర్ మార్కు రాజకీయం!
చాలాకాలం తరువాత తెలంగాణ రాజకీయ యవనికపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన రీతిలో మెరిశారు. భాష, భావ వ్యక్తికరణ, హాహాభావాల ప్రదర్శనలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ యాసను తనదైన శైలిలో ప్రయోగిస్తూ పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటారు. ఆసక్తికరంగా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు అని చెప్పాలి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడంతో వచ్చిన ఆత్మవిశ్వాసమో ఏమో కానీ... అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌పై విరుచుకు పడుతుంటారు. గత ఆదివారం వీరిద్దరు పరస్పర విమర్శల బాణాలు ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఆశాజనకమైన ఫలితాలు రావడం కేసీఆర్‌లో ఉత్సాహం నింపి ఉండవచ్చు. పార్టీ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీలతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించి ఆ తరువాత మీడియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ద్విముఖ వ్యూహం అమలు చేసినట్లు కనిపిస్తుంది. ఒకటి నీళ్ల సెంటిమెంట్ రాజకీయం, మరొకటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడం. రేవంత్ మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి కేటాయింపులపై చర్చించాలని సవాల్ చేయడమే కాక, మొత్తం సమస్యలకు కేసీఆర్ కారణమని వాదించారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు జోలికి పోకుండా కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పరిణామాలను వాడుకోవడం ద్వారా రాజకీయం చేయడానికి యత్నించినట్లు కనబడుతోంది. కేసీఆర్ వాదనలోని బలాబలాలు చూద్దాం.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించి తట్టెడు మట్టి తీయలేదని, దీనిపై ప్రజా యుద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితోనే కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపిందని ఆరోపించారు. అంతేకాకుండా... 45 టీఎంసీల నీరు కేటాయిస్తే చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను అక్రమంగా వాడుకుంటున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో బీజేపీపై కూడా విరుచుకుపడుతూ తెలంగాణకు పట్టిన శని అని వ్యాఖ్యానించారు. బీజేపీ లోక్ సభ ఎన్నికలలో ఎనిమిది సీట్లు గెలుచుకున్నా పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీనే బాగా ముందంజలో ఉంది. దాంతో బీజేపీ ప్రభావాన్ని మరింత తగ్గించడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో సాగింది. ఈ మూడింటిలో నీళ్ల సెంటిమెంట్ ప్రజలను బాగా కదిలించింది. తెలంగాణకు రావల్సిన నీటి వాటా రావడం లేదని, ఏపీకి నీళ్లు తరలిపోతున్నాయని ఆరోపించేవారు. కేసీఆర్ చేస్తానన్న ప్రజా ఉద్యమం ఎంతమేరకు ప్రజలను ప్రభావితం చేస్తుందన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్లు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది సందేహమే. కాకపోతే ఆ పేరుతో రాజకీయంగా సభలు నిర్వహించడానికి కేసీఆర్ దీనిని ఒక అవకాశంగా వాడుకునే యోచన చేసినట్లుగా ఉంది. నీటి సమస్యను సెంటిమెంట్ కోసం ఆయన మాట్లాడినా.. అసలు లక్ష్యం రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే. తెలంగాణ, ఏపీ నేతలు నీటిని ఎంత సమర్థంగా వాడుతున్నారన్నది పక్కబెడితే, అవసరమైనప్పుడల్లా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు కూడా ఆ ధోరణినే అనుసరించినట్లు అనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికే అన్నది ఎక్కువ మంది భావన. అయినా తెలంగాణ నేతలు అలాంటి వాటిని బూచిగా చూపించే యత్నం చేస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట సర్కార్ గా కేసీఆర్ అభివర్ణించారు. తన ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ అబద్దపు వాగ్దానాలు ఇచ్చిందని చెబుతూ ఆ జాబితాను చదివారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇవ్వడమే కాకుండా, బాండ్ పత్రాలను సైతం ప్రజలకు అంద చేసింది. కాని అధికారంలోకి వచ్చాక వాటిలో కొన్నిటిని మాత్రమే చేయగలిగారు. వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలు, కళ్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం, దళిత బంధు కింద రూ.12 లక్షలు మొదలైన హామీలను ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే టైమ్ లో ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ దందా తప్ప మరొకటి కాదని, తాము తెచ్చిన ఫార్మాసిటీని వంతారా, జూ పార్కులకు కేటాయించాలన్న ఆలోచనను ఆయన తప్పుపట్టారు. అయితే.. ఈ ప్రెస్మీట్లో తోలు తీస్తా..అంటూ తన స్టైల్ లో కొన్ని పరుష పదాలను ఆయన వాడారు. గ్లోబల్ సమ్మిట్ జరిగిన తీరును ఆక్షేపించి అచ్చం గురువు చంద్రబాబు బాటలోనే రేవంత్ వెళుతున్నారని, విశాఖలో గత టర్మ్‌లో చంద్రబాబు సర్కార్ సమ్మిట్ నిర్వహించి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసిందని, ఆచరణలో పదివేల కోట్లు కూడా రాలేదని ఆయన అన్నారు. విశాఖలో హోటల్ ఉద్యోగులకు సూట్లు తొడిగి తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. నదీ జలాల ఇష్యూపైనే కేంద్రీకరించినట్లు కనిపించినా, మొత్తం రేవంత్ ప్రభుత్వాన్ని దాదాపు అన్ని అంశాలలో కడిగిపారేశారు. అయితే.. తనకు ఇబ్బంది కలిగించే కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ తదితర కొన్ని అంశాలను కేసీఆర్ ప్రస్తావించలేదు. అసెంబ్లీకి వెళ్లేది, లేనిది చెప్పలేదు. కేసీఆర్ విమర్శలకు రేవంత్ బదులు ఇస్తూ తొలుత శాసనసభకు వచ్చి నదీ జలాలపై చర్చించాలని సవాల్ చేశారు. సభలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇది కొంత అనుమానాలకు తావిస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ తదితరులు అసెంబ్లీ బహిష్కారం వంటి కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కున్నారు. ఆ నేపథ్యంలో కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒంటికాలి మీద లేచే అవకాశం లేకపోలేదు. అందువల్లే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడానికి కాస్త జంకుతున్నట్లు అనిపిస్తుంది. తాజాగా నీటి సెంటిమెంట్‌ను వాడుకోవడానికి శాసనసభకు వెళ్లవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. నదీ జలాల సమస్యకు, తెలంగాణ ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు కేసీఆర్ కారణమన్న ప్రచారాన్ని ప్రజల ముందు పెట్టడానికి రేవంత్ బృందం ప్రయత్నిస్తోంది. కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఆధారంగా కేసీఆర్ వాదనను రేవంత్ తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను ఆర్థిక ఉగ్రవాదిగా పోల్చడం కచ్చితంగా అభ్యంతరకరకమైన అంశమే. తన చావు కోరతారా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు బదులుగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులతోనే ప్రమాదం ఉందని, కేటీఆర్, హరీశ్ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు చిత్రీకరించడానికి రేవంత్ యత్నించారు. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్కు దూరమైన వైనాన్ని రేవంత్ తనకు అనుకూలంగా మలచుకోవడానికి కృషి చేస్తున్నారు. అయితే.. కేసీఆర్ వ్యాఖ్యలు వయసు తగ్గట్లు లేవని, ఆయన తమలపాకుతో కొడితే, తాను తలుపు చెక్కతో కొట్టగలనని రేవంత్ తన వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. కేసీఆర్ నిజంగానే వచ్చే రోజుల్లో బాగా యాక్టివ్ అయితే వీరిద్దరి మద్య హోరాహోరీ మాటల యుద్దం జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను, ప్రభుత్వ వైఫల్యాల అంశాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయం చేయడానికి సిద్దపడుతున్నట్లు అనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలు, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు తదితర అంశాలను అస్త్రాలుగా వాడుకుని రాజకీయం చేయడానికి రేవంత్ రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీఆర్ఎస్కు ప్రయోనం కలిగిస్తాయా?లేక గత ప్రభుత్వంలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం చేసే ప్రచారం ఫలిస్తుందా?అన్నది తెరపై చూడాలి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలంగాణపై బీజేపీ ప్రత్యేక వ్యూహం!
తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీజేపీని బలపరిచేందుకు ఆర్ఆర్ఎస్ రంగంలోకి దిగింది. నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మరోవైపు, గురువారం హైదరాబాద్‌లో బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్) కార్యాలయాన్ని సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలె ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్కు బీఎంస్ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.కాగా, తెలంగాణలో ఆర్ఎస్ఎస్ ప్రముఖుల పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. నగర శివారులోని కన్హా శాంతి వనంలో విశ్వ సేవక్ సంఘ్ శిబిరం గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఈ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానున్నారు. అయితే, తెలంగాణపై ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖుల పర్యటనలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, బీజేపీ బలోపేతంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ శాఖల పెంపు, కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. 2025లో 392 కొత్త శాఖలను ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 3800 శాఖలు ఉండగా.. 2026 నాటికి 4000 శాఖల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ‘భాగ్యనగర్’ వంటి పేర్లతో సాంస్కృతిక పునరుద్ధరణకు ప్రయత్నిస్తోంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక రంగంలో ఒక ముఖ్యమైన అంశంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.బీఎంఎస్ ప్రారంభం.. సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలె గురువారం హైదరాబాద్‌లో బీఎంఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎంఎస్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా అభివర్ణించారు. ఇక, ఆర్ఎస్ఎస్తో అనుబంధంగా కార్మిక రంగంలో ప్రత్యేక శక్తిగా బీఎంఎస్ ఎదుగుతోంది. బీఎంఎస్.. కార్మికుల హక్కులు, జాతీయ ప్రయోజనం, స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది. ఇది కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తుంది. కార్మికులకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తోంది. కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతపై ఫోకస్ చేస్తుంది.అలాగే, స్వదేశీ ఉత్పత్తులకు మద్దతుగా స్వదేశీ జాగరణ కార్యక్రమాలు చేపట్టింది. ఆర్ఎస్ఎస్ మద్దతుతో బీఎంస్కు రాజకీయ, సామాజిక స్థాయిలో విస్తృత ప్రభావం ఉంది. దీంతో, తెలంగాణ కార్మిక సంఘాల విషయంలో బీఎంస్ కొత్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ బలోపేతంగా దిశగా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నట్టు పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకోవాలా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల చేతిలో ఓడిపోయిన రెండేళ్ల తర్వాత బయటకు వచ్చి తోలు తీస్తామని అంటుంటే తాము చూస్తూ ఊరుకోవాలా అని భువ నగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తిని తోలు తీస్తామని మాజీ సీఎం అంటుంటే ఇంకా మర్యాదగా మాట్లాడాలా అని నిలదీశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు కౌంటర్ ఇచ్చారు. ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు హరీశ్‌రావు వ్యవహారశైలి ఉంది. నీతులు మాకు కాదు ఎదుటి వారికి మాత్రమే అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు.ఒకసారి వాళ్ల మామ మాట్లాడిన పురాణం, బూతులు వింటే తెలుస్తుంది. బూతులు మాట్లాడే పేటెంట్ కేసీఆర్‌కు మాత్రమే ఉంది. ఆయన తిట్ల పురాణం మొదలుపెట్టారు కాబట్టే సీఎం రేవంత్ కూడా మాట్లాడారు. ఆయన రాజకీయం గురించి మాట్లాడితే రేవంత్‌రెడ్డి కూడా అదే మాట్లాడి ఉండేవారేమో? మీరు పద్ధతిగా మాట్లాడితే మేమూ పద్ధతిగానే మాట్లాడుతాం’ అని వ్యాఖ్యానించారు.హరీశ్‌రావు తన పాండిత్యంతో వేదాంతాలు చెబుతున్నారని, ఆయన నీతులు కేసీఆర్, కేటీఆర్‌లకు చెప్పాలని హితవు పలికారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. సీఎం, మాజీ సీఎం పరస్పరం గౌరవించుకోవాలని చెబుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ సూక్తులను బీఆర్ఎస్ దద్దమ్మలకు చెప్పాలని ఎంపీ చామల కోరారు. -
మళ్లీ గెలుస్తానని శపథాలా?
సిద్దిపేట జోన్: ‘వయసులో నీకు తండ్రి లాంటి వారైన కేసీఆర్‌పై మాట్లాడిన మాటలు ఏమిటి? టైమ్ వస్తది బిడ్డా! నీవేదో వీర్ర వీగుతు న్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు. ఇప్పటి కైనా చిల్లర మాటలు మానుకో’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రె డ్డి అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టక, కా స్మెటిక్ చార్జీలు ఇవ్వడం చేతకాక దుర్భాషలాడటం తగునా అని ప్రశ్నించారు. అలాంటి రేవంత్‌రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువేనంటూ మండిపడ్డారు.గురువారం క్రిస్మస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్‌ను హరీశ్‌రావు సందర్శించారు. వారి యో గక్షేమాలు అరా తీసి పిల్లలతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మాట లు సీఎంకే కాదు.. మాకూ వస్తాయి. తెలంగాణకు జరుగుతున్న నీటి అన్యాయం, కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి కేసీఆర్ మాట్లాడితే సీఎం స్థాయి మరచి రేవంత్‌రెడ్డి బూతులు మాట్లాడటం ఏమిటి? మళ్లీ గెలుస్తా, టూ థర్డ్స్ మెజారిటీతో గెలుస్తా అని శపథాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి.. కొడంగల్ ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన శపథం ఏమైంది? రేవంత్‌రెడ్డికి మాటతప్పడం, పార్టీలు మారడం, పదవులు కొనుక్కోవడం, చిల్లర మాటలు మాట్లాడటం బాగా అలవాటే’ అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు.ఫార్మాసిటీ భూముల్ని రైతులకు తిరిగివ్వాలి..ఫార్మాసిటీని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కేసీఆర్ అడగడం తప్పా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గతంలో ఫార్మాసిటీ భూములు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్.. ప్రస్తుతం చేస్తున్న పని ఏమిటని నిలదీశారు. కేసీఆర్ ఆలోచన మేరకు ఫార్మాసిటీని ఏర్పాటు చేయకుంటే రైతులకు భూములు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా కాస్మెటిక్ చార్జీలు, మెస్ చార్జీలు అందక అనాథ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, సీఎం ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయాలన్నారు. -
బాబూ.. కేసులు కొట్టేస్తే అంతా అయిపోతుందా?: పొన్నవోలు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో నియంత పాలన నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కూటమి పాలనలో వ్యవస్థలు కీలుబోమ్మలుగా మారాయని ఆరోపించారు. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేసులు కొట్టివేయించుకుంటున్నారు. చంద్రబాబుపై కొట్టివేసిన కేసులన్నింటిపై ఉన్నత న్యాయస్థానంలో కొట్లాడుతాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులన్నీ ఒక్క నెలలో ఎలా కొట్టివేశారో అర్థం కావడం లేదు. కేసు పెట్టిన వ్యవస్థలే చంద్రబాబు నీతిమంతుడు అని క్లీన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సీఐడీ, సిట్ సాక్షాదారాలు లేవని చంద్రబాబుపై ఉన్న కేసులు కొట్టివేశారు.స్కీల్ డెవలప్మెంట్ కేసులో వందల మందిని విచారించి ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలు అన్ని ఏమయ్యాయి?. ఏపీలో దొంగా పోలీసు ఆట నడుస్తుంది.. దొంగలు వారే.. న్యాయ నిర్ణేతలు వారే. కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనే కోర్టు చంద్రబాబును జైలులో వేసింది. మరి ఇప్పుడు ఆధారాలు ఏమయ్యాయి?. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు భవిష్యత్‌లో దోషులుగా నిలబడక తప్పదు. చంద్రబాబుపై కొట్టివేసిన కేసులపై మళ్లీ ఉన్నత న్యాయస్థానాల్లో కొట్లాడుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్‌పై రేవంత్ భాష కరెక్ట్ కాదు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యల చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్‌పై రేవంత్ మాట్లాడిని భాష సరికాదని వ్యాఖ్యలు చేశారు. దీంతో, బండి సంజయ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘మనం మాట్లాడే భాష ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా ఉండకూడదు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై మాట్లాడిన భాష సరికాదు. సీఎం రేవంత్ తన భాషపై పునరాలోచన చేయాలి. రేవంత్ భాషతో ఆయనకే నష్టం జరుగుతుంది. ప్రతీ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ ధర్మం కోరుకుంటుంది అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో కృష్ణా జలాలపై స్పందిస్తూ..‘కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నది కేసీఆర్. ఆ విషయాన్ని బయట పెట్టింది నేను. ముడుపుల కోసం కేసీఆర్ 575 టీఎంసీలు కావాలని అడగలేదు. కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదు. కాళేశ్వరం దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాలు అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారు. తెలంగాణకు కేసీఆర్ ద్రోహి. ఇందుకే కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఏం సరిపోతాయి. ప్రతీ గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు ఇవ్వాలి. మార్చి నాటికి మూడువేల కోట్లు ఇస్తామని రేవంత్ అంటున్నారు.. అవి కేంద్రం ఇచ్చే నిధులే. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులు వేల కోట్లు సంపాదిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించుకున్నారు. భూములు కొల్లగొడుతున్న ఇద్దరు, ముగ్గురు మంత్రులు భవిష్యత్‌లో జైలుకు వెళ్లడం ఖాయం. వారిపై నివేదిక తయారు చేస్తున్నాం. గెలిస్తే కాంగ్రెస్ పార్టీనా?పార్టీ గుర్తుపై జరిగే MPTC, ZPTC ఎన్నికలకు వెళ్లకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళను తమ వాళ్ళే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పినా స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నిజాయితీ పరులు.. వారికి స్వేచ్ఛ ఇవ్వండి. మావోయిస్టుల లిస్టులో పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఆధారాలు లేవు’ అని కామెంట్స్ చేశారు. బీజేపీ బలంగానే ఉంది.. మా పార్టీ నేతలమంతా కలిసికట్టుగానే ఉన్నాం. మేం కలిసి భోజనాలు కూడా చేశాం. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం జీవోలను దాచిపెడుతోంది. ఆరు గ్యారెంటీలు చర్చ జరగకుండా చేస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద ఎన్ని ఇళ్లు ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రంగారెడ్డి జిల్లాలో నలుగురు రోహింగ్యాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఓట్ల కోసం వారిని ప్రోత్సహిస్తున్నారు. భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ మేయర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. గతంలో కొద్ది తేడాలో మేయర్ స్థానం పోగొట్టుకున్నాం. ఈసారి సింగిల్‌గా మేయర్ పీఠం మాదే. ఎంఐఎంకు అనుకూలంగా హైదరాబాద్‌లో డివిజన్ల డీలిమిటేషన్ చేశారు.కాంగ్రెస్ పార్టీ మాయలో ఉంది. భాగ్యనగరంలో ఎంఐఎంతో సహవాసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎవరూ వేయడానికి సాహసం చేయరు. జూబ్లీహిల్స్ ఓటమితో కార్యకర్తలు ఆవేదన చెందారు. ఖైరతాబాద్‌లో కార్యకర్తలు కసితో ఉన్నారు. ఈ దేశంలో మైనార్టీ ప్రజలంతా క్షేమంగా ఉన్నారు. ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మాత్రం హిందువులను హతమారుస్తున్నారు’ అని అన్నారు. -
రేవంత్ వ్యాఖ్యలు.. జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ది కంపు నోరు.. మురుగు కాల్వ కంటే అధ్వాన్నం అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు అవసరం ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రజలకు లేదు. కేసీఆర్ స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బండ రాయి కట్టి మూసీ నదిలో పడేస్తారు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ తోలు కాదు, ప్రభుత్వం తోలు వలుస్తాం.కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే తమ బట్టలు ఇప్పుతాడనే భయంతోనే ఫ్రస్టేషన్లో రేవంత్ మాట్లాడుతున్నాడు. రేవంత్ భాషకి ప్రజాక్షేత్రంలో తప్పక శిక్ష పడుతుంది. ప్రజలే రాజకీయ సమాధి చేస్తారు. కేసీఆర్ ముందు రేవంత్ బచ్చా. ఇరిగేషన్ మంత్రి ఒక అజ్ఞానపు మంత్రి. ఉత్తమ్ కుమార్‌కు కనీస అవగాహన లేదు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత’ అని వ్యాఖ్యలు చేశారు. -
అసెంబ్లీకి కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెనక్కి వచ్చినా ఏడాదిగా ప్రభుత్వం స్పందించక పోవడం.. 45 టీఎంసీలు చాలు అంటూ లేఖ రాయడం వంటి అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఓ వైపు అధికార పక్షం సవాలు విసురుతుండగా, దీటుగా ప్రతిస్పందించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు నదీజలాల్లో తెలంగాణ వాటా, ఏపీ నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్రం వైఖరి తదితరాలను శాసనసభలో కేసీఆర్ స్వయంగా వివరించే అవకాశాలు ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ మినట్స్‌ను సేకరించే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకూ అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరేందుకు బీఆర్ఎస్ శాసనసభా పక్షం సన్నద్ధమవుతోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లోపే నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాయనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా తర్వాతే కేసీఆర్ హాజరుపై స్పష్టత వచ్చే అవకాశముంది. సంక్రాంతి తర్వాత తొలి బహిరంగ సభ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులతోపాటు నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్.. అసెంబ్లీ సమావేశాల తర్వాతే బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే నెల జనవరి మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయనే ప్రచారమున్న నేపథ్యంలో ఆ తర్వాతే సభల నిర్వహించేలా షెడ్యూలు ప్రకటించే అవకాశముంది. సభల నిర్వహణ తేదీలు, వేదికలు ఖరారు చేసేందుకు ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించే అవకాశముంది. 26న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ జరిపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మూడు ఉమ్మడి జిల్లాల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి నిర్వహించాల్సిన సన్నాహక సమావేశాలకు సంబంధించి ఈ భేటీల్లో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో చేవెళ్ల, నల్లగొండ జిల్లా పరిధిలో మల్లేపల్లిలో సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర లేదా నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో పరిధిలో నిర్వహించే సభా వేదికను ఖరారు చేయాల్సి ఉంది. జన సమీకరణ, నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు వంటి అంశాలపై కేసీఆర్‌తో జరిగే భేటీలో స్పష్టత వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. -
మళ్లీ.. అధికారం మాదే: సీఎం రేవంత్
వచ్చే ఏడాది మార్చిలో రూ.3 వేల కోట్లు పంచాయతీలకు ఇస్తాం. నూతన సంవత్సరం కానుకగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఇస్తాం. చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు,పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అదనం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నుంచి నేరుగా సర్పంచ్‌లకు ఈ నిధులు పంపించే బాధ్యత తీసుకుంటాం. గ్రామ పంచాయతీల్లో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ నిధులు వాడుకోండి. దుర్వినియోగం చేయొద్దు.విద్యతోనే రాష్ట్ర, దేశాభివృద్ధి సాధ్యం. కొడంగల్ నియోజకవర్గంలో సర్కారు బడుల్లో చదువుకుంటున్న 25 వేల మంది పిల్లలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో అల్పాహారం, భోజనం అందుబాటులోకి తెస్తాం. మంచి భోజనంతోపాటు నాణ్యమైన విద్యనూ అందిస్తాం. కావాల్సిన వసతులు కల్పిస్తాం. మీ పిల్లలను సర్కారు బడులకు తీసుకురండి.సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 119 నియోజకవర్గాలు ఉంటే 80 సీట్లతో, డీలిమిటేషన్‌తో 153 ఉంటే 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తాం’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నీ రాజకీయమేందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఓ కల. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్ లేదు. రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేదేమీ లేదు. తెలంగాణ భవిష్యత్ కాంగ్రెస్సే’అని రేవంత్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం కొడంగల్ నియోజక వర్గంలోని పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నూతన సర్పంచ్‌లకు శాలువాలు కప్పి సన్మానించిన తర్వాత సీఎం మాట్లాడారు. ఆయన మాటల్లోనే... మీరు రండి.. ముఖాముఖి చర్చిద్దాం.. ‘కేసీఆర్.. నీ వయసు, అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడిగా మీకు హోదా ఉంది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశాం. 29 నుంచి చర్చలు జరగనున్నాయి. ఆ రోజు మీరు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తాం. మీరు చెప్పినవన్నీ చర్చకు పెడతాం. ముఖాముఖి చర్చిద్దాం. వెనుక మాట్లాడి.. వెనుక ఉరుకుడు కాదు. అభివృద్ధి, రైతు భరోసా, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడుదామా చెప్పండి. లేకపోతే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి. అప్పులా, నీళ్లా, మీరు కట్టి కూలిన కాళేశ్వరమా, టెలిఫోన్ ట్యాపింగా, ఇంకా అభివృద్ధి మీదనా. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లపైనా.. దేనిపైనైనా నేను సిద్ధం. మీరు మొహం చాటేసి.. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్‌కు వచ్చి.. పది మంది చెంచాలను పెట్టుకుని వారి ముందు పొంకనాలు కొట్టుడు కాదు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ అంటూ సభ పెడతాడట. మీరు ఎక్కడైనా పెట్టుకోండి. నేను వద్దన్నానా. ఎన్నికలు ముగిసినయ్.. ఇంకా సందులకు రమ్మంటే ఎలా? చర్చ చేయడానికి సభ ఉంది. ప్రజలు అసెంబ్లీలో చర్చ చేయమని చెబుతుండ్రు. ఎవరేం మాట్లాడుతారో వారు వింటరు. ఆ తర్వాత విజు్ఞలైన ప్రజలే తీర్మానం చేస్తరు. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా.. కేసీఆర్ తన ఫామ్హౌస్నే బందీఖానా చేసుకున్నడు. ఆయన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి, చంచల్‌గూడకు పంపించినా ఇదే అయితది. ప్రభుత్వానికి తిండి బరువు. ఆయన మీద ఒక్క కేసూ పెట్టలేదు. కేసీఆర్ నా మీద 181 కేసులు పెట్టి చర్లపల్లి, చంచల్‌గూడ జైల్లో బంధించాడు. నన్ను ఎన్నో రకాలుగా సతాయించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలను ఆస్తులను గుంజుకుండ్రు. కేసులు పెట్టి హింసించిండ్రు. నాకు ఈ బాధ్యత వచ్చాక ఆలోచన చేశా. బాధను దృష్టిలో పెట్టుకుని పగ సాధించే కార్యక్రమం పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించా. పైన దేవుడు చూస్తున్నడు. వాళ్ల పాపాలన్నీ దేవుడు మిత్తితో తీరుస్తుండు. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన నడుం ఇరిగింది. అసెంబ్లీలో ఓడగొట్టినం. పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా చేసినం. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12,726 స్థానాల్లో 8,335 మందిని గెలిపించుకున్నాం. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా? నన్ను గెలక్కు.. అన్నీ చూశా.. నా తోలు తీస్తానని అంటావా.. షేక్‌పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటడు. ఆయన రోజూ మేకలు కోసి మండి నడుపుతుంటడు. కేసీఆర్ ఖాళీగా ఉన్నడు. తోలు తీస్తడు.. ఆయనకు నౌకరీ ఇవ్వమని చెప్పిన. నౌకరీ అయ్యాక ఇంటికి పోయేటప్పుడు దావత్‌కు ఉచితంగా ఇంత బోటి, కాళ్లు, తలకాయ పెట్టు పాపం.. సాయంత్రం రెండేసేటప్పుడు తీసుకుంటడని. మాజీ సీఎంగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, సీఎంగా పనిచేశానని చెప్పుకునే నువ్వు ఇలాంటి మాటలా మాట్లాడేది. మేము ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్క, తోలు అంటవా. మా సర్పంచులు వచ్చారు. నువ్వు తోలు తీసుడు కాదు. నిన్ను చీల్చి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీసి కొడ్తరు. కొడంగల్ వస్తవా.. మమ్మల్నే చింతమడకకు రమ్మంటవా. ఒక్కటైనా అక్కరకొచ్చే మాట మాట్లాడావా? నన్ను గెలక్కు. నేను అన్నీ చూసిన. నల్లమల అడవుల నుంచి వచ్చిన. కక్ష సాధింపు రాజకీయాలు చేయం.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని కేసీఆర్ కొడుకు కేటీఆర్ విమర్శిస్తడు. తండ్రి ఏమో ప్రభుత్వం రియల్ దందా చేస్తోందంటడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారం, ఆదాయం పెంచుతుంది. నేను అయ్య పేరు చెప్పి మంత్రిని కాలే. పాస్‌పోర్టు బ్రోకర్ల దందా చేయలే. ఆంధ్రలోని గుంటూరు, గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ గురించి. మీ జాతినంతా తెచ్చుకో.. మా ఊరికొస్తవా? లేదా మేమే మీ ఊరికి రావాలా? గతంలో గజ్వేల్ వచ్చి చూడు అన్నావ్. లక్షల మంది కార్యకర్తలతోపోయి తొక్కితే పాతాళానికి పోయినవ్. మేం కక్ష సాధింపు రాజకీయాలు చేయం. ఎవరి సొమ్ము గురించి ఆలోచన చేయం. మా కాళ్లలో కట్టెలు పెడితే మాత్రం ఊకోం. మా సంగతి చూపిస్తాం. ఇప్పటికైనా మారండి.. సొంత బిడ్డ అని చూడకుండా ఇంటి అల్లుడి ఫోన్లనే ట్యాపింగ్ చేసిండ్రు. ఇంతకన్న సిగ్గులేనోడు ఉంటడా అని వాళ్ల బిడ్డ వాళ్లే అంటుండ్రు. సొంత చెల్లికే బుక్కెడు బువ్వ పెట్టనోడు ఒక మనిషా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తదని మెడబెట్టి బయటకు పంపితివి. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేనోడు నాకు సవాల్ విసురుతుండు. నా సంగతి నీకు తెల్వదు. మీ నాయనను అడుగు.. నా గురించి చెబుతడు. ఇంకో ఆయన కేసీఆర్ గర్జించాడని మాట్లాడుతుండ్రు. గాండ్రింపులు, ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. మీ తోలు సంగతి ముందు తెలుసుకోండి. మేం నాటు కోడి తోలు తీసి, పసుపు పూసినట్లు పూస్తాం. అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు పోతున్నయ్. ఇప్పటికైనా మారండి. లేకపోతే దేనికీ పనికి రాకుండా పోతరు. తెలంగాణలో ప్రతిపక్షం లేదంటే సిగ్గుపోతది. -
అడ్డంగా దొరికిపోవడం.. పనికిమాలిన శపథాలు చేసి పారిపోవడం
సాక్షి, హైదరాబాద్: కోస్గిలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా? అంటూ ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. పనికి మమాలిన శపథాలు చేయడం రేవంత్‌కు అలవాటే. అడ్డంగా దొరికిపోవడం రేవంత్‌కు మామూలే. 2028లో ప్రజలు కాంగ్రెస్‌ని బొందపెట్టడం ఖాయం. పాలమూరు ప్రాజెక్టు గొంతు ఎవరు కోశారో అందరికీ తెలుసు. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?. తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది!. అడ్డంగా దొరికిపోవడం..ఆగమాగం కావడం..అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా!సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా.. ఛీ కొడుతున్నా ఇంకా మారవా?. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తు వూరుకోం.. పౌరుషంగల్ల బిడ్డలం ప్రశ్నిస్తాం!. కాంగ్రెస్ జలద్రోహాన్ని అసెంబ్లీలో, ఇటు జనం మధ్య ఎండగడతాం అంటూ ట్వీట్ చేశారాయన. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా?పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి..సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా?తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్…— KTR (@KTRBRS) December 24, 2025 -
కేసీఆర్.. నిన్ను మళ్లీ అధికారంలోకి రానివ్వం: సీఎం రేవంత్
సాక్షి, నారాయణపేట్: పదేళ్లలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని.. ఇక్కడి నుంచి ఎంపీగా నెగ్గి కూడా కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎండబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం కోస్గిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానికి హజరైన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నూతనంగా ఎన్నికైన సర్పంచు,ఉప సర్పంచు, వార్డుసభ్యులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా పని చేయాలి. గాందీ కలలు గన్నట్టు గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి చిహ్నం. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్దానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్నికలు పూర్తి అయ్యాయి ఇక రాజకీయాలు వద్దు అభివృద్ధి ద్యేయంగా పార్టీలకు అతీతంగా పని చేయాలి. చిన్నచిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టాలి గ్రామల్లో కక్షలు పెంచుకోవద్దు. నాకు వచ్చిన ఈ అవకాశం మీ అభివృద్ధికే..రాష్ట్రంలోని 12706 గ్రామపంచాయితీలకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నిదులు ఇస్తాం. చిన్న పంచాయితీలకు 5 లక్షలు పెద్దగ్రామ సర్పంచులకు 10 లక్షలు నూతన సంవత్సరంలో ఇస్తాం. సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబందించిన ప్రణాళికలు సిద్దం చేయండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇస్తాం. గ్రామాల్లో ఎవరికైన అర్హులకు సంక్షేమ పథకాలు రాకుంటే పేర్లు ఇస్తే వారికి ఇస్తాం. ఇందిరమ్మ చీరలు మేం ఇస్తున్న సారె లాంటిది. చదువే జీవితాల్లో వెలుగు తెస్తుంది పిల్లలకు మంచి విద్యను అందిస్తాం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పహారం,నాణ్యమైన భోజనం అందిస్తాం. మార్చి 31 లోగా కేంద్రం నుంచి 3 వేల కోట్ల నిధులు గ్రామపంచాయితీలకు తీసుకోస్తాకేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?. పదేళ్లు బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరుకు వలస వచ్చి కేసీఆర్ ఎంపీ అయ్యాడు. కానీ, నీళ్ల కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని ఎండగట్టాడు. బీఆర్ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారు. లక్షా 80 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి.. కమిషన్లు దండుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. నన్ను జైలుకు పంపారు. నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారు. కేసీఆర్ ఆయన పాపాలకు ఆయనే పోతాడని.. నేనేమీ అనలేదు. అధికారంలోకి వచ్చాక నేను పగ రాజకీయాలు చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కక్ష సాధింపులకు పాల్పడలేదు. ప్రమాణస్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలిరగొట్టుకున్నాడు. రెండేళ్ల నుంచి ఫాంహౌజ్నే కేసీఆర్ జైలుగా మార్చుకున్నారు. మొన్నే బయటకు వచ్చాడు. తోలు తీస్తానంటూ ఏదో మాట్లాడారు. రెండేళ్లు ఫామ్‌హౌజ్‌లో అదే పని చేశారా?.. మా సర్పంచ్ల దగ్గరికి రా ఎవరి తోలు తీస్తారో చూద్దాం. చింతకమడకలో చీరి చింతకు కడతారు. నేకేసీఆర్ చేయని పాపం అంటూ లేదు. సొంతల్లుడి ఫోన్‌నే ట్యాపింగ చేయించాడు. సొంత బిడ్డకే చీర పెట్టలేనోడు.. మాపై మాట్లాడతారా?. ఇన్ని ఎన్నికలు జరుగుతున్నా.. జనం బండకేసి కొడుతున్నా.. సిగ్గు రావడం లేదు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు నేను. పండక్కి చెల్లెల్ని కూడా ఇంటికి పిలవలేనోడు కేటీఆర్. తండ్రి గాలికి సంపాదించిన వాటా పంచాల్సి వస్తుందని సొంత చెల్లినే మెడలు పట్టి బయటకు పంపించావ్. సొంత చెల్లికే సమాధానాలు చెప్పలేనోడు నాకే సవాల్ విసరుతాడా?.. కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత..? నీలా అమాయకుల్ని నేను మోసం చేయలేదు. అలాంటిది నేను నీకు భయపడతానా?.. హరీష్‌రావు ఆరడుగులు పెరిగిండు.. కానీ తలకాయే లేదు. నీ కండలు కరిగి.. తొలు మిగిలింది. నీకా నేను భయపడేది. 2029లో 80 శాతంపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం. రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా.. ఇదే నా సవాల్. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. తండ్రీ కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మాట్లాడొద్దు. సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి రండి. నీళ్లు, నియామకాలు.. నిధులు.. వేటిపైన అయినా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం. కూలిన కాళేశ్వరం.. ఫోన్ ట్యాపింగ్.. ఏ అంశంపైనా అయినా సరే చర్చిద్దాం. ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ పెడతాం. మీరు సిద్ధమా? అని రేవంత్ అన్నారు. -
నేను ఏ పార్టీలో ఉంటే వారిదే విజయం: దానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న వేళ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు దానం కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా.. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం. ఎంఐఎంతో కలుపుకుని కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరుగుతాను. కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరిస్తాను. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే, స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటి వరకు స్పీకర్‌కు వివరణ ఇవ్వని దానం. కాగా, దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇలా వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో దానం వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడిన ప్రతీ సారి లీకులతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. నదీ జలాల్లో అన్యాయంపై కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మాపై కేసులు పెడతామంటూ లీక్‌లు ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీ సులు ఇస్తారట. చట్టబద్ధ్దంగా వ్యవహరించని పోలీసు అధికారులు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది’అని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ‘పోస్టింగుల కోసం అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పోలీసుల వివరాలు రాసి పెడుతున్నాం. బీఆర్ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న అధికారులను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయినా, విదేశాలకు వెళ్లినా, సెంట్రల్ సర్వీసులోకి డిప్యూటేషన్‌పై వెళ్లినా వదిలిపెట్టేది లేదు. ఏ బొరియలో దాక్కున్నా లాక్కొస్తాం. రేవంత్ అడుగు లకు మడుగులొత్తుడేనా డీజీపీ శివధర్‌రెడ్డి ఖాకీ బుక్’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో హరీశ్‌రావు ఇష్టాగోష్టి నిర్వహించారు. నేతి బీరలో నెయ్యిలా డీజీపీ ఖాకీ బుక్ ‘ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు నాపై సుమారు 300 కేసులు పెట్టారు. రేవంత్ పథకాల ఎగవేతను ప్రశ్నిస్తూ ఆయన పాపాలను క్షమించమని దేవుడిని వేడుకున్నందుకు కూడా యాదగిరిగుట్టలో కేసులు పెట్టారు. సిద్దిపేటలో నా ఇంటిపై దాడి చేసినా కేసు నమోదు చేయలేదు. ఫార్ములా ఈ–రేస్ తరహాలోనే నాపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటు వేయలేదని సజ్జాపూర్‌లో దళితుల ఇల్లు కూల్చివేస్తే డీఐజీ ఖాకీబుక్ ఏం చేస్తోంది.రేవంత్ ఫుట్‌బాల్ ఆడితే డీఐజీ మైదానంలో రెండు రోజులు కాపలా ఉన్నారు. కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులు తమకు రావాల్సిన టీఏ, డీఏ, సరెండర్ లీవులు, భద్రత పథకం, అలవెన్సుల కోసం తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని కేవలం యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో పనిచేసే వారికి మాత్రమే పెండింగ్ అలవెన్సులు ఇచ్చారు. నేతి బీరకాయలో నేతి చందంగా డీజీపీ ఖాకీ బుక్ పనిచేస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. వాస్తు భయంతో సచివాలయానికి దూరం ‘కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో ఆత్మరక్షణలో పడిన రేవంత్ రాత్రి 9.30 గంటలకు మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించాడు. వాస్తు భయంతో సచివాలయానికి వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటున్నాడు. నాలుగు వేలకు పైగా సర్పంచ్ పదవులు మా పార్టీకి దక్కడంతో సహకార సంఘాల ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నాడు. కాంట్రాక్టుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.7వేల కోట్ల కమీషన్లు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్సల్టెన్సీ కంపెనీలా పనిచేస్తూ బాంబే బ్రోకర్‌కు రూ.180 కోట్లు కమీషన్ ఇచ్చి అప్పులు తెచ్చింది. ఇరిగేషన్ అంశాలపై అసెంబ్లీలో మాకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలి. 15 రోజులు అసెంబ్లీ పెట్టి మాకు అవకాశం ఇస్తే ఇరిగేషన్‌తోపాటు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కారు బట్టలు విప్పుతాం. ఉత్తమ్ తన తప్పు ఒప్పుకుని పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయాలి’అని హరీశ్‌రావు చెప్పారు. -
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా?
సత్తుపల్లి/తల్లాడ: రెండేళ్లు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి దిగజారుడు భాషతో తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రూ. 10.53 కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్స్టేషన్లకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లిలో సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాన్ని ప్రారంభించి ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందునే 85 శాతం సర్పంచ్‌లుగా తమ పార్టీ బలపరిచిన వారిని గెలిపించారన్నారు. దిగజారి మాట్లాడటం తమకు రాదని.. ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారానే బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుతామన్నారు. ‘రెండేళ్లు ఫాంహౌస్‌లో పడుకున్న ఒకాయన మీడియా ముందుకొచ్చి తోలుతీస్తాం అనడం సరికాదు. తోలు వలుస్తామంటే ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరు. ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలి’అని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడమంటే భయమెందుకో కేసీఆర్ చెప్పాలన్న భట్టి.. ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు వస్తుంటే కనుమరుగవుతాననే భయంతో కేసీఆర్ తమ ప్రభుత్వంపై విషం కక్కి తిరిగి ఫాంహౌస్‌కు వెళ్లారని విమర్శించారు. కాగా, బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలతో సింగరేణి పోటీ పడుతూనే బహుముఖంగా ఎదిగేలా చర్యలు చేపట్టామని భట్టి వివరించారు. కాపర్, గోల్డ్ మైనింగ్‌లోనూ సింగరేణి అడుగుపెట్టిందని చెప్పారు. కేంద్రం బొగ్గు బావులకు వేలం నిర్వహిస్తే తెలంగాణ నుంచి ఒక్క బొగ్గు బావి కూడా ఇతరులకు పోకుండా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
పాట తెచ్చిన ‘పంచాయితీ’
నర్సంపేట రూరల్ : ప్రమాణ స్వీకారోత్సవంలో డీజే పాట పెద్ద పంచాయితీకి దారి తీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట జీపీ కార్యాలయ ఆవరణలో పాలకవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా డీజే సౌండ్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రమాణస్వీకారోత్సవంలో బీఆర్ఎస్కు సంబం«ధించిన పాట వస్తుండగా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారి ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ వనపర్తి శోభన్‌కు, బీఆర్ఎస్ పార్టీ మూడో వార్డుకు చెందిన మూడు రమేశ్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి ఎస్సై రాజేశ్‌రెడ్డి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. తొలుత కాంగ్రెస్, అనంతరం బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. -
బడిలో.. కిరాణా షాపులో.. చెట్ల కింద..
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: తెలంగాణ వ్యాప్తంగా సోమవారం గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో పల్లెల్లో కొత్త పాలన మొదలైంది. మొత్తంగా 12,702 పంచాయతీలకు సర్పంచులు, ఉప సర్పంచులు, 1,11,803 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొన్నిచోట్ల పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో, కొన్నిచోట్ల భవనాలు నిర్మాణ దశలో ఉండటంతో ఓ చోట కిరాణా షాపులో, మరోచోట ఆరుబయట, ఇంకోచోట చెట్ల కింద సర్పంచులు, వార్డుసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పలుచోట్ల కొలువుదీరిన మొదటి రోజునుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలకవర్గాలు తీర్మానాలు చేయడం విశేషం.కిరాణా షాపులో అధ్యక్షా.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్, ఇతర భవనాలు అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్‌గా ఎన్నికైన పావని తన కిరాణా దుకాణంలోని సగభాగంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పాలకవర్గ సభ్యులకు ఇబ్బందికరంగా ఉండటంతో ఆరుబయట ప్రమాణ స్వీకారం చేశారు.చెట్ల నీడలోనే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూ రుపాడు మండలంలోని నల్లబండబోడు, చింతలతండా గ్రామపంచాయతీల భవనాలు నిర్మాణంలో ఉండటంతో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు చెట్ల కిందే టెంట్ నీడలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఇదే మండలం గురువాగుతండా, శంభునిగూడెం, సాయిరాంతండా, గాం«దీనగర్ల్లో సొంత భవనాలు లేక పాఠశాల భవనాల్లో పాలకవర్గాలు ప్రమాణం చేశాయి. మద్యపాన నిషేధంతో మొదలు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు స్వగ్రామం, సిద్దిపేట జిల్లా భూంపల్లి–అక్బర్పేట మండలం బొప్పాపూర్‌లో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి రోజు సంపూర్ణ మద్య నిషేధంపై తొలి తీర్మానం చేశారు. బెల్ట్‌షాపులపై నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్మానం చేశారు. తర్వాత స్వచ్ఛ బొప్పాపూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పని చేసి.. ప్రమాణం చేశారు.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలోని కొంపల్లి నూతన సర్పంచ్ జంగాల సాలమ్మ ప్రమాణస్వీకారానికి ముందు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానికులతో కలిసి చీపురుపట్టి వీధులను శుభ్రపరిచారు. ఆ తరువాత పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ప్రమాణం చేశారు. అద్దె ఇల్లు తీసుకుని.. సిద్దిపేట జిల్లా గాంధీనగర్, బంజేరుపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో సర్పంచ్‌లు అద్దె ఇల్లును తీసుకున్నారు. ఇది అనువుగా లేకపోవడంతో ఆరుబయటే ప్రమాణం చేశారు. మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంతో పాటు వంగపల్లి, హనుమతండా, రెడ్యానాయక్ తండా, దుబ్బతండా గ్రామాల్లో సొంత భవనాలు లేకపోవడంతో ఓ చోట టెంట్ వేసి ప్రమాణం చేశారు. బడిలో ‘పంచాయతీ’ మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలో నడిమితండా, సీతానగర్ పంచాయతీ కార్యాలయాలు ప్రాథమిక పాఠశాలలోని ఓ తరగతి గదిలో కొనసాగుతుండగా, గొల్లకుంట తండా పంచాయతీ కార్యాలయం ఓ ఇంట్లో నిర్వహిస్తున్నారు. అలాగే, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలను స్కూళ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాల ఆవరణలోనే టెంట్ వేసి ప్రమాణం చేశారు. గుర్రంపై వచ్చిన సర్పంచ్ నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రవీందర్ పటేల్ ప్రమాణ స్వీకారానికి గుర్రంపై వచ్చాడు. బ్యాండుమేళాలతో పెళ్లి బారాత్ ఊరేగింపు మాదిరిగా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. రంగుల ‘పంచాయితీ’ కాంగ్రెస్ కార్యాలయంలా రంగులు వేసిన పంచాయతీ భవనంలో తాము ప్రమాణం చేయబోమని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తంచేయడంతో పోలీసులు, అధికారులు వచ్చి సర్దిచెప్పారు.అంబులెన్స్‌లోనే ప్రమాణం జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా గెలుపొందారు. రెండు రోజుల క్రితం అలేఖ్య అనారోగ్యం బారినపడి అస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఉపసర్పంచ్‌గా ఆమె తండ్రి చండి పర్శయ్య, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆస్పత్రిలో ఉన్న అలేఖ్య అంబులెన్స్‌లో గ్రామానికి రాగా.. అధికారులు అందులోనే అలేఖ్యతో ప్రమాణం చేయించి సంతకాలు తీసుకున్నారు.పురిటి నొప్పులతో వచ్చి.. నారాయణపేట జిల్లా ఊట్కూరు సర్పంచ్‌గా గెలుపొందిన రేణుకకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు కుటుంబసభ్యులు ఆమెను పంచాయతీ కార్యాలయానికి తీసుకురాగా కార్యదర్శి శ్రీనివాసరావు ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి నల్లగొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన బోయపల్లి రాజేష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. ఆయన తండ్రి మాజీ సర్పంచ్ బోయపల్లి సురేందర్ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ప్రమాణం వాయిదా పడకూడదని భావించిన రాజేష్ బాధను దిగమింగుతూ బాధ్యతల స్వీకరణ పత్రాలపై సంతకాలు చేశారు.కింద కూర్చునే బాధ్యతల స్వీకరణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి (కె) కొత్త పంచాయతీ. కార్యాలయానికి పాఠశాల ఆవరణలోని ఓ గదిని కేటాయించారు. కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో నిరసనగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కింద కూర్చునే పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఒక గ్రామం.. ఇద్దరు సర్పంచ్‌లు! సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయ తీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలో మొత్తం 1,268 ఓట్లు ఉండగా.. 1,141 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన సనప సుజాతకు 549 ఓట్లు, బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న నూనావత్ స్వాతికి 552 ఓట్లు వచ్చినట్లు ఫలితాల సందర్భంగా అధికారులు ప్రకటించారు. దీంతో స్వాతికి గెలుపుపత్రం ఇచ్చారు. సుజాత రీకౌంటింగ్ కోరగా.. తిరిగి ఓట్లను లెక్కించారు. స్వాతికి 549 ఓట్లు, సుజాతకు 550 ఓట్లు వచ్చినట్లు తేల్చారు. ముందుగా స్వాతికి ఇచ్చిన గెలుపు పత్రం వెనక్కి తీసుకోకుండానే... రిటర్నింగ్ అధికారి సుజాతకు మరో గెలుపు పత్రం అందజేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం కోసం ఇరువర్గాలకు చెందిన వారు తమ అనుచరులతో పంచాయతీ కార్యాలయానికి రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సుజాత గెలిచినట్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ప్రకటించి ప్రత్యేకాధికారి మంగీలాల్ ఆమెతో ప్రమాణం చేయించారు.95 ఏళ్ల వయస్సులో సర్పంచ్‌గా తిరుమలగిరి (తుంగతుర్తి): 95 ఏళ్ల వయసులో సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌తో కలిసి ఆయన ప్రమాణస్వీకారం చేశారు.ర్యాలీలో ఉద్రిక్తత మర్రిగూడ (చింతపల్లి): నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య తన ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ర్యాలీలో ప్రత్యర్థి వర్గీయులు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వెంబడించడంతో వారు పరారయ్యారు. పలువురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
బీఆర్ఎస్కు తోలు తప్ప కండ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీకి తోలు తప్ప కండ లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కండ కరిగిపోయిందని గ్రహించిన తర్వాతే కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం ఇప్పుడు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనానికి కుటుంబ రాజకీయాలే కారణమని చెప్పారు. ‘కొడుకు, అల్లుడు వ్యవహారశైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందని కేసీఆర్‌కు ఆలస్యంగా అర్ధమైంది.అందుకే పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు. రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వదిలి బయటకు వచ్చారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు. గాడిద గుడ్డు కాదు’అని అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వమే దద్దమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. బండ కూడా పగలకొట్టలేదు.. సంగంబండ ప్రాజెక్టులో బండ పగలకొడితే 20 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్న ఆలోచన కూడా పదేళ్లలో కేసీఆర్‌కు రాలేదని, కాళేశ్వరంపై ఉన్న తపన ఆయనకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని రాష్ట్ర క్రీడా, పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా చూశారని, కానీ ఆయన పాత పురాణమే చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు ప్రజలు ఏమనుకుంటారోననే స్పృహ కూడా లేకుండా ఆయన మాట్లాడారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోలు తీశారని చెప్పారు. సలహాలు సూచనలు ఇవ్వాలని అడిగాం ప్రభుత్వపరంగా ఏదైనా పొరపాటు జరిగితే ప్రతిపక్ష పార్టీగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఇప్పటికే అనేకసార్లు తాము బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని, అందుకే అన్ని ఎన్నికల్లో ఎవరి తోలు తీయాలో వారి తోలు తీశారని చెప్పారు. అయినా ప్రభుత్వం తోలు తీసే సమస్యలేవైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ సీఎం కేసీఆర్‌కు సూచించారు. -
బీఆర్ఎస్ను ఎండగట్టాలి
సాక్షి, హైదరాబాద్: జల వివాదాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో విస్తృత చర్చ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని శాసనసభ వేదికగా ఎండగట్టాలని సహచర మంత్రులకు సూచించారు. బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని, కృష్ణా జలాలపై హక్కులను రాబట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో జలాల వినియోగానికి సంబంధించి కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వారి హయాంలో చేసిన నిర్ణయాలు, కేంద్రానికి రాసిన లేఖలు, కుదుర్చుకున్న ఒప్పందాలు, బీఆర్ఎస్ హ యాంలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేశారన్న అంశాలను సభకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ సోమవారం రాత్రి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు మూడున్నర గంటలపాటు మంత్రులతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీటికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టులపై సమగ్ర చర్చ తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న అనుమతులు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభలో చర్చకు పెట్టనున్నారు. సాగునీటి రంగం విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో రాష్ట్రానికి జరిగిన నష్టం వి వరించడంతో పాటు బీఆర్ఎస్ చేస్తున్న అసత్యాల ను ఎండగట్టాలని నిర్ణయించారు. అవసరం అ యి తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధం కావాలని కూడా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.మొత్తం 4 రోజులు అసెంబ్లీ ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని, ఆ తర్వాత జనవరి రెండో తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం నాలుగు రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఇటీవల ముగిసిన పంచాయ తీ ఎన్నికల ఫలితాల సరళి, ఇతర వర్తమాన రాజకీయ అంశాలపై సమావేశంలో విస్తృతంగా చ ర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై సీఎం రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొంత కష్టపడితే సీట్లు పెరిగేవని, కొన్ని జిల్లాల్లో ఇబ్బంది ఎదుర్కొన్న విషయాన్ని, నియోజకవర్గాల వారీగా గెలుచుకున్న పంచాయతీలను మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని సూచించారు. జిల్లాల ఇన్చార్జి మంత్రు లే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు బాధ్య త చేపట్టాలని, మొత్తం జెడ్పీలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక జీహెచ్ఎంసీలో శివారు మునిసిపాలిటీల విలీనం అనంతరం చేపట్టిన డివిజన్ల పునర్వ్యవస్థీకరణ తీరుతెన్నులను వివరించినట్లు తెలిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించే అంశం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయిద్దామని సీఎంచెప్పినట్టు సమాచారం. -
పార్టీ నాకు కన్నతల్లిలాంటిది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రేవంత్‌పై ఆయన మండిపడ్డారు. ‘‘పార్టీ అంటే నాకు కన్నతల్లిలాంటిది. మా నాయకుడు ఆదేశిస్తూ పదవుల్ని గడ్డిపోచలా వదిలేశా. రేవంత్‌రెడ్డి పార్టీ మార్చే ఊసరవెల్లి. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర ఆయనది. ఫోర్ట్ సిటీ ఎందుకన్న కేసీఆర్ ప్రశ్నకు రేవంత్ నుంచి సమాధానమే లేదు. ఆయనవన్నీ సొల్లు మాటలు’’ అని హరీష్‌రావు అన్నారు. రేవంత్ ఏమన్నారంటే.. ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుర్చీ కోసం కుమారుడు కేటీఆర్, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందన్న భయంతోనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ ఉన్నంతకాలం హరీశ్‌రావు ఎక్కడికీ పోరు. పార్టీతో పాటు పార్టీ ఆస్తులపై ఆయన కన్నేశారు. కానీ, బీఆర్ఎస్ను కేటీఆర్ చేతిలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. నేను కోటి మంది మహిళలకు చీర, సారె ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం కవితను పార్టీ నుంచి బయటకు పంపింది అని విమర్శించారు.


