ఆడేద్దాం... ధనాధన్‌ | Womens T20 World Cup cricket tournament starts today | Sakshi
Sakshi News home page

ఆడేద్దాం... ధనాధన్‌

Jun 12 2026 5:38 AM | Updated on Jun 12 2026 5:38 AM

Womens T20 World Cup cricket tournament starts today

లండన్‌లో మహిళల టి20 వరల్డ్‌కప్‌ విన్నర్స్‌ ట్రోఫీతో 12 జట్ల కెప్టెన్‌లు

నేటి నుంచి మహిళల టి20 వరల్డ్‌కప్‌ క్రికెట్‌ టోర్నీ

బరిలో 12 జట్లు

శుక్రవారం తొలి పోరులో శ్రీలంకతో ఇంగ్లండ్‌ ‘ఢీ’

రాత్రి 11 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం

ఆదివారం భారత్, పాకిస్తాన్‌ పోరు

జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్‌  

ఒకవైపు క్రీడా లోకమంతా సాకర్‌ ఫీవర్‌లో మునిగి తేలుతుంటే... మరోవైపు ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌నకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లండ్‌ వేదికగా 24 రోజుల పాటు జరగనున్న మహిళల మహా సంగ్రామంలో 12 జట్లు ట్రోఫీ కోసం కొట్లాడనున్నాయి. గతేడాది వన్డే ప్రపంచకప్‌ చేజిక్కించుకొని జోరుమీదున్న టీమిండియా... టి20 ఫార్మాట్‌లోనూ విశ్వ విజేత అనిపించుకోవాలని తహతహలాడుతుంటే... గత రెండు పర్యాయాలు తుది మెట్టుపై బోల్తాపడ్డ దక్షిణాఫ్రికా ఈసారైనా కప్పును ఒడిసిపట్టాలని కృతనిశ్చయంతో ఉంది!

మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఆరుసార్లు టైటిల్‌ నెగ్గిన ఆ్రస్టేలియా ఏడో కప్పు ఖాతాలో వేసుకోవాలనుకుంటుంటే... డిఫెండింగ్‌ చాంపియన్‌ న్యూజిలాండ్‌ తమ పట్టు కొనసాగించాలని చూస్తోంది! సంచలన ప్రదర్శనతో రెండోసారి చాంపియన్‌గా నిలవాలని వెస్టిండీస్‌ భావిస్తుంటే... అప్పుడెప్పుడో ఈ ఫార్మాట్‌లో జరిగిన తొలి వరల్డ్‌కప్‌లో ట్రోఫీ నెగ్గిన ఇంగ్లండ్‌... ఇప్పుడు ఆతిథ్య హోదాలో రెండోసారి టైటిల్‌ హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది! మరెందుకు ఆలస్యం... అటు ‘ఫిఫా’ ప్రపంచకప్‌తో పాటు ఇటు... టి20 మెరుపులు చూసేందుకు సిద్ధమైపోదాం.     –సాక్షి, క్రీడావిభాగం

రెండేళ్లకోసారి జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్‌ మరోసారి సందడి చేసేందుకు మన ముందుకు వచ్చేసింది. తొలి ప్రపంచకప్‌ తర్వాత ఇప్పుడు పదో టోర్నీకి మరోసారి ఇంగ్లండ్‌ ఆతిథ్యమిస్తుండగా... 7 వేదికల్లో మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 12 జట్లు ట్రోఫీ కోసం అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటుండగా... వచ్చే నెల 5న విఖ్యాత లార్డ్స్‌ మైదానంలో విశ్వవిజేత ఎవరో తేలనుంది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది వరల్డ్‌కప్‌లలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా... తమ ఆధిపత్యం కనబర్చాలని చూస్తుంటే... ఇప్పటి వరకు ఒక్కోసారి ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్‌... రెండో టైటిల్‌ కోసం నిరీక్షిస్తున్నాయి. 

ఇక ఈ ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా వరల్డ్‌కప్‌ గెలవని భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవాలని భావిస్తున్నాయి. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా... పొట్టి ఫార్మాట్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)తో రాటుదేలిన భారత అమ్మాయిలు... విశ్వ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ... ప్రధాన టోర్నీలో దూకుడే మంత్రంగా ఆడుతామని హర్మన్‌ వెల్లడించింది. 

ఇక గత రెండు (2023, 2024) వరల్డ్‌కప్‌లలో ఫైనల్‌లో ఓడిన దక్షిణాఫ్రికా బలమైన బృందంతో బరిలోకి దిగనుంది. సొంతగడ్డ ఇంగ్లండ్‌కు అనుకూలం కానుండగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ న్యూజిలాండ్‌కు ఆల్‌రౌండర్ల బలగం దండిగా ఉంది. శుక్రవారం శ్రీలంక, ఇంగ్లండ్‌ మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుండగా... టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. 

ఎంపిక ఇలా... 
బంగ్లాదేశ్‌ ఆతిథ్యమిచ్చి న 2024 టి20 ప్రపంచకప్‌లో 10 జట్లు పాల్గొనగా... ఇప్పుడా సంఖ్యను 12కు పెంచారు. ఆతిథ్య హోదాలో ఇంగ్లండ్‌ నేరుగా వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించగా... 2024 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదు జట్లతో పాటు... ఐసీసీ మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ రెండు జట్లను కూడా నేరుగా మెగా టోర్నీకి ఎంపిక చేశారు. 

ఇక మిగిలిన నాలుగు జట్లను క్వాలిఫయర్‌ టోర్నీల ద్వారా నిర్ణయించారు. మొత్తం 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి జట్టు గ్రూప్‌లోని మిగిలిన ఐదు జట్లతో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో తలపడనుంది. గ్రూప్‌ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల్లో టాప్‌–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.  

ప్రైజ్‌మనీ ఎంతంటే... 
ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 8 లక్షల 76 వేల డాలర్లు (సుమారు రూ. 83 కోట్లు). విజేతకు 23 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు) లభించనుండగా... రన్నరప్‌ జట్టుకు 11 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) దక్కనున్నాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు 6 లక్షల డాలర్ల (రూ. 6 కోట్లు) చొప్పున లభించనున్నాయి.  

10 ఇది పదో మహిళల టి20 ప్రపంచకప్‌. 2009లో తొలిసారి ఇంగ్లండ్, వేల్స్‌ వేదికగా ఈ టోర్నమెంట్‌ జరగగా... మళ్లీ ఇప్పుడు పదో ఎడిషన్‌ వరల్డ్‌కప్‌నకు ఇంగ్లండ్‌ ఆతిథ్యమిస్తోంది. తొలి టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ ఆ తర్వాత ఎప్పుడూ ట్రోఫీని అందుకోలేదు.  

6  ఆ్రస్టేలియా గెలిచిన టి20 వరల్డ్‌కప్‌ ట్రోఫీలు. 2010, 2012, 2014, 2018, 2020, 2023లో ఆ్రస్టేలియా చాంపియన్‌గా నిలవగా... ఇంగ్లండ్‌ (2009), వెస్టిండీస్‌ (2016), న్యూజిలాండ్‌ (2024) ఒక్కోసారి ట్రోఫీ దక్కించుకున్నాయి. భారత్‌ అత్యుత్తమంగా 2020లో రన్నరప్‌గా నిలిచింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement