భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని, ప్రతి ఇంటికీ ఆరు మొక్కల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రకాల మొక్కలు అందించి ప్రజలు నాటి సంరక్షించేలా ప్రోత్సహించాలని సూచించారు. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీలు, అటవీశాఖ, వ్యవసాయ, నీటి పారుదల శాఖలు సమన్వయంతో ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, హౌసింగ్ పీడీ సిద్ధార్థ్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి తల్లి పేరుతో మొక్క నాటాలి
ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో మొక్కను నాటి, సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్, జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాయని తెలిపారు. జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, పరిశోధకులు, సాధారణ పౌరులు మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ తయారీ, పర్యావరణంపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని తమ ఫొటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా పోటీలో పాల్గొనవచ్చని వివరించారు.


