ఉడకని కూర.. నీళ్ల చారు
● ప్రభుత్వ బడిలో ఇదీ మధ్యాహ్న భోజనం
● నాసిరకం కూరగాయలతో వంటలు
● కలెక్టర్ హెచ్చరించినా మారని తీరు
కొమురవెల్లి(సిద్దిపేట): సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడుతోంది. ఉడకని అన్నం, ఉడికీఉడకని కూర.. నీళ్ల చారుతో విద్యార్థులు సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సాక్షాత్తు కలెక్టర్ పలు మార్లు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని హెచ్చరిస్తున్నా నిర్వాహకుల తీరు మారడంలేదు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజనం తినలేక విద్యార్థులు పస్తులతో ఉంటున్నారు. పాఠశాలలో మొత్తం విద్యార్థులు 222 మంది ఉన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించకపోగా ఉడకని కూర, నీళ్ల చారు అందిస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. నాసిరకం కూరగాయలతో వంట చేయడంతో అనారోగ్యానికి గురవుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఇందేంటి అని విద్యార్థులు అడిగితే ‘మీ ఇష్టం ఉంటే తినండి.. లేదంటే ఊరుకోండి’ అని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి వంట చేసే నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
పురుగులు పట్టిన కూరగాయలతో..
పురుగులు పట్టిన కూరగాయలతో వంట చేస్తున్నారు. దానికి తోడు కూర ఉడకక ముందే వడ్డిస్తున్నారు. దీంతో అరగడం లేదు. చాలా మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. – పి.రక్షిత, టెన్త్ విద్యార్థిని
అడిగితే బెదిరిస్తున్నారు
కూరలు రుచిగా లేవని అడిగితే.. మీ ఇష్టం ఉంటే తినండి లేదంటే ఇంటినుంచి బాక్స్ తెచ్చుకోండి అంటూ బెదిరిస్తున్నారు. చాలా మంది ఇంటి నుంచే టిఫిన్ బాక్సు తెచ్చుకుంటున్నాం. – దుర్గ ప్రసాద్, టెన్త్ విద్యార్థి
చర్యలు తీసుకుంటాం
ఎంఈఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. కొమురవెల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నాసిరకంగా వంట చేస్తున్నట్లు నాదృష్టికి వచ్చింది. విచారణ జరిపి వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం. – రవి, ఎంఈఓ
ఉడకని కూర.. నీళ్ల చారు


