అభిప్రాయం
ప్రపంచం దృష్టి ఇరాన్, లెబనాన్ వైపు; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ పూట ఏమంటారనే దానిపై కేంద్రీకరించి ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మాత్రం తమ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పథకాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉన్నారు. ఆ చర్యలన్నీ తమ దీర్ఘకాలిక పశ్చిమాసియా వ్యూహానికి అనుగుణమై నవే అయినందున అమెరికా ఆ విషయమై ఏమీ మాట్లాడటం లేదు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా చొరవతో 2025 అక్టోబర్‌లో జరిగింది. ఆ మేరకు కాల్పుల విరమణ అయితే అమలుకు వచ్చిందిగానీ, ఇజ్రాయెలీ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకోలేదు. కొన్ని జోన్లకు పరిమితమై కొనసాగుతుందనీ, ఒప్పందంలోని ఆ యా అంశాలు అమలైనకొద్దీ క్రమంగా ఉపసంహరించుకుంటుందనే మాట ఆ పత్రంలో ఉన్నందున ఆ ప్రకారం అంతా జరుగుతుందనీ భావించారు. కానీ అటు వంటి ఉద్దేశాలు ఇజ్రాయెల్‌కు గానీ, అమెరికాకు గానీ లేవని త్వరలోనే స్పష్టం కాసాగింది.
70 శాతం భూమి పోతుందా?
ట్రంప్ తను అట్టహాసంగా ప్రకటించిన 20 అంశాల ‘శాంతి పథకం’వైపుగానీ, నియమించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ వైపుగానీ కన్నెత్తి చూడలేదు. మధ్యవర్తులు, బోర్డు సభ్యులు అయిన దేశాలు అదేమి టని అడగలేదు. ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం గాజా, వెస్ట్ బ్యాంక్ లను మించిన ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అయినందున వారికి ఈ పరిస్థితి కలిసి వచ్చింది. గాజాలో ఉత్తరం నుంచి దక్షిణానికి గీసిన కాల్పుల విరమణ రేఖను ఉల్లంఘిస్తూ కొత్త ఆక్రమణలు మొదలు పెట్టారు. హమాస్‌ను వ్యతిరేకించే పాలస్తీనియన్ వర్గాలను, నేరస్థులను ప్రోత్సహించి అక్కడి ప్రజలను పారదోలటం ఈ ఎనిమిది నెలలుగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది.
పోయిన నెల చివరిలో ఒక బహిరంగ కార్యక్రమంలో నెతన్యాహూ మాట్లాడుతూ, కాల్పుల విరమణ జరిగిన 2025 అక్టోబర్‌లో, గాజా భూభాగంలో 53 శాతం తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉండేదనీ, అది 2026 మే చివరిలో 60 శాతానికి చేరిందనీ, దానిని 70 శాతానికి తీసుకుపోవలసిందిగా తమ సైన్యానికి ఆదే శాలు జారీ చేశాననీ ప్రకటించారు. అనగా, కాల్పుల విరమణ నాటి నుంచి మరొక 17 శాతం భూభాగాన్ని; గాజాపై ఇజ్రాయెల్ దాడులు 2023 అక్టో బర్‌లో మొదలైనప్పటినుంచి 2026 అక్టోబర్ వచ్చేసరికి మూడేళ్లలో మొత్తం 70 శాతాన్ని కోల్పోతుందన్నమాట. అప్పుడు, మొత్తం 365 చ.కి.మీ.ల విస్తీర్ణంగల గాజాలో అక్కడి ప్రజలకు మిగిలేది 110 చ.కి.మీ.లు.
విషయం ఇంతటితో ముగియబోవటం లేదు. నెతన్యాహూ రక్షణ మంత్రి కట్జ్‌తో పాటు సైన్యాధికారులు, గాజాలోని పాలస్తీని యులందరూ అక్కడి నుంచి ‘స్వచ్ఛందంగా ఖాళీ చేసి’ వేరే దేశాలకు వెళ్లిపోవలసిందేనని హెచ్చరిస్తున్నారు. గాజాపై దాడులు మొదలైన కొత్తలో నెతన్యాహూ, ట్రంప్ చేసిన ప్రకటనలను బహుశా ఎవరూ మరిచి ఉండరు. అక్కడినుంచి స్థానికులను వెళ్లగొట్టి ‘అందమైన రిసార్టులు, వ్యాపార కేంద్రాలు’ నిర్మిస్తామన్నారు.
ఆగని సెటిల్‌మెంట్లు!
పాలస్తీనాలో మరొకవైపున గల వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలను చూస్తే ఇటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీటి గురించి అసలు వివాదమే లేదనీ, అదంతా తమ దేశంలో భాగమనీ ఇజ్రాయెల్ ఎన్నడో ప్రకటించింది. తమ రాజధాని టెల్ అవీవ్‌కు అదనంగా ఈస్ట్ జెరూసలేం ఉమ్మడి రాజధాని అన్నది. ఆ ప్రకటనలను ఐక్యరాజ్యసమితి తిరస్కరించగా, రాజధాని విషయాన్ని ట్రంప్ తన మొదటి హయాంలోనే అధికారికంగా గుర్తించారు. ఈ పరిస్థితుల మధ్య జరుగుతున్నది ఇజ్రాయెల్ సేనలు, యూదులు వెస్ట్ బ్యాంక్‌ను, ఈస్ట్ జెరూసలేం నగరాన్ని ఆక్రమించు కోవడం. ఈ పని కొంతకాలం క్రితమే మొదలు కాగా, నిరుటినుంచి వేగాన్ని అందుకున్నది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ నెల రెండవ వారంలో ఒక నివేదిక విడుదల చేస్తూ, వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై ‘జాతి నిర్మూలన’ కార్యక్రమం జరుగుతున్నట్లు హెచ్చరించింది.
యూదు సెటిలర్లు, ఇజ్రాయెలీ సైనికులు కలిసి ఆ పని చేస్తున్నారన్నది. అదే వారంలో అమెరికన్ వార్తా సంస్థ అసోసి యేటెడ్ ప్రెస్ (ఏపీ), బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ ఆ ప్రాంతాలలో పర్యటించి ఇవే విషయాలను ధ్రువీకరించి చెప్పాయి. అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు విరుద్ధమని ప్రపంచమంతా ఖండించినా లెక్క చేయని ఇజ్రాయెల్ ఇప్పటికే ఏడు లక్షల మంది యూదులను అక్కడ సెటిల్ చేసింది. వారి కాలనీల కోసం కొత్త బడ్జెట్‌లోనూ వందల మిలియన్ల డాలర్లు కేటాయించింది. కొత్త పరిణామం ఏమంటే, ట్రంప్ విన్యాసాల వైపు ప్రపంచం మళ్లి ఉండగా, ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ లక్ష్యాన్ని సాధించుకొనచూడటం.
ఎన్ని దేశాల్లోకి చొచ్చుకుపోతారు?
ఇంతకూ ‘గ్రేటర్’ పరిధి ఎంత? అది గాజా, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలకు పరిమితమైనది కాదంటే ఆశ్చర్యం కలగవచ్చు. యూదుల జియోనిస్టు సిద్ధాంతకర్తల ఒరిజినల్ సూత్రీకరణల ప్రకారం స్థూలంగా మధ్యధరా సముద్రం, పశ్చిమాన ఈజిప్టులోని నైలు నది, తూర్పున యూప్రటీస్ నది, దక్షిణాన పలు అరబ్ భూభాగాల మధ్య ప్రాంతమంతా ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అవుతుంది. అందులోకి ప్రస్తుత ఇజ్రాయెల్, గాజా, వెస్ట్ బ్యాంక్, మొత్తం జోర్డాన్, మొత్తం లెబనాన్, సిరియా, ఇరాక్‌లతో పాటు సౌదీ భూభాగాలు అనేకం వస్తాయి. ఇటువంటి పటాన్ని నిరుడు తమ దేశంలో స్వయంగా ఎత్తిచూపిన నెతన్యాహూ, ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆలోచనకు తాను బలంగా కట్టుబడి ఉన్నాననీ, ఆ ‘చారిత్రకమైన స్పిరిచ్యువల్ మిషన్‌లో తనను తాను ఒక భాగంగా భావిస్తా’ననీ ప్రకటించటం గమనించదగ్గది.
ఇంత విస్తారమైన ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అసాధ్యమేగానీ, అదే సమయంలో అర్థం చేసుకోవలసినవి కొన్నున్నాయి. పాలస్తీనా విషయంలో జరుగుతున్నది ఎవరూ ఆపలేకపోతున్నారు. కనీసం వర్తమానంలో. అరబ్ పాలకులు మొక్కుబడిగా ఏమి మాట్లాడినా, ఈజిప్టు నాయకుడు అబ్దుల్ నాసర్ మరణం (1970) తర్వాత పాన్– అరబిజం బలహీనపడటం, అరబ్ నాయకులంతా ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఇజ్రాయెల్, అమెరికాలతో రాజీపడటం, ఇజ్రాయెల్ పథకానికి ఒక మేరకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. సిరియా నుంచి ఆక్రమించిన గోలన్ హైట్స్‌ను తమతో విలీనం చేసు కోవటం, జోర్డాన్, లెబనాన్ భాగాల ఆక్రమణలు, మరొకవైపు అమె రికా ఒత్తిడితో కొందరు అబ్రహామిక్ ఒప్పందాల పేర ఇజ్రాయెల్‌తో రాజీ పడటం వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇజ్రాయెల్ పథ కాన్ని రాజీ లేకుండా వ్యతిరేకిస్తున్న ఏకైక రాజ్యం ఇరాన్‌ను లొంగ దీసే ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. అటువంటి ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో అబ్రహామిక్ ఒప్పందం చేసుకుంటే సంతోషిస్తానన్న ట్రంప్ ఇటీవల అందరికీ వింత గొలపటం వేరే విషయం!
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


