భోపాల్: డబ్బు కోసం ఏదైనా చేసే స్థాయికి కొందరు దిగజారుతున్నారు. అత్యాశ, తప్పుడు ఆలోచనలు ఓ బాలుడి ప్రాణాలను బలిగొన్నాయి. భోపాల్‌లో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. హత్య వెనుక బయటపడిన కారణం మరింత షాకింగ్‌గా మారింది.
భోపాల్‌లో ఓ మైనర్ బాలుడి హత్య కేసులో ముగ్గురు మైనర్లు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు భయంకర నిజాలు తెలిశాయి. ఆగస్టు 10న ఛోటా తాలాబ్ సమీపంలో బాలుడి మృతదేహం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తు‍్నారు. పోస్టుమార్టంలో.. కత్తితో పొడిచిన గాయాలు బయటపడ్డాయి.
దర్యాప్తులో, నిందితుల్లో ఒకరైన జోహెబ్ ఖాన్ (20) మానవ శరీర భాగాలను విక్రయిస్తే భారీగా డబ్బు సంపాదించవచ్చని ఇతరులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఒక మైనర్‌కు వీడియో చూపించి ఈ విషయాన్ని మరింత నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత ముగ్గురు మైనర్లు, మరో వ్యక్తి కలిసి బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం జోహెబ్ సూచనలతో బాలుడి మర్మాంగాలను తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని కొన్ని రోజులు తమ వద్ద ఉంచుకున్నా, విక్రయించేందుకు మార్గం దొరకక చివరకు పడేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా, వారిలో ముగ్గురూ మైనర్లే కావడం గమనార్హం. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. మొత్తం కుట్రకు జోహెబ్ ఖాన్ ప్రధానంగా పథకం వేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.


