ICC: శుబ్‌మన్‌ గిల్‌కు జరిమానా?!.. కారణం? | Can Shubman Gill Be fined For Act on Ind vs Eng 1st Test Day 1 Reaon | Sakshi
Sakshi News home page

ICC: శుబ్‌మన్‌ గిల్‌కు జరిమానా?!.. కారణం?

Jun 21 2025 3:24 PM | Updated on Jun 21 2025 3:56 PM

Can Shubman Gill Be fined For Act on Ind vs Eng 1st Test Day 1 Reaon

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణంలో తొలి ప్రయత్నంలోనే శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా శతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు. తద్వారా టెస్టు సారథిగా అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు.

అజేయ శతకం
లీడ్స్‌ వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో.. విరాట్‌ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన నాలుగో స్థానంలో గిల్‌ బ్యాటింగ్‌కు దిగాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 175 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 127 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటికి పదహారు ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి.

ఇక మరో సెంచరీ వీరుడు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (101)తో కలిసి 129 పరుగులు జోడించిన గిల్‌.. వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌తో కలిసి 138 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో టీమిండియా 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. గిల్‌ 127, పంత్‌ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 చిక్కుల్లో పడే అవకాశం
కాగా ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో భారత జట్టు ప్రదర్శన పట్ల సచిన్‌ టెండుల్కర్‌ వంటి దిగ్గజాలు హర్షం వ్యక్తం చేశారు. గిల్‌ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌ను కొనియాడుతున్నారు. అంతాబాగానే ఉన్నా గిల్‌ చేసిన ఓ పని వల్ల అతడు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతడు నలుపు రంగు సాక్సులు వేసుకున్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ప్లేయర్‌ క్లాతింగ్‌- ఎక్విప్‌మెంట్‌ నిబంధన (క్లాజ్‌ 19.45)ల ప్రకారం.. టెస్టు మ్యాచ్‌లో ఆటగాడు ధరించే సాక్సులు తెలుపు, గోధుమ లేదా లేత బూడిద రంగులో మాత్రమే ఉండాలి.

జరిమానా?
ఈ నేపథ్యంలో డ్రెస్‌ కోడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గిల్‌కు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంది. కాగా ఐసీసీలోని ఈ నిబంధనల ప్రకారం.. లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డట్లు తేలితే ఫైన్‌ తప్పదు. అయితే, గిల్‌ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని రిఫరీ భావిస్తే అతడు జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.

కాగా టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభమైంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. కేఎల్‌ రాహుల్‌ (42) ఓ మోస్తరుగా రాణించగా.. అరంగేట్ర బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇక జైసూ, గిల్‌ శతకాలతో చెలరేగగా.. పంత్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.

చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement