సాక్షి, చిత్తూరు: రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు. అబద్ధాల విషయంలో చంద్రబాబు, పవన్ పోటీ పడుతున్నారని అన్నారామె.
బుధవారం నగరిలో రాయలసీమపై చంద్రబాబు ప్రదర్శిస్తున్న కపటప్రేమను ఆమె బయటపెట్టారు. ‘‘రాయలసీమపై ప్రేమ ఉందని చెబుతున్న మీరు.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలి. రూ.24 వేల కోట్ల ప్రాజెక్టులు పెట్టామని అంటున్నారు.. అవి ఎక్కడున్నాయో ప్రజలకు చూపించండి’’ అని నిలదీశారు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.
కరువు.. చంద్రబాబు కవల పిల్లలు
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని రోజా అన్నారు. ‘‘కరువు, చంద్రబాబు కవల పిల్లలు’’ అంటూ విమర్శించారు. గతంలో వైఎస్సార్, వైఎస్ జగన్ పాలనలో సాగునీరు, వ్యవసాయంపై తీసుకున్న చర్యలను చూసి చంద్రబాబు పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో దమ్ముంటే రికార్డులు బయటపెట్టాలని సవాల్ చేశారు. ‘రైజింగ్ రాయలసీమ’ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుతో ఎవరూ పోటీ పడలేరని రోజా వ్యాఖ్యానించారు.
అమరావతి వరదల్లో వేల కోట్లు?
అమరావతి ప్రాంతంలో వరదల నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా రోజా విమర్శలు చేశారు. వేల కోట్ల రూపాయలను అమరావతి వరదల్లో, బురదలో చంద్రబాబు పారబోస్తున్నారని అన్నారు. అదే సమయంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అన్నారు. కుప్పానికి, పిఠాపురానికి కూడా నీళ్లు ఇవ్వలేని వారు రాయలసీమ అభివృద్ధి గురించి పెద్ద మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టడం అంత సులభం కాదని, ఎన్నికల్లో ఈ విషయాలను ప్రజలు గమనిస్తారని వ్యాఖ్యానించారు.
అధికారంలో వచ్చి 27 నెలలు పూర్తైన ఇంకా డ్రామాలు ఆడుతూనే ఉన్నారు. అబద్ధాలు ఆడడంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పోటీ పడుతున్నారు. జగన్ హయాంలోనే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. మూడేళ్లు అవుతున్నా పనులు చేయకుండా క్రెడిట్‌చోరీ చేస్తున్నారు. రాయలసీమకు సాగునీరు, ప్రాజెక్టులు, కొత్తగా అందించిన ఆయకట్టు వివరాలపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు వెల్లడించాలని రోజా డిమాండ్ చేశారు. మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చేసిన పనులను ప్రజల ముందు ఉంచాలని ఆమె అన్నారు.
ఇదీ చదవండి: లోకల్ సమరం వేళ టీడీపీ బెదిరింపులు!


