సూర్యాపేటటౌన్ : మహిళలు, బాలికలు, విద్యార్థినుల సమస్యలను పోలీసులతో పంచుకునేందుకు.. వారికి అండగా ఉండేందుకు పోలీస్‌శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆమెను ‘పోలీస్ అక్క’గా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ ప్రారంభించారు.
బాధితులకు అండగా..
మహిళల రక్షణ కోసం ఇప్పటికే షీ టీమ్స్, భరోసా సెంటర్లు, సఖీ కేంద్రాలు, పోక్సో చట్టం వంటివి అమలులో ఉన్నాయి. కానీ బాధితులు పోలీసులను నేరుగా సంప్రదించడంలో వెనుకంజ వేస్తున్నారు. అలా కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్‌లో స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం ప్రారంభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పోలీస్ స్టేషన్‌న్‌కు వచ్చే ప్రతి మహిళా ఫిర్యాదికి భరోసా కల్పించడంతో పాటు, వారి సమస్యలను విని చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఈ వ్యవస్థ దోహదపడనుంది. మహిళలు పోలీసులకు భయపడకుండా, కుటుంబ సభ్యురాలితో మాట్లాడినంత ఆత్మీయంగా తమ సమస్యలను వెల్లడించే వేదికగా పోలీసు అక్క నిలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
మహిళలకు అవగాహన
పోలీస్ అక్క తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, బాలికల హాస్టళ్లు, మహిళా సంఘాలను తరచూ సందర్శించి మహిళల రక్షణ చట్టాలు, షీ టీమ్స్ సేవలు, భరోసా కేంద్రాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థినులతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, నెలకు ఒక రోజు బాలికల హాస్టళ్లలో బస చేసి వారి భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
సామాజిక రుగ్మతలపై ఉక్కుపాదం
ఈ కార్యక్రమం ద్వారా ఆకతాయిల వేధింపులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, బాల్య వివాహాలు, లైంగిక వేధింపుల వంటి వాటిని ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ.. అవసరమైన కౌన్సెలింగ్‌తో పాటు చట్టపరమైన రక్షణ కల్పించనున్నారు. మహిళలు, బాలికలు తమకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇచ్చి పోలీసు సేవలు పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
మహిళా కానిస్టేబుల్‌కు ప్రత్యేక బాధ్యతలు
సూర్యాపేట జిల్లాలో
పోలీస్‌శాఖ వినూత్న కార్యక్రమం
పాఠశాలలు, కళాశాలలు,
హాస్టళ్లలో అవగాహన
వేధింపులు, ర్యాగింగ్,
బాల్య వివాహాల నివారణే లక్ష్యం


