ప్చ్‌.. మూడు నెలలైనా గడవకముందే! | Potholes Surface on PM Modi Inaugurated 12000 Crore Expressway | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. మూడు నెలలైనా గడవకముందే!

Jul 2 2026 1:27 PM | Updated on Jul 2 2026 1:58 PM

Potholes Surface on PM Modi Inaugurated 12000 Crore Expressway

న్యూఢిల్లీ: ఐదేళ్ల పాటు శ్రమించి నిర్మించారు. రూ.12 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎక్స్‌ప్రెస్‌వేను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. అయితే ప్రారంభమై మూడు నెలలు కూడా పూర్తికాకముందే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

212 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ–డెహ్రాడూన్ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోదీ ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి కేవలం రెండు గంటలకు తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఐదేళ్ల పాటు నిర్మాణం సాగిన ఈ ప్రాజెక్టు ప్రారంభమైన కేవలం 79 రోజుల్లోనే రోడ్డుపై భారీ గుంతలు కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

వైరల్ వీడియోలో ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు పెద్ద గుంతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి కారణంగా తన కళ్ల ముందే నాలుగైదు వాహనాలు అదుపు తప్పాయని, కనీసం రెండు కార్ల అల్లాయ్ వీల్స్ దెబ్బతిన్నాయని వీడియో తీసిన వాహనదారుడు పేర్కొన్నాడు. అనంతరం దెబ్బతిన్న చక్రాలను కూడా వీడియోలో చూపించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటు.. ప్రతిపక్ష కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.

ఐదేళ్లపాటు నిర్మించి, తొలి వర్షాకాలం కూడా పూర్తికాకముందే రోడ్డు పరిస్థితి ఇలా మారడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టోల్ రూపంలో రూ.650 వసూలు చేస్తూ, ప్రయాణికుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయంగా ఎత్తుకుంది. ఇంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో మూడు నెలల్లోనే గుంతలు పడటం నిర్మాణ నాణ్యతలో లోపాలకు, నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement