రిజర్వాయర్లపై నిర్లక్ష్యం తగదు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా రిజర్వాయర్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఇది తగదని ఎమ్మెల్యే హరీశ్‌రావు.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల పరిధిలో కొత్త ఆయకట్టు భూసేకరణకు నిధులు విడుదల చేయాలని మంగళవారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. 2020 నుంచి 2023 వరకు ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తిచేసి జిల్లాలో సుమారు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించుకున్నామన్నారు. దీని ఫలితంగా పంట దిగుబడి సైతం భారీగా పెరిగిందని, కానీ 2023 తర్వాత ఈ రిజర్వాయర్ల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు కేటాయించడం లేదన్నారు. మైనర్, సబ్ మైనర్ కాలువల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాల్సి ఉందని ఈ విషయంపై మీకు పలుమార్లు లేఖల రూపంలో, ఫోన్ల ద్వారా, వ్యక్తిగతంగానూ కలిసి వివరించానని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం ప్రకారం ‘తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగు‘ అనే మీ మాట ఉత్తదేనా అని విమర్శించారు. తక్కువ ఖర్చు ఎక్కువ సాగు అనే పదం సిద్దిపేట జిల్లాలో సాధ్యమవుతుందని లేఖలో పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా అన్నపూర్ణ(అంతగిరి) రిజర్వాయర్ ప్యాకేజ్–10కి సంబంధించి రూ.15కోట్లు, రంగనాయకసాగర్ (ప్యాకేజీ–11)కు సంబంధించిన రూ.15 కోట్లు కేటాయించాలని, ఈ లేఖలో పేర్కొన్నారు. రూ.30కోట్లతో భూసేకరణ పూర్తయితే అదనంగా లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు పెరుగుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కొత్త ఆయకట్టు ముందు కు సాగడం లేదని, ప్రభుత్వ నిర్ణయం కోసం వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాలువల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టేందుకు రూ. 30 కోట్ల నిధులు మంజురు చేయాలని రైతు ల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని ఈ లేఖలో పేర్కొన్నారు.
కొత్త ఆయకట్టు భూసేకరణకు
రూ.30 కోట్లు కేటాయించాలి
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి
ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ


