సుప్రీం కోర్టులో కేటీఆర్‌ ‘ఫిరాయింపుల పిటిషన్‌’ వాయిదా | Telangana BRS MLAs Defection Case: SC Bench Hear KTR Petition Updates | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై న్యాయపోరాటం.. సుప్రీం కోర్టులో కేటీఆర్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

Feb 3 2025 10:49 AM | Updated on Feb 3 2025 11:27 AM

Telangana BRS MLAs Defection Case: SC Bench Hear KTR Petition Updates

న్యూఢిల్లీ,సాక్షి: తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు(KTR) వేసిన పిటిషన్‌ విచారణ వాయిదా పడింది.  గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం పేర్కొంది.

ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్‌ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్‌ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

బీఆర్‌ఎస్‌ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్‌ చేస్తున్నారు. 

మరో పిటిషన్‌లో.. 
ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ గవాయ్‌, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది.  ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్‌ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్‌ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్‌ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్‌ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్‌ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. 

అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్‌ అడిగి చెప్తానని లాయర్‌ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్‌ రెడ్డి ఎస్‌ఎల్‌పీ, కేటీఆర్‌ రిట్‌ పిటిషన్‌లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.

Advertisement
 
Advertisement
Advertisement