15 రోజులుగా మొరాయిస్తున్న సర్వర్
భానుపురి (సూర్యాపేట) : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లిన రైతులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. 15 రోజులుగా భూ భారతి సర్వర్ మొరాయిస్తున్నది. దాంతో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్లు పూర్తి కావడం లేదు. జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్లు గంటల తరబడి ఆలస్యం అవుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో నిలువ నీడ, తాగునీరు కరువవడంతో రైతులు చెట్ల కిందే పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
రోజుకు వందకు పైగానే రిజిస్ట్రేషన్లు..
గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే చేసేవారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వ్యవసాయేతర భూములను రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, వ్యవసాయ భూములను తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేలా మార్పులు చేశారు. ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ కార్యాలయంలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసి పాస్‌బుక్‌లు జారీచేస్తున్నారు. ఈ ప్రక్రియ మొదట్లో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి పూర్తి అయ్యేది. జిల్లాలోని 23 మండలాల్లో ఈ ప్రక్రియ సాగుతుండగా.. రోజుకు సరాసరి 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవి.
సర్వర్‌తో సమస్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ధరణి పోర్టర్ ఉన్న సమయంలో పలు చోట్ల అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిపై విచారణ చేస్తూ ఈ పోర్టల్‌లోకి వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు సేవల్లో అంతరాయం కలుగుతోంది. 15 రోజులుగా సర్వర్ సతాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
భూముల రిజిస్ట్రేషన్లకు గంటల
తరబడి పడిగాపులు
ఉదయం నుంచి సాయంత్రం
దాకా చెట్ల కిందే అన్నదాతల అవస్థలు
ప్రభుత్వ ఆదాయానికి గండి


