ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని రేవంత్‌రెడ్డి నెరవేర్చలేదని.. అది అడిగినందుకే కేసీఆర్‌పై ఆయన నోరు పారేసుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారం దక్కనివ్వనని శపథం చేసే బదులు.. ఆ హమీలేదో నేరవేర్చేందుకు శపథం చేయాలంటూ సెటైర్లు వేశారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు(KTR Slams CM Revanth Reddy). శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. రోజూ తిట్ల పురాణం తప్ప రేవంత్ చేసేదేమీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఏం భాష?. హైదరాబాద్ గల్లీల్లో తిరిగిన నేను కూడా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు లో బూతులు తిట్టగలను. ఏనుగు లాంటి కేసీఆర్ ను తిడుతున్నారు, చావు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని గీతమ్మ జాగ్రత్తగా చూసుకోవాలి..
ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. సోనియా, ప్రియాంక గాంధీ మీద ఒట్టు పెట్టి హామీలు ఎగవేశారు. నెలకు రూ. 2500 ఇవ్వడానికి మొఖం లేదు కానీ, కోటి మంది మహిళలను కోటీశ్వరులు కావాలట!. సీఎం పెద్ద పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారు. రోడ్లపై పెయింట్ వేసుకునే రేవంత్ రెడ్డి పెద్ద స్థాయికి వస్తే మంచిదే. కానీ మంచి పనులతో రావాలి. పేమెంట్ కోటాలో సీఎం అయ్యి... ఇప్పుడు కూడా నెలనెలా ఢిల్లీకి సంచులు పంపుతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమే. కాంగ్రెస్ పాలనలో ఒక్క చెరువు కట్టలేదు. మేడిగడ్డ ఆనకట్టను కూల్చిన కాంగ్రెస్ నేతలు... ఇపుడు బీఆర్‌ఎస్ కట్టిన చెక్ డ్యాంలను బాంబులతో పేలుస్తున్నారు. ఇసుక దందాల కోసమే ఆ పని చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి కొడుకు భూములు కబ్జా చేస్తుంటే కేసు పెట్టిన పోలీసు అధికారిని లూప్ లైన్లో పెట్టారు..
కేసీఆర్ దయతో అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే అయ్యాడు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పేరు గాంధీ... చేసేవి గాడ్సే పనులు. భూకబ్జాలకు పాల్పడుతున్నారాయన. దమ్ముంటే గాంధీ శేరిలింగంపల్లి క్షేత్రానికి రావాలి, ఆ ఉప ఎన్నికల్లో తేల్చుకుందాం. కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెబుతున్నారు. స్పీకర్ కళ్లు ఉండి చూడలేని ధృతరాష్ట్రునిలా తయారయ్యారు. ఎన్నికలకు భయపడి పదిమంది ఎమ్మెల్యేలు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంగల్లా కలిసినా మనం గట్టిగా కొట్లాడదాం.
..ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని రేవంత్‌రెడ్డి అమలు చేయడం లేదు. ముందు ఆ హామీలను నెరవేరుస్తానని శపథం చేయాలి. కోటి మంది మహిళలకు జనవరి ఒకటి నుంచి నెలకు రూ.2500 ఇస్తామని రేవంత్ రెడ్డి శపథం చేయాలి. హామీ ఇచ్చినట్లు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి శపథం చేయాలి. పాలమూరు - రంగారెడ్డి గురించి కేసీఆర్ అడిగితే సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హామీల అమలు గురించి కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు
కేసీఆర్ బయటకు రా అని కాంగ్రెస్ నేతలు అన్నారు. తీరా కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్ పెడితేనే ముచ్చెమటలు పట్టి చలిజ్వరం తెచ్చుకున్నారు. అలాటింది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తారు. నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి? తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా?. మా నాన్నను తిడుతున్నందుకు నాకు చాలా కోపం ఉంది, నేను గుంటూరులో చదివితే తప్పేమిటి... రేవంత్ రెడ్డి లాగా చదువు లేకుండా తిరగలేదు. నేను ఆంధ్రాలో చదివితే తప్పు అట కానీ, ఆయన ఆంధ్రా అల్లుడిని తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా?. రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు. అమెరికాలో ఎవరి పని వారు చేసుకోవాలి, నేను చేసుకుంటే తప్పా?.. ఆయనలా దొంగ పనులు చేయలేదు. ఢిల్లీకి సంచులు మోసుకుంటూ గులాంలాగా బతకబోం. తెలంగాణ పౌరుషంతో బతుకుతాం.
కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వబోమని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు ఆయన్ను కొడంగల్‌లో గెలవకుండా చూద్దాం. నిజమైన మార్పు ఊళ్ళల్లో సర్పంచ్ ఎన్నికల్లో ప్రారంభం అయింది. బీఆర్ఎస్‌కు అండగా నిలుస్తున్న హైదరాబాద్ వాసులకు పాదాభివందనం చేసినా తప్పులేదు. హైదరాబాద్‌ను ఎన్ని కార్పొరేషన్లు చేసినా గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలి. 2026లో గట్టిగా కష్టపడితే... 2027లో ఎన్నికల వాతావరణ వస్తుంది, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు పోరాడదాం అని బీఆర్‌ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు.


