న్యూ జోష్‌కు రెడీ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నూతన సంవత్సరాన్ని న్యూ జోష్‌తో ప్రారంభించేందుకు యువత రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2025 సంవత్సర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా యువత తమ మిత్రులతో కలసి బుధవారం రాత్రి వేడుకలు చేసుకునేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందుకు అనుగుణంగా జిల్లాలోని బేకరీలు, హోటళ్ల నిర్వాహకులు వివిధ రకాలైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. బేకరీల వద్ద విద్యుత్ అలంకరణలు ఆఫర్ బోర్డులతో ఆకర్షిస్తున్నాయి.
ఉపాధ్యాయుడు
దుర్గయ్యకు అవార్డు
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులలో సాహిత్యాభిలాషను పెంపొందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు భైతి దుర్గయ్యకు తోట ఫౌండేషన్ హైదరాబాద్ వారు మంగళవారం అవార్డుతో పాటు రూ.5 వేల నగదు అందజేశారు. మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాల టీచర్ దుర్గయ్య అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ, విద్యార్థులలో సాహిత్యం పెంపొందిస్తున్నారు. అందుకు గాను అవార్డును బహూకరించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు శ్రావణ్, నిరంజన్‌లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయులు ఉన్నారు.
వార్డుల సంఖ్య పెంచండి
● ప్రభుత్వంతో మాట్లాడండి
● వేం నరేందర్‌రెడ్డికి నర్సారెడ్డి వినతి
గజ్వేల్: మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెంచాలని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ విలీనమై ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 20వార్డులకు మరో 15 వార్డులను పెంచడానికి ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ప్రస్తుతం పాత వార్డుల్లోనే నిర్వాసిత కాలనీ ఓట్లను విలీనం చేయడం వల్ల ఒక్కో వార్డులో 2,300–2,500వరకు ఓటర్ల సంఖ్య పెరిగి పరిపాలనకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించేలా చూడాలని కోరారు.
సేంద్రియం వైపు
మొగ్గు చూపాలి
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సువర్ణ
మరూక్(గజ్వేల్): రైతులు సమీకృత, సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపి అధిక లాభాలు గడించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సువర్ణ సూచించారు. మర్కూక్ రైతుల వేదికలో మంగళవారం వర్షాధారిత ప్రాంత అభివృద్ధి పథకంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పామాయిల్ పంట వేయడంతో 30 ఏళ్ల పాటు దిగుబడి పొంది అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ పంట వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. ఈ పథకంలో భాగంగా రైతులకు ప్లాస్టిక్ బుట్టలు, వార్మీబెడ్స్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాము, ఉద్యాన శాఖ అధికారి సౌమ్య, మౌనిక, సుబ్బారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
న్యూ జోష్‌కు రెడీ
న్యూ జోష్‌కు రెడీ


