ప్రభుత్వ కార్యాలయాల వేట
చేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ భవనాల్లో కార్యాలయాల ఏర్పాటు కోసం అధికారులు వేట ప్రారంభించారు. ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తుండటంతో.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా వ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు అయోమయంలో పడ్డారు. అద్దె భవనాలు ఖాళీ చేయక వాటిల్లోనే కార్యాలయాలు కొనసాగిస్తే అలాంటి భవనాలకు వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అద్దె చెల్లించడాన్ని నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాల అధికారులు ప్రభుత్వ భవనాల కోసం వేట మొదలు పెట్టారు.
ఈ చిత్రంలోని భవనం.. ఆర్టీఏ కార్యాలయం. జిల్లాల ఏర్పాటు అనంతరం చేర్యాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ప్రారంభం నుంచి ఇదే అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి ప్రతి నెలా రూ.వేలల్లో అద్దె చెల్లిస్తున్నారు.
వీటితో పాటు కొమురవెల్లి మండలంలో తహసీల్దార్, ఐకేపీ, దూల్మిట్ట మండల తహసీల్దార్, విద్యుత్ శాఖ, జిల్లా వ్యాప్తంగా పలు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటన్నింటికీ నెలకు రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్న ప్రభుత్వం వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి అద్దె చెల్లింపును నిలిపివేయనుంది. వీటి ఏర్పాటు కోసం ఏమేరకు ప్రభుత్వ కార్యాలయాలు దొరుకుతాయో వేచి చూడాల్సిందే.
నేటితో ముగియనున్న
అద్దె భవనాల గడువు
ఖాళీ చేయాలని
ఉన్నతాధికారుల ఉత్తర్వులు
అయోమయంలో అధికారులు


