నల్లగొండ (సూర్యాపేటటౌన్): విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేష్ సూచించారు. బుధవారం సూర్యాపేట మండలంలోని ఎంపీపీఎస్ టేకుమట్ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రత్నపురం ఎంపీయూపీఎస్‌ను ఆయన సందర్శించారు. టేకుమట్ల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పదో తరగతి విద్యార్థులు క్లిష్టమైన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రత్నపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగం అమలు తీరును పరిశీలించారు. కలెక్టరేట్‌లో ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన వెంట డీఈఓ కె.అశోక్, సెక్టోరియల్ అధికారులు హరికృష్ణ, శేషగాని శ్రీనివాసగౌడ్, శ్రవణ్ కుమార్, రేణుక సూర్యనారాయణ ఉన్నారు.
ఆయిల్ పామ్‌తో
నిరంతర ఆదాయం
నల్లగొండ (ఆత్మకూర్ (ఎస్)) : దీర్ఘకాల పంట అయిన ఆయిల్ పామ్ తోటలను సాగుచేసి ప్రతి నెలా ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తీగల నాగయ్య అన్నారు. బుధవారం మండలంలోని పాత సూర్యాపేట గ్రామంలో హఫీజ్ వ్యవసాయ క్షేత్రంలో మేఘ ప్లాంటేషన్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. తోట నాటిన నాలుగో సంవత్సరం నుంచే దిగుబడి ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్ర మంలో ప్రాంతీయ ఉద్యాన అధికారి కట్ట స్వాతి, జిల్లా మేనేజర్ అలీమ్, విస్తరణ అధి కారి యానాల సుధాకర్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ ఎన్.గోపి రైతులు పాల్గొన్నారు.
అక్రమ వెంచర్‌లో హద్దు రాళ్లు తొలగింపు
చిలుకూరు: మండల కేంద్రం శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్‌లోని హద్దు రాళ్లను బుధవారం గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది తొలగించారు. సోమవారం ‘సాక్షి’లో ‘గజాల్లో అమ్మకం.. గుంటల్లో రిజిస్ట్రేషన్’ శిర్షీకతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. డీటీసీపీ అనుమతి లేకుండా వెంచర్ ఏర్పాటు చేసి రాళ్లు పాతినట్లుగా గుర్తించారు. ఎంపీడీఓ ముక్కపాటి నరసింహారావు ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు వెంచర్‌లో ఏర్పాటు చేసిన రాళ్లను సిబ్బందితో తొలగింపజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, పంచాయతీ కార్యదర్శి షరీఫొద్దీన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నల్లగొండ పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
రామగిరి(నల్లగొండ) : నల్గొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.నరసింహారావు తెలిపారు. ఈ నెల 3వ తేదీ వరకు విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెకానికల్ ఇంజనీరింగ్ 26, సివిల్ 17, ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్ 11, కంప్యూటర్స్‌లో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.


