మెట్రో సేవల్లో అంతరాయం.. చుక్కలు చూసిన ప్రయాణికులు! | Metro Chaos: Techies Hitch Truck Rides After Service Disruption | Sakshi
Sakshi News home page

మెట్రో సేవల్లో అంతరాయం.. చుక్కలు చూసిన ప్రయాణికులు!

Jun 24 2026 12:29 PM | Updated on Jun 24 2026 12:35 PM

Metro Chaos: Techies Hitch Truck Rides After Service Disruption

సిలికాన్‌ సిటీగా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఊహించని దృశ్యాలు కనిపించాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. కొందరు గంటల తరబడి స్టేషన్లలో చిక్కుకుపోగా.. మరికొందరు ఇంటికి చేరుకునేందుకు లారీలు, ట్రక్కులెక్కాల్సి వచ్చింది. దీనికి కారణం నగర మెట్రో వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే.

బెంగళూరు నమ్మ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండేది పర్పుల్‌ లైన్‌. అయితే మంగళవారం సాయంత్రం ఈ లైన్‌లోని కబ్బన్‌ పార్క్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఓ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ బిజీ లైన్‌లో రైళ్ల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైట్‌ఫీల్డ్‌తో పాటు నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించే ఈ మార్గంలో సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

స్టేషన్లలో భారీ రద్దీ
మెట్రో అధికారులు కొన్ని రైళ్లలోని ప్రయాణికులను మధ్యలోనే దింపేయడంతో ఒక్కసారిగా స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్న ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా కోసం రోడ్లపైకి రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కూడా స్తంభించింది.  క్యాబ్‌లు, ఆటోలకు ఒక్కసారిగా భారీ డిమాండ్‌ పెరగడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి.

లారీలు, ట్రక్కులెక్కిన టెక్కీలు
ఈ గందరగోళంలో ఇంటికి వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు లారీలు, ట్రక్కులు ఎక్కి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన నగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

థర్డ్‌ వరల్డ్‌ గవర్నెన్స్‌..
ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య Tejasvi Surya.. కాంగ్రెస్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. “ఫస్ట్‌ వరల్డ్‌ టెక్‌ టాలెంట్‌.. థర్డ్‌ వరల్డ్‌ గవర్నెన్స్‌.. ఇదే బెంగళూరి కథ” అంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించారు. మెట్రో సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన విమర్శించారు.

రాత్రంతా మరమ్మతులు
లోపాన్ని గుర్తించిన మెట్రో సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఎంజీ రోడ్‌ నుంచి వైట్‌ఫీల్డ్‌ మధ్య పరిమిత సేవలను పునరుద్ధరించినప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గలేదు. రాత్రంతా కొనసాగిన మరమ్మతుల తర్వాత.. బుధవారం ఉదయం 5 గంటల నాటికి సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం పర్పుల్‌ లైన్‌లో సాధారణ సేవలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement