పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని బీఆర్‌ఎస్ వ్యూహం
పథకంతో లబ్ధి చేకూరే నియోజకవర్గాలవారీగా సన్నాహక సభలకు కేసీఆర్ ఆదేశం
ఎర్రవల్లి నివాసంలో పార్టీ నేతలతో కీలక సమావేశం.. పాల్గొన్న కేటీఆర్, హరీశ్ తదితరులు
తొలిరోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం
సమావేశాల ఎజెండా చూశాక మిగతా రోజుల్లో హాజరుపై రానున్న స్పష్టత
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్‌ఎస్ తలపెట్టిన పోరుబాట బహిరంగ సభల షెడ్యూల్‌ను అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాతే ఖరారు చేయాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ పథకానికి నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరి«ధిలో బహిరంగ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో కేసీఆర్ శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు.
ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుతోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో సభల నిర్వహణ షెడ్యూల్‌పై చర్చించినప్పటికీ అసెంబ్లీ సమావేశాల తర్వాతే ఖరారు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే బహిరంగ సభల తేదీల ఖరారు కోసం ఎదురుచూడకుండా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ పథకంతో ప్రయోజనం చేకూరే అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో సన్నాహక సభలు, సమావేశాలు నిర్వహించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి నియో జకవర్గ స్థాయి వరకు సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సభలు, సమావేశాల పోస్టర్లు, కరపత్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మరోవైపు ఈ నెల 29న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తొలి రోజు భేటీకి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం.
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఏయే అంశాలను చర్చిస్తారనే ఎజెండాను చూసిన తర్వాత మిగతా రోజుల్లో సభకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై స్పష్టత రానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్‌కు సంబంధించిన అంశాలకే పరిమితం కాకుండా ప్రజాసమస్యలన్నింటిపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా ఫీజు రియింబర్స్‌మెంట్, పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు, రైతాంగ సమస్యలు, ఎరువుల కొరత వంటి అంశాలపై చర్చ కోసం పట్టుబట్టాలని ఆదేశించారు.


