సాగు భూముల్లో రక్తం చల్లి రైతుల నిరసన | - | Sakshi
Sakshi News home page

సాగు భూముల్లో రక్తం చల్లి రైతుల నిరసన

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

చివ్వెంల(సూర్యాపేట) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మండలంలోని సేవాలాల్‌ తండాలో మంగళవారం రైతులు వ్యవసాయ భూమిలో తమ రక్తం చల్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తంతో పంటలు పండించ వచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తమ రక్తాన్ని తీయించుకుని చేనులో చల్లుతున్నామని, మా రక్తతో పంటలు ఎలా పండుతాయో సీఎం చెప్పాలన్నారు. ఉన్నత హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం బాధాకరమన్నారు. సీఎం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని, సాగు నీరందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గుగులోతు కవిత అనిల్‌నాయక్‌, రైతులు గుగులోతు వెంకన్న, గుగులోతు పాశ్చ్యా, గుగులోతు లాలు, గుగులోతు మాన్‌సింగ్‌, గుగులోతు నర్సింహ, వీరమ్మ, బుజ్జి, మస్రూ పాల్గొన్నారు.

వెట్టి నుంచి ముగ్గురు బాలకార్మికులకు విముక్తి

కోదాడరూరల్‌ : ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా పోలీసులు మంగళవారం మండలంలోని చిమిర్యాల, నల్లబండగూడెం పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన ముగ్గురు బాల కార్మికులను గుర్తించి వారిని వెట్టి నుంచి విముక్తి కల్పించారు. పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రూరల్‌ ఎస్‌ఐ ఎస్‌కే. యాకూబ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల, బాలికలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

సీనియర్‌ కబడ్డీ

క్రీడాకారులకు ఆహ్వానం

సూర్యాపేటటౌన్‌ : కోదాడ కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కబడ్డీ ఖేలో ఇండియా సెంటర్‌లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సీనియర్‌ కబడ్డీ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకట్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన సీనియర్‌ కబడ్డీ క్రీడాకారులు తమ బయోడేటా, వివిధ స్థాయిలో వారు సాధించిన మెడల్స్‌, సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలతో ఈ నెల 22లోగా జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్‌: 9100949979 నంబర్లను సంప్రదించాలని కోరారు.

మెట్ట పంటల

విత్తనాలు అందించాలి

హుజూర్‌నగర్‌ : మెట్ట పంటలకు అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. వరికి ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.8 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హుజూర్‌నగర్‌ ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్‌డీఓ శ్రీనివాసులుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. దాంతో రైతులు వానకాలం పంటలు సాగు చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షుడు జక్కుల రమేష్‌, నాయకులు ఇందిరాల వెంకటేశ్వర్లు, దొంతగాని సత్యనారాయణ, ఎల్లావుల రమేష్‌, జడ వెంకన్న, వీరయ్య, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement