చహల్‌ విధ్వంసం.. 29 బంతుల్లోనే శతక్కొట్టాడు! | Yuzvendra Chahal Slams 29 ball 100 But With A Massive Twist | Sakshi
Sakshi News home page

చహల్‌ విధ్వంసం.. 29 బంతుల్లోనే శతక్కొట్టాడు!

Jun 15 2026 3:56 PM | Updated on Jun 15 2026 4:54 PM

Yuzvendra Chahal Slams 29 ball 100 But With A Massive Twist

టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ బ్యాట్‌తో ఇరగదీశాడు. కేవలం 29 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న ‘రికార్డు’ను బద్దలుకొట్టాడు.

ఇంతటి పవర్‌ హిట్టరా? 
చహల్‌ ఇంతటి పవర్‌ హిట్టరా? ఎప్పుడూ అతడి బ్యాటింగ్‌ చూడలేదే! అంటూ ఆశ్చర్యపోతున్నారా?!.. ఆగండాగండి.. చహల్‌ శతక్కొట్టింది.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ నిర్వహించే ఓ యూట్యూబ్‌ చాలెంజ్‌ షోలో!..

శ్రేయస్‌ అయ్యర్‌ 22 బంతుల్లోనే..
అవును.. పీటర్సన్‌ నిర్వహించే ఈ యూట్యూబ్‌ షోలో ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు, విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. డివిలియర్స్‌ 30 బంతుల్లో శతకం చేయగా.. టీమిండియా స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 22 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇక భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఇటీవల 25 బంతుల్లో శతక చాలెంజ్‌ను పూర్తి చేశాడు.

తాజాగా చహల్‌ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించాడు. యాభై బంతుల్లో సెంచరీ కొట్టాలని పీటర్సన్‌ సవాలు చేశాడు. ఇక తొలి బంతి గంటకు 51 మీటర్ల వేగంతో వస్తుందని.. అయితే, ఆ తర్వాత ప్రతీ బంతికి 1 మీటర్‌ వేగం మేర పెరుగుతుందని పీటర్సన్‌ షరతు విధించాడు. అంతేకాదు.. చహల్‌ కోసం బౌండరీని 40 మీటర్లకు కుదించాడు.

14 బంతుల్లోనే 50 పరుగులు
ఈ క్రమంలో మొదటి బంతికే సిక్సర్‌ బాదిన చహల్‌.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మధ్యలో చాలాసార్లు ఫీల్డర్లు అతడి క్యాచ్‌ జారవిడవడంతో లైఫ్‌ పొందిన చహల్‌.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో 14 బంతుల్లోనే 50 పరుగులు మార్కు అందుకున్నాడు చహల్‌.

29వ బంతికి సిక్సర్‌ బాది శతకం
ఆ తర్వాత కవర్స్‌ మీదుగా సిక్సర్‌ బాదే క్రమంలో చహల్‌ ఫీల్డర్‌కు దొరికిపోయాడు. అయితే, ఇందుకు ప్రతిగా అతడి స్కోరులో ఐదు పరుగుల కోత విధించిన పీటర్సన్‌.. తర్వాత ఆటను కొనసాగించాల్సిందిగా సూచించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో 90 పరుగులు పూర్తి చేసుకున్న చహల్‌.. 29వ బంతికి సిక్సర్‌ శతక మార్కు అందుకున్నాడు.

చహల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక పీటర్సన్‌ 50 బంతుల్లో సెంచరీ చేయాలనే షరతు విధించగా.. ఈ స్పిన్‌ బౌలర్‌ మరో 21 బంతులు మిగిలి ఉండగానే.. అంటే 29 బంతుల్లో శతక్కొట్టడం మరో విశేషం. 

చదవండి: IND vs SL: కొంప ముంచేశాడు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement