breaking news
-
కాంగ్రెస్ గూండాల దాడికి ప్రతిదాడి తప్పదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి వస్తన్నాయేగానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత బిట్ల బాలరాజు, ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారాయన. అనంతరం.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉంది. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదు.. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. "ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని హెచ్చరించారాయన. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. గాయపడిన భారతి గారి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని.. న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. "ఖబడ్దార్ కాంగ్రెస్ గుండాలారా" అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్లు.. భారతి పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెతో పాటు బాలరాజులపై దాడి చేసిన వారిని, ఆ దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే 'అటెంప్ట్ టు మర్డర్' (హత్యాయత్నం) కేసులు నమోదు చేయాలి. వెంటనే దోషులను అరెస్ట్ చేసి బాధితుల పక్షాన నిలబడాలి. ఆసుపత్రి పాలైన ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరామర్శలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, స్థానిక కార్యకర్తలు కేటీఆర్ వెంట ఉన్నారు. -
ప్రధాని మీటింగ్ లీక్స్.. కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓటు చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని, ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి సమావేశం జరిగిన విషయాన్ని కిషన్ రెడ్డి వివరించారు. ఆ సమావేశం మర్యాదపూర్వక భేటీ అని, అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు.ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయట పెట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా? లీక్ చేసినోడు మెంటలోడు. ఎవరో తెలిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతర్గత విషయాలను బయటకు చెప్పడం పార్టీ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
సాక్షి, హైదరాబాద్: సామాజిక తెలంగాణయే తన ధ్యేయమని, 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రజలు సూచించిన పేరునే పారీ్టకి పెడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం ‘ఆస్క్ కవిత’హ్యాష్ ట్యాగ్‌పై ‘ఎక్స్’లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలని, నాణ్యమైన, మెరుగైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని కోరారు. తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల రైతులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. -
రంగంలోకి గులాబీ బాస్.. గేరు మార్చనున్న కారు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రత్యక్షంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది.నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. తెలంగాణకు సాగునీటి విషయంలో బీజేపీ కూడా అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి బీజేపీ సహకరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎదుర్కొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు.బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో బీఆర్ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటుంది. తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి షాక్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి తన సొంతూరులోనే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డిగూడ సర్పంచ్‌గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు.. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికీ ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన సొంతూరు ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి రామచంద్రయ్య ఘన విజయం సాధించారు. ధన్వాడ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం, పైగా పర్ణికారెడ్డికి అత్తాకోడళ్ల వరుస.. దీనికి తోడు ధన్వాడలో పోటీ పడింది కూడా అత్తాకోడళే కావడం.. ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు ఖమ్మంలోనూ కాంగ్రెస్‌కు ఎదురుగాలి తప్పలేదు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ప్రచారం చేసిన వాటిల్లో కేవలం రెండు చోట్ల (ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి) మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా నెగ్గారు.రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో.. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపొందగా.. తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అదే సమయంలో స్వతంత్రులు కూడా సత్తా చాటారు. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణలోని 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..కాంగ్రెస్-2,112 బీఆర్ఎస్-1,025 బీజేపీ-225ఇతరులు(స్వతంత్రులు.. సీపీఐ-సీపీఎం బలపర్చినవాళ్లు)-549 గెలుపొందారు. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదు కాగా.. ఇది తొలి విడత కంటే 1.58% ఎక్కువ. ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇప్పటివరకు 8,567 పంచాయతీల ఎన్నికలు పూర్తైంది. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 5,195, బీఆర్ఎస్ మద్దతుదారులు 2,338, బీజేపీ 440గా ఉన్నారు. బీజేపీ కంటే ఇతరులు సాధించిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. శాఖలే మారుస్తారా? లేదంటే.. మంత్రులనే మారుస్తారా? అనే విషయంలో మాత్రం తనకు స్పష్టత లేదన్నారు. అయితే, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,« అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిందనని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్, సురేఖను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, వాళ్లిద్దరూ కాంగ్రెస్ నేతలే అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్ వచ్చారు. ఈసందర్భంగా ఆయన తెంగాణభవన్‌లో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే నన్ను మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. స్వయంగా కేసీ వేణుగోపాల్ ప్రతిపాదన పెట్టారు. కానీ, నాకు మంత్రి పదవిపై మక్కువ లేదని చెప్పాను’అని అన్నారు. మహేశ్‌గౌడ్ ఇంకా ఏమన్నారంటే.. వేదికపైకి మంత్రులను పిలిస్తే బాగుండేది.. గ్లోబల్ సమ్మిట్‌లో రాజకీయ ప్రాధాన్యత ఉండొద్దనే ఉద్దేశంతోనే మంత్రులను స్టేజీ మీదకు ఆహ్వానించలేదు. అయితే, మంత్రులను కూడా వేదికపైకి పిలిస్తే బాగుండేది. కొందరు ఐఏఎస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ గ్లోబల్ సమ్మిట్‌కు కూడా వస్తే బాగుండేది. గ్లోబల్ సమ్మిట్ ప్రతిఏటా పెడితే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నాం. బీసీ ప్రైవేట్ బిల్లు పార్లమెంటులో పెడితే బాగుంటుందని రాహుల్ గాం«దీకి చెప్పాం. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ పదవులనూ తొలివిడతలోనే భర్తీ చేయాలి. కానీ, అక్కడ వచి్చన దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోలలేదు. అందుకే ఆ రెండింటిని పెండింగ్‌లో ఉంచాం. జనం కవిత మాటలు నమ్ముతున్నారు... బీఆర్ఎస్ కథ ముగిసిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని కవిత దగ్గర నుంచి చూసింది కాబట్టే.. ఆమె మాటలను ప్రజలు అంగీకరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేకుండా మనుగడ సాధించడం అంత సులభం కాదు. కేసీఆర్ ఇమేజ్ కేటీఆర్‌కు రాలేదు. హరీశ్‌రావు దెబ్బకొట్టడం ఖాయం. డబ్బులతో కేటీఆర్ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరుగుతుందో కేసీఆర్ ముందే ఊహించారు.. అందుకే ప్రచారానికి రాలేదు’ బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఏమాత్రం లేదు. బీజేపీ అధిష్టానానికీ ఆ విషయం తెలుసు. బీజేపీకి 60–70 స్థానాల్లో కనీసం కేడరే లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తు న్నారు. కానీ మేమే కొన్ని విలువలు పాటిస్తున్నాం. కాబట్టే.. అవకాశం ఇవ్వడం లేదు. మళ్లీ ప్రభుత్వం రావడం అనేది మాకు నల్లేరు మీద నడకే. ఇన్వెస్లర్ల చూపు హైదరాబాద్ వైపే... రేవంత్ రెడ్డి విజనరీ ఉన్న లీడర్. ఫోర్త్ సిటీ పూర్తయితే దేశంలోని మరే నగరం హైదరాబాద్‌తో తట్టుకోలేదు. కంపెనీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పాలసీలు రూపొందించాం. టెస్లాను హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో సహకరించాలని రాహుల్ గాం«దీని కోరాం. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇన్వెస్టర్లు మాత్రం హైదరాబాద్ వైపే చూస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏ పెద్ద వెంచర్లోకి వెళ్లినా పుణే, చెన్నై, ముంబై, బెంగళూరుకు చెందిన వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువశాతం వెంచర్లలో 25 నుంచి 30 శాతం మహారాష్ట్ర వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ ఇండియాలోనే నంబర్ వన్ నగరంగా మారబోతోంది. -
వైఎస్సార్ పిలిస్తే కాంగ్రెస్‌లోకి వచ్చా
సాక్షి, హైదరాబాద్: తాను హరీశ్‌రావుపై కోపంతో బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లానని కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్పిన మాటల్లో వాస్తవం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జ గ్గారెడ్డి పేర్కొన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు తాను కాంగ్రెస్‌లోకి వచ్చా నని స్పష్టం చేశారు. ‘నేను బీఆర్ఎస్ను వీడడానికి, హరీశ్‌రా వుకు సంబంధం లేదు. అసలు ఆయన కారణమే కాదు. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని నా మిత్రుడు జెట్టి కుసుమకుమా ర్తో వైఎస్సార్ ఆహ్వానం పంపారు. నా రాజకీయం నచ్చి పిలిపించారు. కాంగ్రెస్‌లో చేరమన్నారు. సంగారెడ్డి నియోజ కవర్గానికి ఐఐటీతో పాటు ఫోర్‌లేన్ హైవే ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. అసలు కవితకు అప్పు డు రాజకీయాల్లో అ, ఆ లు కూడా రావు. మరోమా రు ఇలాంటివి మాట్లాడొద్దు..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.హరీశ్‌తో వార్ నడుస్తూనే ఉంటుంది..కేసీఆర్ కుమార్తె కాబట్టి కవిత లీడర్ అయిందని, తాను వ్యక్తిగతంగా ఎదిగిన నాయకుడినని జగ్గారెడ్డి అన్నారు. వాళ్ల పంచాయతీలోకి నన్ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో హరీశ్‌రావుకు, తనకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుందని చెప్పారు. తాను డైరెక్ట్‌గా రాజకీయం చేస్తే, హరీశ్‌రావు వెనుక నుంచి పొడిచే రాజకీ యం చేస్తాడని ఆరోపించారు. తాను రాజకీయంగా కొంత డిస్టర్బ్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. అయితే ఎందుకు మానసికంగా చలించాననే విషయం సమయం వచ్చిన ప్పుడు చెపుతానని, మేలో అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. తాను ఒక్కసారి డిసైడయ్యాక మళ్లీ వెనుకకు వచ్చే మనిషిని కాదని, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద కూడా ఆసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
రెండో విడతలో 85.86% ఓటింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లో మరింత భారీగా పోలింగ్ నమోదైంది. తొలివిడత ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్‌నమోదు కాగా.. రెండో విడతలో 1.58 శాతం ఎక్కువగా 85.86% ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. మొత్తం మీద రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌కేంద్రా ల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ముగియగా, ఆలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. పోలింగ్ముగిశాక కౌంటింగ్ప్రారంభించి విజేతలను ప్రకటించారు. ఏకగ్రీవాలను మినహా యిస్తే రెండు విడతల్లో కలిపి 7,745 పంచాయతీలకు ఎన్నికలు ముగియగా, మూడో దఫాలో భాగంగా ఈ నెల 17న మరో 3,759 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మహిళా ఓటర్లే ఎక్కువ.. రెండో దఫాలో 3,911 పంచాయతీలకు, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. మొత్తం 54,40,339 మంది ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72%, ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా నిజామాబాద్జిల్లాలో 76.71%, జగిత్యాలలో 78.34% ఓటింగ్ నమోదైంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ పాల్గొన్నారు. ఈ విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక మరో 416 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యాదాద్రి జిల్లా టాప్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈసారి 54,40,339 ఓటర్లు ఉండగా.. 46,70,972 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 27,82,494 ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 22,77,902 మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా 2,02,716 మంది ఓటర్లకు గాను..1,8,5937 మంది ఓటింగ్‌తో (91.72 శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,38,838 ఓటర్లు ఉండగా.. 1,83,219 మంది ఓటింగ్ (76.71 శాతం)తో చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లాలో 91.21%, సూర్యాపేట జిల్లాలో 89.55%, మెదక్88.74%, నల్లగొండ జిల్లాలో 88.74% నమోదు కాగా.. జగిత్యాల (78.34%), భద్రాద్రి కొత్తగూడెం (82.65%), నిర్మల్ (82.67%), వికారాబాద్ (82.72%)లో వరుసగా అత్యల్ప ఓటింగ్ నమోదైంది. తగ్గిన పోస్టల్ బ్యాలెట్లు: పోలింగ్ ముగిసిన తర్వాత మ ధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. గతంతో పోలి స్తే ఈసారి పోస్టల్బ్యాలెట్ఓట్లు భారీగా తగ్గినట్లు అధికారు లు పేర్కొన్నారు. కాగా వార్డుల వారీగా ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. రెండో విడత ఎన్నికలు మొత్తం మీద ప్రశాంతంగా ముగిశాయి.పోటెత్తిన మహిళలు ఈ విడతలో మొత్తం మహిళా ఓటర్లు 27,82,494 మంది ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.62%, ఖమ్మం 90.88%, మెదక్ 89.28% అత్యధికంగా ఓటింగ్ నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం 81.38%, వికారాబాద్ 81.79%, ములుగు 82.79% ఓటింగ్ నమోదైంది. పురుషుల ఓటింగ్ శాతంలో కూడా యాదాద్రి (91.83%), ఖమ్మం (91.56%) జిల్లాలే ముందంజలో ఉన్నాయి.రాష్ట్రంలో ఎన్నికలు నోటిఫై అయిన పంచాయతీలు: 12,723ఏకగ్రీవమైనవి: 1205తొలిదశలో ఎన్నికలు జరిగినవి: 3,834రెండో విడతలో జరిగినవి: 3,911మూడో విడతలో జరిగేవి: 3,759(మిగిలిన వాటిలో కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు కాకపోగా, మరికొన్ని కోర్టు కేసులు ఇతర కారణాలతో ఎన్నికలు జరగడం లేదు) -
యావన్మందికీ తెలియజేయునది ఏమనగా..?
రెండో విడత పంచాయతీ ఫలితాల్లోనూ..తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనేక సర్పంచ్ స్థానాలకు సమాన ఓట్లు రాగా, లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఒక్క ఓటుతోనూ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. పోటీలో ఉన్న వారి మేరకు విజ్ఞప్తి మేరకు రెండుమూడుసార్లు రీకౌంటింగ్ కూడా చేశారు. ధర్మసాగర్/ హవేళిఘణాపూర్/అనంతగిరి/ వేములపల్లి /పుల్కల్/ ఎల్లారెడ్డిరూరల్/ కౌటాల/కాసిపేట: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో ఎండీ సత్తార్, బీఆర్ఎస్ మద్దతుతో హఫీజ్ పోటీ చేశారు. 328 ఓట్లు పోల్ అవగా, సత్తార్, హఫీజ్‌లకు సమానంగా 164 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ సత్తార్‌ను విజయం వరించింది. టాస్ వేయాల్సి ఉండగా, డ్రా ఎందుకు తీశారని బీఆర్ఎస్ మద్దతుదారు హఫీజ్ నిరసన తెలుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మెదక్ మండలం చీపురుదుబ్బతండా సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బీమిలి, కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతకు చెరి 182 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీయగా.. సునీత సర్పంచ్ పీఠం కైవసం చేసుకుంది. వికారాబాద్ మండలం జైదుపల్లి సర్పంచ్‌గా ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్లోళ్ల మౌనిక, నాగిరెడ్డికి 302 చొప్పున ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా నిర్వహించగా మౌనికను అదృష్టం వరించింది.నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన సాయిని మౌనికకు సమానంగా 352 ఓట్ల చొప్పున వచ్చాయి. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఓట్లు సమానం రావడంతో ఇద్దరి మధ్య టాస్ వేశారు. టాస్ గెలిచిన ఉపేంద్రమ్మ సర్పంచ్ అయ్యారు.సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డులో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు సమానమైన ఓట్లు పొందారు. దీంతో అధికారులు టాస్ వేశారు. టాస్‌లో శ్రీకాంత్‌ను విజయం వరించింది.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మంగళి సంతోశ్‌కుమార్, పెంట మానయ్యలకు సరి సమానంగా 483 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేసి మంగళి సంతోశ్‌కుమార్ సర్పంచ్‌గా గెలుపొందినట్టుప్రకటించారు.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి సర్పంచ్ స్థానానికి జరగిన ఎన్నికలో బీఆర్ఎస్ బలపర్చిన రజినికాంత్‌కు 204 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతుదారు జాడి కావేరికి 204 ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రాలో కావేరి పేరు రావడంతో ఆమె గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడితండా(కే) గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన బలరాం రాంచందర్‌లకు 193 చొప్పున ఓట్లు పోల్ అయ్యాయి. రీకౌంటింగ్ జరిపినా అవే ఓట్లు వచ్చాయి. డ్రాలో బలరాంను అదృష్టం వరించింది.నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వెంకాయపల్లిలో కాంగ్రెస్ మద్దతుతో వెంకటేశ్వరమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో ఆలేటి ఇందు పోటీ చేశారు. ఇద్దరికి చెరి 236 ఓట్లు రాగాటాస్ వేయగా వెంకటేశ్వరమ్మ గెలిచారు. -
తొలిలాగే మలి!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపుగా తొలి విడత ఫలితాలే పునరావృతమయ్యాయి. మొదటి విడత తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే విజయం సాధించారు. ఆదివారం రాష్ట్రంలోని 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు 2,067 మంది గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 1,160 స్థానాలు గెలుపొందగా, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 250 మంది గెలిచారు. మరోవైపు స్వతంత్రులు, సీపీఎం, సీపీఐ పారీ్టలకు చెందిన వారు.. 429 మంది గెలుపొందారు. వీరు మొత్తం స్థానాల్లో 11 శాతానికి పైగానే గెలుపొందడం విశేషం. ఇక రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 4,500 దాటింది. బీఆర్ఎస్ బలపర్చిన 2,300 మంది విజయం సాధించగా, బీజేపీ బలపర్చిన వారు 440 మంది వరకు గెలుపొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎవరికి ఎంత శాతం..?తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలో కూడా 55 శాతం వరకు పంచాయతీలు కాంగ్రెస్ బలపర్చిన వారికే దక్కగా, అదే సమయంలో బీఆర్ఎస్ సైతం మంచి పోటీ ఇచి్చంది. ఆ పారీ్టకి 29 శాతం కంటే ఎక్కువగా పంచాయతీలు దక్కాయి. బీజేపీ మద్దతిచి్చన వారు 6 శాతానికి పైగా విజయం సాధించారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఎప్పుడంటే?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న (శనివారం) బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం జరగనుంది. వచ్చే శనివారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. కృష్ణా,గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం,కార్యచరణపై చర్చ, రాబోయే ప్రజా ఉద్యమాలు,సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
పల్లెల్లో ‘పైసా వసూల్’!
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పల్లెల్లో నగదు పంచిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు తిరిగి వసూళ్లకు తెరతీస్తున్నారు. తమను గెలిపిస్తారని డబ్బు పంచామని.. కానీ ఓడగొట్టినందున ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందేనని ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు నగదు పంపకాల జోరు పెంచారు. ఓ గ్రామంలో నలుగురు అభ్యర్థులు కలిపి ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేల చొప్పున ముట్టజెప్పారు.రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేసినా ఓడా.. నా డబ్బిచ్చేయండి నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరిగాడు. తనకు ఓటు వేయనివారు తాను పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘మా డబ్బు తీసుకొని మమ్మల్నే ఓడించారు. అందుకే మేం పంచిన డబ్బు తిరిగి ఇవ్వండి’ అని పట్టుబట్టారు. మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పగా దేవుడిపై ప్రమాణం చేయాలని కోరారు. తాము పేదవాళ్లమని, రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేసినా గ్రామస్తులు ఓట్లు వేయలేదని బాలరాజు దంపతలు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఓటర్లు మాత్రం ‘మేము డబ్బు పంచాలని అడగలేదు కదా.. మీరే ఇచ్చారు’ అని బాలరాజును తిరిగి ప్రశ్నించారు.కాంగ్రెస్ నేతకు బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో ఈ నెల 17న మూడో విడత ఎన్నికల్లో బరిలోకి దిగనున్న షేక్ గౌసుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత పోలగాని శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని లేఖ రాసిచ్చాడు. ఈ లేఖపై గౌసుద్దీన్తోపాటు బీఆర్ఎస్ కారేపల్లి గ్రామశాఖ పేరిట పలువురి సంతకాలు ఉన్నాయి. దేశ్ముఖిలో ఓటుకు రూ. 33 వేల చొప్పున పంపిణీ సాక్షి, యాదాద్రి: భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు భారీగా డబ్బు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఈ గ్రామంలో 1,367 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున ఇస్తుండగా మూడో అభ్యర్థి రూ. 8 వేలు, నాలుగో అభ్యర్థి రూ. 5 వేల చొప్పున పంచుతున్నారు. ఈ లెక్కన ఒక్కో ఓటరుకు రూ. 33 వేలు ముడుతున్నాయన్నమాట.వయసు, మెజారిటీ 71 యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండాకు చెందిన ధీరావత్ గాశీరాంనాయక్ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాడు. గాశీరాంనాయక్ వయసు 71 ఏళ్లుకాగా సమీప ప్రత్యర్థిపై ఆయనకు లభించిన మెజారిటీ ఓట్లు కూడా 71 కావడం విశేషం.ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధుల కోసం వచి్చన అధికారులు, సిబ్బందికి భోజనం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న 100–150 మంది ఉద్యోగులకు భోజనం లేకపోవడంతో తాము ఎక్కడ భోజనం చేయాలంటూ వాపోయారు. అధికారులపై మండిపడ్డారు.ఓట్ల రద్దీ.. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతవాసులు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఇలా కిటకిటలాడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు జగ్గారెడ్డి సన్మానం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించడం మామూలే. కానీ ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు శాలువాలు కప్పి సన్మానించిన ఘటన సంగారెడ్డిలో శనివారం జరిగింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 87 మంది పోటీ చేయగా వారిలో 45 మంది గెలిచారు. ఓటమి పాలైన 42 మంది సర్పంచ్ అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శాలువాలతో సన్మానించారు. వారిలో కొండాపూర్ మండల కేంద్ర సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిన మస్కు అవినేని నర్సింహారెడ్డిని సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఓట్లేయలేదుగా.. నా సొమ్ము తిరిగివ్వండి వర్గల్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో వార్డుసభ్యునిగా ఓడిపోయన అభ్యర్థి ఓటర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వీడియో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు పంచినప్పటికీ తనకు ఓట్లు పడలేదనే భావనతో ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసుకున్నాడు. అలా వెనక్కి తీసుకున్న నగదును లెక్కపెట్టుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఓటు కోసం సౌదీ టు మిరుదొడ్డి మిరుదొడ్డి (దుబ్బాక): పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు విదేశాల నుంచి తరలివచ్చి ఓ వ్యక్తి ఓటు విలువను చాటిచెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఎల్ముల బాల్‌రాజు నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఆదివారం జరగనున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు సౌదీ నుంచి మిరుదొడ్డికి చేరుకున్నాడు. -
ఇండియా కూటమి కొనసాగుతుంది
సాక్షి, హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన మేరకు రాకపోయినప్పటికీ దేశంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇండియా కూటమి కొనసాగుతుందని, కూటమి పక్షాన అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజన్ ఇండియా చర్చాగోష్టిలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన శనివారం తాజ్‌కృష్ణ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో పాగా వేయాలన్న ఏకైక ఆకాంక్షతో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్)ను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. యూపీలో ఉన్న 25 కోట్ల ఓట్లలో మూడు కోట్లను తొలగించాలని చూస్తోందని, ఆ పార్టీ ఎక్కువగా ఓడిపోయే స్థానాల్లోనే ఈ ఓటర్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనని కంపెనీకి ఓటర్ల తొలగింపు కోసం ఉద్దేశించిన మ్యాపింగ్ యాప్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. బూత్‌స్థాయి అధికారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, వారి చేతిలో సాంకేతికత కూడా లేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని, ఈసీ అంటే ఓట్లు తొలగించడం కాదని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడమని అన్నారు. ఓటరు కార్డులు నకిలీవి తయారు చేయడానికి వీల్లేకుండా పటిష్ట కార్డులు అమల్లోకి తీసుకురావాలని కోరారు. తెలంగాణలో ఉన్న పార్టీల్లో బీఆర్ఎస్ తమకు పాత మిత్రుడని చెప్పారు. భవిష్యత్తులో ఏఐ మంత్రిత్వ శాఖ అంతకుముందు విజన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ సమ్మిట్ (చర్చాగోష్టి)లో అఖిలేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాజీవనంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందరికీ మంచి చేసేదే నిజమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు. ఏఐని దుర్వినియోగం చేయడం మంచిది కాదని, అది సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. సైబర్ నేరాలు, పాస్‌వర్డ్‌ల చోరీ తదితర అక్రమాలన్నీ ఏఐతోనే సాధ్యమవుతాయని, ఈ ఏఐని సమగ్రాభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అఖిలేశ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటయినా ఆశ్చర్యం లేదని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. ఏఐని ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ఆయన పేర్కొన్నారు. -
తెలంగాణలో పార్టీ పనితీరుపై రాహుల్‌గాంధీ సంతృప్తి
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరు పట్ల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మెస్సీ, రేవంత్‌రెడ్డిల మధ్య జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి వివరించారని, ఈ సందర్భంగా ఆయన ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలిచిన విషయాలను వివరించారని తెలిపాయి. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించారని, మున్ముందు ఇదే పనితీరు కనబర్చాలని సూచించారని సమాచారం. కాగా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌లు ఒకే కారులో రాహుల్‌తో కలిసి వచ్చారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన రాహుల్‌గాందీకి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ.ఫహీమ్ తదితరులు స్వాగతం పలికారు. ఫీజు బకాయిలు చెల్లించాలి: కేటీఆర్సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు బకాయిల కోసం నవంబర్ 17 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి నాయకుడు రాకేశ్ దత్తా చేస్తున్న పాదయాత్ర 250 కి.మీ.తో శనివారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా రాకేశ్ దత్తా బృందాన్ని కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... విద్యార్థులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వానికి చేతులు రావడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాకేశ్ దత్తా మాట్లాడుతూ ఫీజు బకాయిలు విడుదల చేయాలని 20 రోజులుగా పాదయాత్ర చేశానన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కే విధంగా డ్రోన్లు వద్దని విద్యార్థులకు టాయిలెట్లు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పాదయాత్రలో ఖమ్మం నుంచి రాకేశ్ దత్తాతో పాటు విద్యార్థి నాయకులు గోనె శ్రీశ్రీ, ముదిగొండ పవన్, వాజెడ్ల అనిల్ తదితరులున్నారు. -
కాంగ్రెస్ అక్రమాలపై ప్రజాతీర్పు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, కాంగ్రెస్ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వెంటే నిలిచారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఈ నెల 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలవడమే దీనికి నిదర్శమన్నారు. కాంగ్రెస్ ప్రలోభాలు, బెదిరింపులు తట్టుకుని ప్రజల మద్దతుతో తమ పార్టీ అభ్యర్థులు సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు శనివారం నందినగర్ నివాసంలో కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ నేతలు, సర్పంచ్‌లు వందలాదిగా తరలిరావడంతో నందినగర్ నివాసం సందడిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సర్పంచ్‌లుగా గెలుపొందిన వారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడం కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సర్పంచ్‌లు ఉన్నారు. మరో వారం, పదిరోజుల పాటు కేటీఆర్ వరుసగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నూతన సర్పంచ్‌లను కలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్ యాదవ్‌తో కేటీఆర్ లంచ్ హైదరాబాద్ మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ చేశారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేశ్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు. కేఫ్ యజమాని శరత్ ఇద్దరు నేతలకు ఘన స్వాగతం పలికి లంచ్ ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేశ్.. హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను విజయవంతంగా నడుపుతుండటంపై యజమాని శరత్, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. కాగా, లంచ్ అనంతరం కేటీఆర్, అఖిలేశ్ యాదవ్‌తో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు. -
మెస్సీతో మేస్త్రీ ఫుట్‌బాల్.. ఆసుపత్రుల్లో గురుకుల విద్యార్థులు: హరీష్
సాక్షి, కోఠి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, అహంకారం, అరాచకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఢిల్లీ వెళ్లే సమయం ఉంది కానీ.. గురుకులాల్లో అస్వస్థతకు గురైన పిల్లలను పట్టించుకునే సమయం లేదా? అని ప్రశ్నించారు.బాగ్‌లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, విద్యార్థులను హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ శనివారం ఉదయం విద్యార్థులను పరామర్శించి.. ఫుడ్ పాయిజన్‌కు కారణాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం, హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో వసతులు, భోజనం కూడా సరిగా లేదు. 90 మంది బాగ్‌లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. ఫుట్‌బాల్ ఆడటంలో సీఎం, మంత్రులు బిజీగా ఉన్నారు. మెస్సీతో మేస్త్రీ ఫుట్‌బాల్ ఆట కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కబ్జాలు, కమీషన్లకే రేవంత్ రెడ్డి పరిమితం.. పిల్లలను పట్టించుకోవడం లేదు. 61 సార్లు ఢిల్లీ వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ.. పిల్లలను పరామర్శించరా?. రేవంత్‌ది విజన్ 2047 కాదు.. పిల్లల పాలిటి పాయిజన్ 2047.మొన్న శామీర్‌పేట బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని పోలీస్ స్టేషన్లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మాదాపూర్‌లో 43 మంది విద్యార్థులు కొండాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని విద్యార్థులు ఉన్నారు. దొడ్డు బియ్యం పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఫుట్‌బాల్ ఆడటంలో రేవంత్ బిజీగా ఉన్నారు. ప్రజల సొమ్ముతో సీఎం సోకులు తీర్చుకుంటున్నారు. కబ్జాలు, కమీషన్లకే టైమ్ సరిపోవడం లేదా?. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఉంది ప్రభుత్వ తీరు. బాత్ రూమ్‌లు కడిగే బ్రష్‌లతో.. వంట సామన్ కడుగుతున్నారట.చలి తీవ్రత పెరిగింది. చల్ల నీళ్లతో అమ్మాయిలు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లలో 116 మంది విద్యార్థులు చనిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు.. కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. విద్యా కమిషన్ ఎక్కడికి పోయింది?. పేదల మనసులు చదువుతా అని డైలాగ్స్ కొట్టడం కాదు.. పేద పిల్లల ఆకలి తీర్చండి. రాహుల్ గాంధీ పేదల కోసం రాడు.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడు. ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి రాహుల్ గాంధీ వస్తారట. ఇచ్చిన హామీలు అమలు కాకపోతే రాహుల్ ఎందుకు అడగడం లేదు?. కోఠి, నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అడిగి తెలుసుకోవాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. చిన్నారులు.. నేను పోను గురుకుల పాఠశాలకు అన్నట్లుగా మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేను వస్తున్నానని రోడ్లు వేశారు..
హైదరాబాద్: ఇరవై ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే నన్ను తీసి రోడ్డుపై వేశారని.. తాను మొండిదానినని ప్రజల కోసం ఎవరితోనైనా కొట్లాడుతానని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ‘జాగృతి జనం బాట’కార్యక్రమం మూడో రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్, నాగమయ్యకుంట బస్తీలలో పర్యటించి అనంతరం రాంనగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అడిగే వారు ఉంటే ఏ సమస్యకైనా ముందడుగు పడుతుందన్నారు. అందులో భాగంగానే సమస్యలపై నిలదీసేందుకు తాను ముందుకు వచ్చానని తెలిపారు. నేను వస్తున్నానని అంబర్‌పేటలో రోడ్లు వేశారు.. తెలంగాణ రాకముందు హైదరాబాద్ బస్తీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పేరుకు హైదరాబాద్‌లో ఉన్నామే తప్ప గ్రామాల్లో ఉన్న దానికంటే ఘోర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. తాను వస్తున్నానని తెలిసి అంబర్‌పేటలో రాత్రికి రాత్రి రోడ్లు వేశారని, యాకత్‌పురాలో మంచినీటి కాలుష్య సమస్యను పరిష్కరించారని చెప్పుకోచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచి్చన ఏ హామీని పరిష్కరించలేదన్నారు. అంతకు ముందు బోనాలతో, గుర్రపు బగ్గీలతో కవితకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు మహేందర్, శివారెడ్డి, మనోజ్‌గౌడ్, డేవిడ్, మీనా తదితరులు పాల్గొన్నారు. కళాశాలల్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలి కాచిగూడ: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి జనం భాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు. ముసారాంబగ్ బ్రిడ్జి పనులపై ఆరా..అంబర్‌పేట: అంబర్‌పేటలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జనంబాట కార్యక్రమంలో శుక్రవారం అంబర్‌పేట నియోజకవర్గంలో పలు సమస్యలను పరిశీలించారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ సరీ్వసు రోడ్డు, అలీకేఫ్ ప్రాంతంలో నిర్మిస్తున్న ముసారాంబగ్ బ్రిడ్జి పనులను ఆమె జాగృతి కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశి్నస్తానని ఆమె వెల్లడించారు. అనంతరం అంబర్‌పేట మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట పలువురు జాగృతి నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు. -
పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా రేవంత్ పాలనా వైఫల్యంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయినట్లు గురువారం వెలువడిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా అనేక మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికల కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేశారు. పోటీ చేసిన స్థానాల్లో కనీసం 44 శాతం సర్పంచ్ పదవులు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా రాకపోవడం రేవంత్ ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం.మరో మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగనున్నా గ్రామాల్లో అభివృద్ధి జరగదని గ్రామీణ ఓటర్లు నిర్ధారణకు వచి్చనందునే కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు స్వల్ప ఓట్ల తేడాతో గెలవడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కమలదళంలో మిశ్రమ స్పందన
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై కమల దళంలో మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 200 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడంపై బీజేపీ నాయకులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. పార్టీ బలం పెరుగుతోందని ప్రస్తుతం ఉన్న భావనకు అనుగుణంగా, ఆశించిన ఫలితాలు రాలేదనే అభిప్రాయం మరోవైపు విన్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ, కౌన్సిల్ ఎన్నికల్లో మూడింట్లో రెండు సీట్లు గెలుపొందాక.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర నేతలు అంచనా వేశారు. అయితే ఈ పరిస్థితులకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ జరుగుతోందా లేదా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమౌతున్నాయి.ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే వివిధ ఎన్నికల్లో గెలిచినంత స్థాయిలో గ్రామాల్లో పార్టీకి ఆశించిన ప్రాతినిధ్యం రాలేదని అంటున్నారు. సానుకూలంగా చూడాలి.. గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి పార్టీ రహితంగా, రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలు లేకుండా జరిగేవే అయినా, గ్రామాల్లో మద్దతుదారులను, కార్యకర్తలు, నాయకులను పార్టీలు వెనుకనుంచి బలపరుస్తాయనే విషయం తెలిసిందే. కాగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలపడేందుకు, విస్తరణకు ఈ ఎన్నికలు కీలకమనే విషయం కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా బీజేపీ ఈ విషయాన్ని కాస్త తేలిగ్గా తీసుకుందని, ముఖ్యంగా నామినేషన్ల దాఖలుకు ముందు జిల్లా, మండల నాయకులతో రాష్ట్ర నాయకత్వం పెద్దగా సమన్వయంతో వ్యవహరించిన దాఖలాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే ఈ ఎన్నికల బాధ్యత అంతా స్థానిక నేతలకే అప్పగించడంతో రాష్ట్ర పార్టీ నుంచి సమన్వయం, పర్యవేక్షణ అనేది నామమాత్రమై పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అన్ని చోట్లా పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. స్థానిక నేతలను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని, అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదనే విమర్శలు అప్పట్లోనే పార్టీ నాయకుల నుంచే వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 200 దాకా సర్పంచ్ పదవులు గెలుచుకోవడాన్ని సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని కొందరు ముఖ్య నేతలంటున్నారు. గ్రామ రాజకీయాల్లో పెరుగుతున్న పార్టీ పట్టుకు ఇది నిదర్శనమని అంటున్నారు. ఇదే తీరున 2,3 దశల పంచాయతీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన కనబరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత పట్టు బిగించేందుకు వీలవుతుందని నేతలు విశ్లేషిస్తున్నారు. సమన్వయం లోపించకపోతే మరింత మెరుగైన ఫలితాలు! అదే సమయంలో అన్ని జిల్లాల్లో అన్ని స్థానాలకు పార్టీ పోటీ చేయాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలైతే ఇచ్చారు కానీ దాని అమలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పోటీచేసి బలం చాటాలనే పార్టీ ఉద్దేశానికి అనుగుణంగా నామినేషన్లు దాఖలయ్యాయా ? ఆ మేరకు క్షేత్రస్థాయిలో గట్టి ప్రయత్నమేదైనా జరిగిందా అని కొందరు నిలదీస్తున్నారు.పార్టీలో పోటీకి ఆసక్తి చూపేవారిని ప్రోత్సహించడం, అభ్యర్థులను గుర్తించి పోటీకి నిలపడం, పోల్ మేనేజ్మెంట్లో సమన్వయం వంటి అంశాలపై నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. పంచాయతీల్లో పోటీకి ఆసక్తి, ఉత్సాహం కనబరిచే వారిని ప్రోత్సహించేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాల్సి ఉండగా అది అంతగా జరగలేదని చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగి ఉంటే పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని బీజేపీ నేతలు కొందరంటున్నారు. -
గులాబీ జోష్..
సాక్షి, హైదరాబాద్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించడంతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొన్నామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో నామమాత్ర ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. గురువారం వెలువడిన గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అధికార పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్న అనుకూలతలను పరిగణనలోకి తీసుకుంటే తమ పార్టీ బలపరిచిన సర్పంచ్‌లు అభ్యర్థులు ఏకంగా 1,345 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించడం గొప్ప విషయమేనని పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో కోల్పోయిన పట్టు తిరిగి సాధించామనే అభిప్రాయం పార్టీ యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. కలిసివచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనోత్సవాల పేరిట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసినా పెద్దగా ప్రభావం చూపలేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలు జరిగిన 31 జిల్లాల్లో తొలి విడతలో నల్లగొండ, జగిత్యాల, హనుమకొండ వంటి రెండు మూడు జిల్లాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్‌కు దీటుగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు గెలుచుకున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ, లోక్‌సభ ఎన్ని కల్లో పార్టీ ఓటమి చెందినా క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ చెక్కుచెదరలేదనే విషయాన్ని పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని బీఆర్ఎస్ అంటోంది.పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు చేసిన కృషితో పాటు అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లకు అనుగుణంగా అవకాశం ఇవ్వడం కలిసి వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ప్రతికూలంగా మారాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చినట్టుగా తొలి విడత ఫలితాల సరళి వెల్లడించిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరిగే మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మరింత స్పష్టంగా బయట పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 14, 17 తేదీల్లో జరిగే రెండు, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ నడుమ సమన్వయం పెంచడం ద్వారా.. మొత్తంగా ఐదు వేలకు పైగా పంచాయతీల్లో పార్టీ బలపరచిన అభ్యర్థులు గెలుస్తారనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది.ఎన్నికలు ముగిసిన తర్వాత సదస్సు.. సన్మానంగ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు లక్ష్యంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులతో సదస్సు నిర్వహించి వారిని సన్మానించాలని భావిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. తొలి విడతలో గ్రామ పంచాయతీల వారీగా గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలను సేకరించి, క్రోడీకరించే పనిలో తెలంగాణ భవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి. -
అత్యధికమే.. అనుకూలమేనా?
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్ని కల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత విశ్లేషణలు చేసుకుంటోంది. పార్టీలకతీతంగానే జరిగినా పక్కాగా రాజకీయ మద్దతుతోనే జరిగే ఈ ఎన్నికల్లో తమకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణే లభించిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనే భావనకు ఈ ఫలితాలు చెక్ పెడతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది.సంఖ్యాపరంగా మిగిలిన రాజకీయ పక్షాలు మద్దతిచ్చిన వారి కంటే తాము మద్దతిచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో గెలిచినా, తొలి విడత ఫలితం తమకు అనుకూలమేనా అనే కోణంలోనూ ఆ పార్టీ నేతలు లెక్కలు క డుతున్నారు. ఆశించిన మేరకు 90% పంచాయతీ లు దక్కలేదని అంటున్నారు. జిల్లాలు, ఉమ్మ డి జి ల్లాలు, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు మండలాలు, గ్రామాల వారీగా ఫలితాలను విశ్లే షిస్తూ ప్రస్తుతం తమకు చట్టసభల్లో ఉన్న బలానికి, తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితానికి మధ్య తేడాను గుర్తించే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారు. బీఆర్ఎస్ పోటీపై నిశితంగా..... ముఖ్యంగా తొలి విడత ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి ఎదురైన పోటీని కాంగ్రెస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధానంగా మహబూబ్‌నగర్, వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గట్టి పోటీ ఎదురవడంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినా ఈ నాలుగు జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురుకావడంపై పోస్టుమార్టం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాలని, తొలి విడతలో కొంత మేరకు జరిగిన నష్టాన్ని 2, 3 విడతల్లో పూడ్చుకోవాలని యోచిస్తోంది.సంఖ్యాపరంగా చూస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వెయ్యికి పైగా పంచాయతీల్లో గెలవడంపై కూడా పార్టీ అంతర్గత విశ్లేషణల్లో నిమగ్నమైంది. దీనిపై టీపీసీసీ నేత ఒకరు మాట్లాడుతూ ‘గ్రామ స్థాయి ఎన్నికల్లో పార్టీల కంటే ప్రత్యర్థుల పనితీరు ఎక్కువగా ఫలితాలనిస్తుందని అన్నారు. బీఆర్ఎస్కు 1000 పంచాయతీలు రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత ఆ పార్టీ అత్యంత పటిష్టంగా ఉన్నప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2,700 మంది గెలిచారని గుర్తు చేశారు.గ్రామాల్లో అనేక సమీకరణలుంటాయని, ఆ నేపథ్యంలో కొన్నిచోట్ల ప్రతిపక్షాలకు కూడా ఎక్కువగా అవకాశాలుంటాయని, ఆ కోణంలోనే బీఆర్ఎస్ గెలిచి ఉంటుంది తప్ప తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతతో కాదని ఆయన విశ్లేషించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొలివిడత ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో సంతోషం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల సమయానికి ఆశించిన మేరకు బలం పుంజుకున్నామని, ఈ జోరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నేతలంటున్నారు. రెండు దశలకు మరింత పకడ్బందీగా.. తొలివిడత పోలింగ్ సరళి, ఫలితాలను బేరీజు వేసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రానున్న రెండు దశల ఎన్నికలకు మరింత జాగ్రత్తగా, పకడ్బందీగా ముందుకెళ్లాలని భావిస్తోంది. తొలి విడత ఫలితాలపై ఆరా తీసిన సీఎం రేవంత్‌రెడ్డి 2, 3వ విడత ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రులకు సూచించారు. తొలి విడతలో మంచి ఫలితాలు సాధించామని, రెండు, మూడు విడతల్లో కూడా ఇంతకుమించి ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టితో పనిచేయాలని కోరారు. పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఓటు వేయలేదని..
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరు ఏదో ఒక రూపంలో తమ అక్కసును వెళ్లగక్కారు. ఓటమిని జీర్ణించుకోలేని ఓ సర్పంచ్ అభ్యర్థి రైతులు పొలాలకు వెళ్లే దారిని మూయించాడు. మరోచోట సర్పంచ్ అభ్యర్థి ఓడిపోగా, ఆమె భర్త ఓటర్లతో ప్రమాణం చేయించడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని అడగడం వైరల్ అయింది.సాక్షి, మహబూబాబాద్: ‘మీరు నా వద్ద డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు వేయలేదు. దీంతో నేను ఓడిపోయాను. నిజంగా నాకు ఓటు వేసినవారు దేవుడి జెండాపై ప్రమాణం చేయండి. లేదంటే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి’అంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమ్లాతండా సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్న దళ్‌సింగ్ భార్య కౌసల్య పోటీ చేశారు. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో రెబల్ అభ్యర్థి సుజాత గెలిచారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌసల్య భర్త దళ్‌సింగ్ శుక్రవారం తండావాసుల ఆరాధ్య దైవమైన అమర్‌సింగ్ మహరాజ్ జెండా పట్టుకొని.. ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేసినట్టు ప్రమాణం చేయాలని. లేకపోతే.. నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తండాకు తాగునీటి సరఫరా అయ్యే ప్లాంట్ పైపులు పగులగొట్టడం, దేవుడి గుడికి తాళం వేసిన సన్నివేశాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తమ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఓటు వేయాలని డబ్బులిచ్చారని.. ఇప్పుడు దౌర్జన్యంగా రికవరీ చేస్తున్నారంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశారు.బాట బంద్ చేయించాడుధరూరు: గ్రామస్తులు తనకు ఓటు వేయలేదని...తన పొలం మీదుగా వెళ్లడానికి వీలు లేదంటూ ఓటమి పాలైన ఓ సర్పంచ్ అభ్యర్థి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని కోతులగిద్ద గ్రామానికి చెందిన బోయ రంగస్వామి సర్పంచ్ పోటీ చేశాడు. ఆయనతో కలిసి వార్డులకు పోటీచేసిన వారిలో కూడా ఒక్కరూ గెలవలేదు. దీనిని జీర్ణించుకోలేని రంగస్వామి శుక్రవారం తన పొలం పక్క నుంచి రైతుల పొలాలకు వెళ్లే బాటను బంద్ చేయించారు. దీంతో అటుగా నిత్యం రాకపోకలు సాగించే పలువురు రైతులు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని తరాలుగా తాము అటుగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.మురికికాల్వలో బ్యాలెట్ పేపర్లు చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లు మురికికాల్వలో కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఆవుల సుందరయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేయగా సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ మద్దతుదారు రుద్రారపు బిక్షంపై 455 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయితే, శుక్రవారం పోలింగ్ కేంద్రం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మురికికాల్వలో.. బీఆర్ఎస్ అభ్యర్థి బిక్షం ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పేపర్లను స్థానికులు గుర్తించారు. దీంతో కత్తెర గుర్తు బ్యాలెట్లను లెక్కించకుండానే మురికి కాల్వలో వేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి రుద్రారపు బిక్షంతో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ý ంచర్ల భూపాల్‌రెడ్డిలు చిన్నకాపర్తి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ లభ్యమైన బ్యాలెట్ పేపర్లను వారు పరిశీలించారు. అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు. నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి జయలక్ష్మితో మాట్లాడి జరిగిన సంఘటనపై వివరాలను సేకరించారు. మురికి కాల్వలో లభ్యమైన బ్యాలెట్ పేపర్లను ఆర్డీఓ అశోక్‌రెడ్డి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటన లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. విచారణ అధికారిగా నల్లగొండ ఆర్డీఓను నియమించామని తెలిపారు. పెదవీడు సర్పంచ్ బరిలో 18 మంది బ్యాలెట్ పేపర్‌పై మూడు వరుసల్లో గుర్తులుమఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు పంచాయతీ సర్పంచ్ స్థానానికి 18 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్యాలెట్ పేపరులో మొదటి వరుసలో 8 గుర్తులు, రెండో వరుసలో 8 గుర్తులు, మూడో వరుసలో ఇద్దరు అభ్యర్థుల గుర్తులతోపాటు నోటా గుర్తు ముద్రించారు. ఓటు కోసంపంచాయతీ ఎన్నికల వేళ దశాబ్దల తర బడి పరిష్కారానికి నోచుకోని బాట సమస్యకు లైన్ క్లియర్ అయింది. మరోవైపు ఓట్ల కోసం ఓ వార్డు అభ్యర్థి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైకి ఎక్కాడు. ఓట్ల కోసం గుట్ట ఎక్కిన మొదటి వ్యక్తి వినోద్ కావడం గమనార్హం.‘పంచాయతీ’తో పరిష్కారం » పోలింగ్‌కు ముందే రోడ్డు నిర్మాణం పూర్తి » నెరవేరిన హన్వాడ రైతుల దశాబ్దాల కలఇది మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ–బుద్ధారం నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి. దీని కోసం దాదాపు 100 కుటుంబాలకు చెందిన రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వారు చేయని ప్రయత్నం లేదు.. కలవని నేతలు లేరు. కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు.. ఇస్నాతి వంశస్తులకు సంబంధించిన పక్కా పట్టా స్థలం. అందులోనూ సాగులో ఉన్న భూమి. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ఆ అన్నదాతల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ఆ వంశానికి చెందిన సుధాకర్ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడడం ఆ రైతులకు వరమైంది. తమ పొలాలకు రహదారి వదిలితే వంద మంది రైతు కుటుంబాలు మీకు మద్దతుగా నిలుస్తాయని ప్రతిపాదించడం.. ఇన్నాళ్లూ అంగీకరించని సదరు యజమాని తమ దాయాదులతో మాట్లాడి ఒప్పించడం.. ఆ వెంటనే రైతులు సొంత డబ్బులతో కిలోమీటర్‌కు పైగా (సుమారు ఎకరా) మట్టి రోడ్డు వేయడం చకచకా జరిగింది. వెతుకుతున్న తీగ కాలుకు తగిలినట్టు సర్పంచ్ ఎన్నికలకు ముందే రైతుల సమస్య తీరింది. రోడ్డును ఆనుకునే 36 ఎకరాల్లో ఇస్నాతి వంశస్తుల వ్యవసాయ భూమి ఉండగా.. దానికి ఆనుకొని వెనుకవైపు 400 ఎకరాల వరకు పంటలు సాగవుతాయని రైతులు చెబుతున్నారు. ఇన్నాళ్లు రోడ్డు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరా భూమి రూ.50 లక్షలు పలుకుతోంది. హన్వాడలో రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. తనకు మద్దతుగా నిలవాలని సదరు సర్పంచ్ అభ్యర్థి వేడుకుంటున్నాడు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్సర్పంచ్గా గెలిపిస్తే.. పంచాయతీకి రూ.30 లక్షలు ఇస్తా మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోరుకంటి మధుసూదన్‌రావు తన సొంత డబ్బులు రూ.30లక్షలు వెచ్చిస్తున్నట్టు బాండ్ పేపర్ రాసివ్వడం చర్చనీయాంశమైంది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, తనను గెలిపిస్తే ప్రభుత్వ నిధులు వచ్చే వరకు ఎదురు చూడకుండా గ్రామాభివృద్ధికి రూ.30లక్షలు ఇస్తానని చెక్కుతో కూడిన బాండ్ పేపర్ జీపీకి రాసిచ్చాడు. రెండో విడతలో ఆదివారం ఇక్కడ పోలింగ్ జరగనుంది.20 కిలోమీటర్లు నడిచి.. ఓటు అభ్యర్థించి..పెనుగోలు గుట్టపైకెళ్లి ప్రచారం చేసిన వార్డు అభ్యర్థి వినోద్వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని పెనుగోలు గ్రామంగుట్టలపై ఉంటుంది. కొంగాలనుంచి మూడవ వార్డుకు పోటీ చేస్తున్న లేగల వినోద్.. పెనుగోలు గ్రామస్తుల ఓట్లు తన వార్డులో ఉండటంతో 20 కిలోమీటర్లు కాలి నడకన గుట్టలపైనున్న పెనుగోలుకు చేరుకున్నాడు. ఓటర్లను తనకు ఓటు వేయాలని కోరాడు. ఈ గ్రామానికి మూడవ విడత ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.సర్పంచ్‌గా గెలిపిస్తే ఎకరం భూమి ఇస్తాంబాండ్పేపర్పై అగ్రిమెంట్ రాసిచ్చిన ఇద్దరు అభ్యర్థులు భూదాన్‌పోచంపల్లి : సర్పంచ్‌గా గెలిపిస్తే కోటి రూపాయల విలువైన ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని సర్పంచ్ బరిలో దిగిన అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం చిన్న గ్రామపంచాయతీ. ఇక్కడ మొత్తం 546 ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వు అయ్యింది. పంచాయతీ పరిధిలో రసాయన పరిశ్రమలు ఉండటంతో సర్పంచ్ స్థానానికి తీవ్ర పోటీ ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుమ్మి జంగారెడ్డి, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గుమ్మి నరేందర్‌రెడ్డితోపాటు బీజేపీ నుంచి వస్పరి రాకేశ్ పోటీపడుతున్నారు. తమను సర్పంచ్‌గా గెలిపిస్తే కోటి రూపాయల విలువైన ఎకరం భూమి గుడి నిర్మాణం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని గుమ్మి జంగారెడ్డి, గుమ్మి నరేందర్‌రెడ్డిలు పోటాపోటీగా బాండ్‌పేపర్లపై అగ్రిమెంట్ రాసి ఇచ్చారు.నాలుగుసార్లు ఆ కుటుంబానికే సర్పంచ్ పదవిమెట్పల్లిరూరల్ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవి నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబానికి వరించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గూడూరు తిరుపతి ఎన్నికయ్యారు. తిరుపతి భార్య రజిని 2019లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి, గెలుపొందారు. తిరుపతి తండ్రి అప్పట్లో రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు.తమ్ముడి ఓటమి తట్టుకోలేక..అక్క మృతికథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ సర్పంచ్‌గా పోటీ చేసిన పోతు శేఖర్ ఓటమిపాలయ్యారు. శేఖర్ గెలవాలని కోరుట్లకు చెందిన అతడి అక్క కొక్కుల మమత(40) కొన్నిరోజులు ప్రచారం చేశారు. తమ్ముడు ఓటమి పాలయ్యాడని తెలియగానే గుండెపోటుకు గురైంది. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా శుక్రవారం మార్గమధ్యలోనే మమత మృతి చెందింది. ‘వార్డు’ అభ్యర్థి మృతిధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండలం ధర్మాపూర్ పంచాయతీలోని రెండోవార్డుకు సమ్మని రామయ్య(62) పోటీలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ తన వార్డులో ప్రచారం చేశారు. అనంతరం పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు. ఓడిపోయి.. సెల్‌టవర్ ఎక్కి రఘునాథపాలెం: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి రంగా శుక్రవారం ఉదయం సెల్‌టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్, రెవెన్యూ అధికారులు రంగాతో ఫోన్లో మాట్లాడి నచ్చచెప్పగా, మధ్యాహ్నం రెండు గంటలకు కిందకు దిగొచ్చాడు.గ్రీన్ మ్యాట్‌తో పోలింగ్ బూత్ బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలకు సరిపడా తరగతి గదులు లేవు. దీంతో అధికారులు గ్రీన్మ్యాట్లతో డేరాలు కట్టి పోలింగ్ బూత్‌లు మార్చారు. -
ఆల్ ఈజ్ వెల్.. పల్లె పోరు తొలి ఫలితాలపై ప్రధాన పార్టీల్లో సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ సమరం ముగిసింది. ఫలితాలు కూడా శుక్రవారం ఉదయం కల్లా పూర్తి స్థాయిలో వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలి విడత పోరుపై రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాల్లో అంతర్గత విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుపొందడంపై కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్లో పంచాయతీ ఫలితాలు జోష్‌ను నింపాయి. మరోవైపు బీజేపీ కూడా పల్లె పోరు ఫలితాలను సానుకూలంగా చూస్తుండటం గమనార్హం.ఎవరి లెక్కలు వారివే..అధికార పార్టీ విషయానికొస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నా..ప్రజాపాలనలోఅనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదన్న భావన అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పని చేయకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయా అన్న సందేహాలు కూడా నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సాధించిన స్థానాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం.. జిల్లాల వారీగా గులాబీ పార్టీ గట్టి పోటీనిచ్చిన ప్రాంతాల్లో ఓట్ల గణాంకాలను పరిశీలించే పనిలో పడింది. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కసరత్తు చేస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ఊపిరి పోశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నైరాశ్యంలో ఉన్న పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారని, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే ఒరవడి కొనసాగించే యోచనలో ఉన్నారు. బీజేపీ కూడా ఫలితాలపై అంతర్గత లెక్కలు వేస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీలో ఉన్న బలంతో పోలిస్తే పంచాయతీలు తక్కువగా వచ్చాయని, అయితే గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తమ బలం పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తంగా 500 కంటే ఎక్కువ పంచాయతీలు గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో రికార్డు సృష్టిస్తామని వారంటున్నారు. రెండంకెల స్థానాలు దక్కించుకోవడం ద్వారా గ్రామాల్లో తమ ఉనికి చాటుకున్నామని లెఫ్ట్ పార్టీలంటుండడం గమనార్హం. -
కేటీఆర్‌తో అఖిలేష్‌యాదవ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని.. కొన్నిసార్లు ప్రజలు ఆమోదిస్తారు.. తిరస్కరిస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల్లోనే ఉండాలని ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన ఆయన.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.నంది నగర్ నివాసానికి చేరుకున్న అఖిలేష్ యాదవ్‌కు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్‌తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో కేసీఆర్‌ను కలుస్తానన్నారు.కేటీఆర్ మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ తమకు స్ఫూర్తి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 37 ఎంపీ స్థానాలు సాధించారు. దేశంలో మూడో స్థానంలో పార్టీని నిలిపారని కేటీఆర్ అన్నారు. -
రెండేళ్ల పాలన ప్రజా రంజకమేనా?
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకు అభినందనలు. అయితే, ఈ రెండేళ్ల పాలన ప్రజలను సంతృప్తి పరిచిందా? అనేది ఇది చర్చనీయాంశం. ప్రభుత్వం ఏవైనా కొన్ని హామీలను నెరవేర్చడం మరికొన్నింటిలో విఫలం కావడం సహజం. కాగా, మొత్తమ్మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్న విషయంపై ఎవరి అంచనాలు వారివి. రేవంత్ ప్రభుత్వ పాలన రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అనే చందంగా ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. ఏదో చేయాలన్న తాపత్రయం, కొన్ని చేయలేక సతమతమవడం, ఆపైన బుకాయింపు, ప్రచారంతో జనాన్ని మాయ చేయాలన్న ప్రయత్నం కనిపిస్తాయి. కొన్ని విషయాలలో రేవంత్ గురువు చంద్రబాబు బాటలోనే అతిశయోక్తులు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్షీణించుకుపోయిన నేపథ్యంలో రేవంత్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌లో చేరారు. తదుపరి పీసీసీ అధ్యక్ష స్థాయికి ఎదిగి అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ విసరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. ఆ దూకుడే రేవంత్ కలిసివచ్చిందని చాలా మంది నమ్ముతారు. సీఎం అయిన తర్వాత కూడా అదే పంథా కొనసాగించాలని చూస్తున్నప్పటికీ అన్నిసార్లు కలిసి వస్తున్నట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో రేవంత్ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని, చట్టబద్దత తెస్తామని ప్రచారం చేశారు. అయితే, వీటిల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన వాటినేవీ పూర్తిగా నెరవేర్చినట్లు కనపడదు. రైతు రుణమాఫీ, కేసీఆర్ పథకం రైతుబంధు కొనసాగింపు, కౌలు రైతులకు వర్తింపు, ఎకరాకు రూ.15 వేలన్న హామీ, వ్యవసాయ కూలీలకు ప్రత్యేక పథకం, మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలకు పెంపు, విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలల హామీలేవీ అమలు కాలేదనే చెప్పాలి.తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణలు, కబ్జా వంటివాటికి దూరంగా ఉంచాలన్న ప్రయత్నం బాగానే ఉంది. హైడ్రా ద్వారా చెరువుల గర్భాలలో ఉన్న నిర్మాణాలను కూల్చారు. కానీ, ఈ సందర్భంలో పేద, మధ్యతరగతి వర్గాలకు తీరని నష్టం జరిగింది. వారు అప్పో, సప్పో చేసి కొనుగోలు చేసిన అపార్టుమెంట్లు, విల్లాలు తమ కళ్లెదుటే కూలిపోవడం చూసి తట్టుకోలేకపోయారు. అన్ని అనుమతులు ఉన్నాయన్న భావనతో వారు కొనుగోలు చేస్తే అవి చెరువు గర్భంలో ఉన్నాయంటూ హైడ్రా పలు చోట్ల కూల్చివేసింది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రాకుండా చూడాలన్న ఉద్దేశం మంచిదైనా ఆచరణలో గందరగోళం వల్ల ప్రభుత్వానికి ప్రజలలో చెడ్డ పేరు రావడానికి ఆస్కారం కలిగింది. అదే సమయంలో పరపతి, సంపన్నుల ఆక్రమణల జోలికి పెద్దగా వెళ్లలేదన్న విమర్శలు వచ్చాయి. కొన్నిచోట్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే నిర్మాణాలు కూల్చారు. హైదరాబాద్‌లో కొన్ని వేల కోట్ల ప్రభుత్వ భూములను రక్షించినట్లు హైడ్రా అధికారి రంగనాథ్ చెబుతున్నారు.మూసీ సుందరీకరణ స్కీమ్ అమలుకు హడావుడి చేశారు కానీ, అక్కడ నివసించే పేద వర్గాల నిరసన, రాజకీయ పక్షాల ఆందోళనల నేపథ్యంలో అది ముందుకు సాగడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గడానికి హైడ్రా యాక్టివిటీ కూడా కొంత కారణం అన్న భావన ఏర్పడింది. అయినా ఓవరాల్ ఎకానమీ వల్ల రియల్ ఎస్టేట్ కొంత తగ్గి ఉండవచ్చని, కానీ తిరిగి బాగానే పుంజుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగినట్లే కోకాపేట వైపు ఎకరా రూ.150 కోట్ల నుంచి రూ.175 కోట్ల వరకు వేలంలో అమ్ముడుపోవడం సంచలనంగా ఉంది. అయినా మధ్య తరగతి నుంచి ఇళ్లు, స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు పెరగనంత వరకు ఈ రంగం స్తబ్ధతగా ఉంటుంది.ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసం రేవంత్ ప్రభుత్వం భారీ ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపించారు. కానీ, ఎవరూ రాలేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాత్రం వచ్చి వెళ్లారు. పెట్టుబడుల ప్రతిపాదనలపై ఏపీలో మాదిరి అంకెల గారడీ మరీ ఎక్కువ చేసినట్లు అనిపించలేదు. పరిశ్రమల భూములను ఇతర అవసరాలకు వియోగించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. కేవలం రిజిస్టర్డ్ విలువలో 30 శాతానికే పరిశ్రమల వారికి ఆ భూములు ఇవ్వాలన్న ప్రతిపాదనతో లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నగరంలో కాలుష్యం సమస్య నివారించడానికి తమ ప్రయత్నమన్నది రేవంత్ వాదనగా ఉంది. ఈ స్కీమ్ అమలు వల్ల ప్రభుత్వానికి కొంత మేర నిధులు సమకూరవచ్చు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ రుణాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసేది. కానీ, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో ఉంది. గత ఆరు నెలల్లో నిర్దిష్ట రుణాలకన్నా 190 శాతం అధికంగా అప్పులు తీసుకున్నట్లు కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలలో కథనం వచ్చింది. ప్రభుత్వంలో అవినీతిపై కూడా పలు విమర్శలు ఉన్నాయి. కాళేశ్వరం, ఈ-ఫార్ములా రేస్ వ్యవహారాలలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు కానీ, ఎందువల్లో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చినా, తొలుత చూపిన శ్రద్ద ఇప్పుడు కనిపించకపోవడంతో జనం కూడా పెద్దగా రావడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో వీక్‌గా ఉండడం రేవంత్‌కు ప్లస్ పాయింట్‌గా ఉంది. దానికి తోడు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుని కాంగ్రెస్‌ను రేవంత్ గెలిపించారు. కాంగ్రెస్‌పై ప్రజలలో వ్యతిరేకత లేదని అనడానికి ఇది రుజువుగా తీసుకోరాదు. కాకపోతే తాత్కాలికంగా ఉపశమనంగా కనిపిస్తుంది. ఈ మూడేళ్లలో రేవంత్ జాగ్రత్తలు తీసుకుని ప్రజలలో ప్రభుత్వ ఇమేజీని పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో రేవంత్ ప్రకటనలు మరీ అతిగా ఉండకుండా ఉంటే మంచిది.ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణను తయారు చేస్తున్నామని, తెలంగాణ రైజింగ్ అన్ స్టాపబుల్ అని, అభివృద్ది కోసం ప్యూర్, క్యూర్, రేర్, దేశానికి తెలంగాణనే రోల్ మోడల్, ఢిల్లీకి నొయిడా-తెలంగాణకు కొడంగల్, అంతర్జాతీయ స్థాయికి లగచర్ల పారిశ్రామికవాడ, వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రపంచంలోనే టాప్.. ఇలాంటివి ఎన్నికల సమయంలో ఇచ్చే నినాదాలుగా కనిపిస్తాయి. కానీ, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఇవే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు ప్రశ్నలుగా ఎదురవుతాయి. రేవంత్ ఒక నిజం చెప్పారు. కాళ్లలో కట్టెలు పెట్టడం-రాజకీయాలలో గేమ్ రూల్ అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ ఆ వ్యూహాన్నే అమలు చేసి ఉండవచ్చు. ఇప్పుడు తనకు కూడా అదే సమస్య అవుతుందన్న అనుమానం ఉండవచ్చు. కాళ్లలో కట్టెలు పెట్టే అవకాశం లేకుండా చేసుకుని రేవంత్ ముందుకు వెళ్లగలుగుతారా? అన్నది కాలమే చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


