మాయమైన ప్లాట్లు..
కోదాడ: కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మకై ్క గ్రామ పంచాయతీ ప్లాట్లను స్వాహా చేశారు. సామాజిక అవసరాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ్మర పంచాయతీకి ఇచ్చిన విలువైన భూములను అమ్మి సొమ్ము చేసుకున్నారు. మొత్తం 43 ప్లాట్లకు చెందిన 10,100 గజాల స్థలాన్ని మాయం చేశారు. ఈ విషయాన్ని సమాచారహక్కు చట్టం ద్వారా వెలికితీసిన గ్రామస్తులు పదేళ్లుగా పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
అసలు విషయం ఇదే..
కోదాడకు సమీపంలో ఉన్న తమ్మర గ్రామ పంచాయతీ రెవెన్యూ భూములు విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉండడంతో మంచి డిమాండ్ ఉంది. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. 2005 నుంచి 2012 వరకు ఎనిమిది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామ పంచాయతీ పరిధిలోని 42 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని వెంచర్లుగా ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు రియల్ వ్యాపారులు సామాజిక అవసరాల కోసం గ్రామపంచాయతీకి 10 శాతం భూమిని ఇచ్చారు. దీని కింద మొత్తం 43 ప్లాట్లు వచ్చాయి. వీటి విస్తీర్ణం 10,100 చదరపు గజాలుగా రికార్డులలో అధికారులు నమోదు చేశారు.
గ్రామస్తుల ఫిర్యాదు
తమ్మర పంచాయతీలో సర్పంచ్‌లుగా, కార్యదర్శులుగా పనిచేసిన వారు పంచాయతీకి వచ్చిన ప్లాట్లను గుట్టచప్పుడు కాకుండా అమ్మేశారు. గ్రామ పంచాయతీ 2011లో కోదాడ మున్సిపాలిటీలో కలిసింది. ఆ సమయంలో గ్రామ పంచాయతీకి వచ్చిన భూములకు సంబంధించిన రికార్డులను అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మాయం చేశారు. దాంతో తమ్మర గ్రామానికి చెందిన కొందరు సమాచార హక్కు చట్టం కింద లే అవుట్ మ్యాప్‌లను సేకరించారు. కాగితాల మీద ఉన్న ప్లాట్లు క్షేత్ర స్థాయిలో లేకపోవడంతో గ్రామానికి చెందిన పలువురు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఈ విషయమై కనీస విచారణ చేపట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీ అధికారులు కూడా ఈ ప్లాట్ల విషయం తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు.
గతంలో పోలీసు కేసు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీలలో జరిగిన లేఅవుట్ భూముల అమ్మకాలపై అప్పటి జిల్లా కలెక్టర్ రిజ్వీ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయించారు. తమ్మర గ్రామ పంచాయతీలో కూడా భారీగా అవకతవకలు జరిగనట్లు కమిటీ నిర్ధారించింది. ఈ విషయమై కోదాడకు చెందిన సామాజిక కార్యకర్త పొడుగు హుస్సేన్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనంతగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ తరువాత దాని గురించి పట్టించుకున్న వారు లేకుండా పోయారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకొని వాటిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తమ్మర పంచాయతీలో రూ.20 కోట్ల ప్రభుత్వ స్థలాలు స్వాహా
10 వేల గజాల లేఅవుట్
భూమిని అమ్మేసిన ఘనులు
పదేళ్లుగా గ్రామస్తులు
పోరాడుతున్నా పట్టని అధికారులు


