
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీమెంట్లో లీగ్ దశలో భారత్ చేతిలో పరాజయం పాలైన పాక్.. తాజాగా సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. అయితే, గత మ్యాచ్ కంటే ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన చేయగలిగింది.
ఈ నేపథ్యంలో టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) స్పందించాడు. తాము ఇంతవరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. అయితే, మెరుగ్గా ఆడామని పేర్కొన్నాడు. పవర్ ప్లేలో టీమిండియా మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని .. తాము ఇంకో 10- 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు.
171 పరుగులు
దుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) రాణించగా.. ఫఖర్ జమాన్ (9 బంతుల్లో 15) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ డకౌట్ల ‘స్టార్’ సయీబ్ ఆయుబ్ (17 బంతుల్లో 21) ఈసారి ఫర్వాలేదనిపించగా.. హుసేన్ తలట్ (10), మొహమ్మద్ నవాజ్ (21) తేలిపోయారు.
అభి- గిల్ రఫ్పాడించారు
కెప్టెన్ సల్మాన్ ఆఘా 17, ఫాహిమ్ ఆష్రఫ్ 20 బంతులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి పాక్ 171 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆకాశమే హద్దుగా చెలరేగారు.
పవర్ ప్లేలో విజృంభణతో తొలి వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అభి (Abhishek Sharma)- గిల్ (Shubman Gill) మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశారు. తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) కూడా వేగంగా ఆడగా.. 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పని పూర్తి చేసింది.
మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదు
ఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు మేము మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదు. అయితే, మెరుగ్గా ఆడామని చెప్పగలను. కానీ పవర్ ప్లేలోనే వారు మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఇంకో 10- 15 పరుగులు చేసి.. 180 వరకు స్కోరు బోర్డు మీద పెట్టి ఉంటే బాగుండేది.
పవర్ ప్లేలో వాళ్లు అద్భుతం
ఏదేమైనా పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మా జట్టులోనూ ఫఖర్, ఫర్హాన్ బాగా బ్యాటింగ్ చేశారు. హ్యారీ కూడా మెరుగ్గా ఆడాడు. తదుపరి శ్రీలంకతో మ్యాచ్‌లో సత్తా చాటుతాం’’ అని పేర్కొన్నాడు.
కాగా గతంలో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లలో సల్మాన్ బృందం మూడు మ్యాచ్‌లలోనూ 200కు పైగా స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విలేకరులు సల్మాన్ ఆఘా దగ్గర తాజాగా ప్రస్తావించారు.
ఇందుకు బదులిస్తూ.. ‘‘అక్కడికి .. ఇక్కడికి పరిస్థితులు వేరు. మాకు మంచి పిచ్ దొరికితే కచ్చితంగా 200కు పైగా స్కోరు చేస్తాము. కానీ ఈ పిచ్‌లు మాకు అంతగా సహకరించడం లేదు’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు.
చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య
Starting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙
Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025