సాక్షి, సిద్దిపేట: జూబ్లీహిల్స్ రూపంలో మరో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్‌ఎస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేతలను ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌కు రప్పించుకున్నారు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌రావుతో పలువురు సీనియర్లతో శనివారం సాయంత్రం కేసీఆర్ భేటీ అయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై వీళ్లిద్దరితో కేసీఆర్ సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందని.. ఓటమికి గల కారణాలపై ఆయన వాళ్ల నుంచి ఆరా తీసినట్లు సమాచారం. అదే సమయంలో కేటీఆర్, హరీష్‌రావులపై ఆ పార్టీ మాజీ నేత, తనయ అయిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. భేటీలో ఈ వ్యాఖ్యలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఓటమితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా కేసీఆర్ వాళ్లతో చర్చించారు. వీళ్లద్దరితో పాటు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసిన మరికొందరు బీఆర్‌ఎస్ నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. మాగంటి గోపినాథ్ సతీమణి సునీత 25 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. అయితే రౌడీయిజంతో ఈ ఎన్నికలో గెలిచారని.. నైతిక విజయం తనదేనంటూ ఫలితాలు వెలువడ్డాక ఆమె మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరిగిందో ప్రజలు చూశారని, పోరాటాలు తమ పార్టీకి కొత్త కాదని.. ప్రతిపక్ష పాత్రను మరింత బలంగా పోషించి వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం కోసం కృషి చేస్తామని కేటీఆర్ ఫలితాల అనంతరం మీడియా ద్వారా తెలిపారు.


