వైభవ్‌ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు! | Vaibhav Sooryavanshi Was Told To Go Home: What Happen SL A vs IND A Match | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!

Jun 16 2026 2:42 PM | Updated on Jun 16 2026 3:12 PM

Vaibhav Sooryavanshi Was Told To Go Home: What Happen SL A vs IND A Match

PC: X

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ జట్టు చిక్కుల్లో పడింది. ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడిన తిలక్‌ వర్మ సేన.. రెండింట ఓడిపోయింది. తొలుత అఫ్గనిస్తాన్‌ -‘ఎ’ చేతిలో ఓడిన భారత జట్టు.. సోమవారం నాటి పోరులో లంక చేతిలో పరాజయం పాలైంది.

దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు 265 పరుగులు చేయగా.. మ్యాచ్‌ టై అయింది. దీంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. భారత్‌ అనూహ్య రీతిలో ఓడిపోయింది. అయితే, వెలుతురులేమి కారణంగా తొలుత సూపర్‌ ఓవర్‌ నిర్వహించడం సాధ్యం కాదని అంతా భావించారు.

వెలుతురులేమి సమస్య
భారత జట్టు కెప్టెన్‌ తిలక్‌ వర్మ సైతం ఇదే విషయంపై అంపైర్లతో వాదించినట్లు సమాచారం. కానీ వెలుతురు మరీ తగ్గిపోతే సూపర్‌ ఓవర్‌ మొదలైనప్పటికీ మ్యాచ్‌ నిలిపివేస్తామని అంపైర్లు భారత శిబిరానికి చెప్పినట్లు క్రిక్‌బజ్‌ తన కథనంలో పేర్కొంది. అయితే, తొలుత శ్రీలంక బ్యాటింగ్‌ చేయగా.. భారత్‌ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో మరింతగా చీకటి అలుముకుంది.

కొట్టుకోవడం ఒక్కటే తక్కువ
అయినప్పటికీ సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. భారత జట్టు ఓటమిపాలైంది. ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ ముగిసిన తర్వాత భారత ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీతో శ్రీలంక ఆటగాళ్లు వ్యవహరించిన తీరు.. అందుకు వైభవ్‌ బదులిచ్చిన విధానం విమర్శలకు దారితీసింది.

వైభవ్‌ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!
వైభవ్‌- శ్రీలంక ఆటగాళ్లు పరస్పరం మీదమీదకు వెళ్తూ కొట్టుకున్నంత పనిచేశారు. అయితే, వారి మధ్య గొడవకు కారణం ఏమిటన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం.. శ్రీలంక ప్లేయర్‌ విశేన్‌ హలంబగే వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్‌ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు’’ అన్నట్లు సమాచారం.

దీంతో కోపోద్రిక్తుడైన వైభవ్‌.. ‘‘ఏమంటున్నావు’’ అంటూ మీదకు వెళ్లగా ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఆ తర్వాత లంక సీనియర్‌ ప్లేయర్‌ ఒకరు వచ్చి ఇద్దరినీ విడదీశారు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. అయితే, ఈ విషయం గురించి శ్రీలంక డ్రెసింగ్‌రూమ్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

క్షమాపణ అడుగుదాం!
చీకటి పడిన తర్వాత కూడా సూపర్‌ ఓవర్‌లో ఆడేందుకు సహకరించిన భారత జట్టుకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు.. వైభవ్‌ విషయంలో జరిగినదానికి క్షమాపణలు కోరాలనే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో భారత్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు సన్నగిల్లాయి.

చదవండి: 29 బంతుల్లోనే సెంచరీ చేసిన చహల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement