వీడ్కోలు ప్రసంగం.. మెస్సీ సంచలన వ్యాఖ్యలు! | Messi Sensational Comments-Farewell Speech-Warn-Argentina-Be-Careful | Sakshi
Sakshi News home page

వీడ్కోలు ప్రసంగం.. మెస్సీ సంచలన వ్యాఖ్యలు!

Oct 7 2026 12:41 PM | Updated on Oct 7 2026 12:53 PM

Messi Sensational Comments-Farewell Speech-Warn-Argentina-Be-Careful

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ బుధవారం తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. బెనిన్‌తో జరిగిన ఫేర్‌వెల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేయడంతో పాటు రెండు కీలక అసిస్ట్‌లు కూడా అందించాడు. 

మ్యాచ్ అనంతరం తనను చూసేందుకు వచ్చిన అభిమానులనుద్దేశించి సుదీర్ఘమైన వీడ్కోలు ప్రసంగం ఇచ్చాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనవుతూనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ గెలవడం మన దేశంలోనే కొందరికి ఇష్టం లేదని, ఇది రాబోయే తరానికి ఒక హెచ్చరిక లాంటిదని పేర్కొన్నాడు.


Photo Credit: Twitter

‘అర్జెంటీనా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అభిమానికీ ధన్యవాదాలు. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపించిన ప్రేమ, గౌరవం, మద్దతును జీవితాంతం నా హృదయంలో దాచుకుంటాను. నిజం చెప్పాలంటే.. నేను ఇంత ఎక్కువగా మాట్లాడటం ఇదే తొలిసారి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకోవడం లేదు. 

జీవితాంతం ఇక్కడే, ఈ జెర్సీతోనే మీ ముందు ఆడాలని ఉంది. కానీ కాలం ఎవరి కోసం ఆగదు. నా జీవితంలో నెరవేరాల్సిన కలలు పూర్తయ్యాయి. ప్రపంచకప్‌ గెలవాలన్న నా కల, మొత్తం దేశం కల నెరవేరింది. చివరి ప్రపంచకప్‌లో మేం ఛాంపియన్లుగా నిలవడానికి చాలా దగ్గరగా వెళ్లాం. దాని కోసం మా శక్తినంతా ఉపయోగించాం. నా సహచరులంతా చివరి వరకు పోరాడారు. కానీ విజయం దక్కలేదు. అయినప్పటికీ అర్జెంటీనా తరఫున ఆడిన ప్రతి మ్యాచ్ ప్రాణం పెట్టి ఆడాను’ వివరించాడు.

గెలవడం కొందరికి ఇష్టం లేదు
‘మీ మద్దతు లేకుండా  కల సాకారం అయ్యేది కాదేమో. ప్రపంచకప్‌ సహా ఏ టోర్నీలో ఆడినా మీరు మాకు అండగా నిలిచారు. అర్జెంటీనా తరఫున మైదానంలోకి దిగడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఇది నా జీవితంలో, నా కెరీర్‌లో అత్యంత బాధాకరమైన రోజు ఇదే. ఇదే నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో రేపటి నుంచి మిమ్మల్ని చాలా మిస్‌ అవుతా. 


Photo Credit: Twitter

కానీ మన జట్టు యువ ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా ఉంటా. మనం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాం. మనం ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. అత్యున్నత లక్ష్యాలను సాధించాలంటే మనం కలిసే ఉండాలి. ఈ జాతీయ జట్టు గెలవడం కొందరికి ఇష్టం లేదు. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే మనం మరింత ఐక్యంగా ఉండాలి. ఒక బలమైన సమూహం లేకపోతే ఏదైనా సాధించడం చాలా కష్టం. మా జట్టు ఎప్పుడూ ఒక కుటుంబంలా ఉంది. అందుకే ఇన్ని విజయాలు సాధించగలిగాం.

నేను ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకోవడం లేదు. ఈ మైదానాన్ని వదిలి వెళ్లాలని లేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతా. నేను ఎప్పటికీ అర్జెంటీనికు చెందిన వాడిగానే ఉంటాను. మీ అందరితో కలిసి నా కలను నెరవేర్చుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది’ అంటూ మెస్సీ తన ప్రసంగాన్ని ముగించాడు.


Photo Credit: Twitter

వెక్కి ఏడ్చిన మెస్సీ కుటుంబం..
కాగా మెస్సీ వీడ్కోలు మ్యాచ్‌కు అతడి కుటుంబం తరలివచ్చింది. మెస్సీ భార్య అంటోనెలా రోకుజ్జో, పిల్లలు వాళ్ల‌కు కేటాయించిన ప్ర‌త్యేక స్టాండ్ నుంచి వీక్షించారు. మెస్సీ గోల్ కొట్టిన సంద‌ర్భంలో కుటుంబం మొత్తం ఎగిరి గంతేశారు. ఇక మెస్సీ ప్ర‌సంగం స‌మ‌యంలో భార్య అంటోనెలా స‌హా పిల్ల‌లు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.

ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్క‌లోని.. మెస్సీతో క‌లిసి జాతీయ గీతం పాడుతూ ఎమోష‌న‌ల‌వ్వ‌డం కెమెరాల‌కు చిక్కింది. మ్యాచ్ ముగిసిన క్ష‌ణంలోనూ మెస్సీ.. ఉబికి వ‌స్తున్న కన్నీళ్ల‌ను ఆపుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా స‌హ‌చ‌రులు అత‌డిని ఓదార్చ‌డం స్టాండ్స్‌లోని అభిమానుల‌ను కంట‌త‌డి పెట్టేలా చేసింది.

ఇదీ చదవండి: ఫేర్‌వెల్ మ్యాచ్‌.. వెక్కివెక్కి ఏడ్చిన మెస్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement