మళ్లీ చితక్కొట్టి... | Indias another big win over Pakistan | Sakshi
Sakshi News home page

మళ్లీ చితక్కొట్టి...

Sep 22 2025 3:55 AM | Updated on Sep 22 2025 3:55 AM

Indias another big win over Pakistan

పాకిస్తాన్‌పై భారత్‌ మరో ఘన విజయం

6 వికెట్లతో గెలిచిన టీమిండియా 

చెలరేగిన అభిషేక్, గిల్‌

బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్‌ పోరు  

వారం రోజుల వ్యవధిలో వేదిక కూడా మారలేదు... భారత జట్టు మళ్లీ తమ స్థాయి ఏమిటో ప్రదర్శించింది... పాకిస్తాన్‌పై సంపూర్ణ ఆధిక్యం కనబరుస్తూ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది... ముందుగా చక్కటి బౌలింగ్‌తో సాధారణ స్కోరుకే పాక్‌ను పరిమితం చేసిన టీమిండియా... ఆ తర్వాత అలవోకగా గెలుపు తీరాన్ని చేరింది. అభిషేక్‌ శర్మ మెరుపు బ్యాటింగ్‌ భారత్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈసారి ‘షేక్‌హ్యాండ్‌’పై చర్చ జరగాల్సిన అవసరమే రాకుండా తమ ఆటతోనే ప్రత్యర్థికి పదునుగా జవాబిచ్చింది.   

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 టోర్నీ సూపర్‌–4 దశలో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (45 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించాడు. 

అనంతరం భారత్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు) చెలరేగి భారత్‌ విజయాన్ని సులువు చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 59 బంతుల్లోనే 105 పరుగులు జోడించడం విశేషం. సూపర్‌–4 దశలో తమ తర్వాతి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతుంది.  

ఫర్హాన్‌ అర్ధ సెంచరీ... 
భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి పాక్‌కు ఎంతో మెరుగైన ఆరంభం లభించింది. కానీ దానిని సది్వనియోగం చేసుకొని భారీ స్కోరు సాధించడంలో జట్టు విఫలమైంది. బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ఫఖర్‌ జమాన్‌ (15) ఎక్కువ సేపు నిలవకపోయినా, మరో ఓపెనర్‌ ఫర్హాన్‌ చక్కటి షాట్లు ఆడాడు. బుమ్రా వరుస రెండు ఓవర్లలో ఫర్హాన్‌ రెండేసి ఫోర్లు కొట్టడం విశేషం. 

పవర్‌ప్లేలో జట్టు 55 పరుగులు సాధించింది. ఆ తర్వాతా ధాటిని కొనసాగిస్తూ పాక్‌ బ్యాటర్లు ఒకదశలో 13 బంతుల వ్యవధిలో 4 సిక్సర్లు బాదారు. 10.2 ఓవర్లలో 93/1 స్కోరుతో పాక్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే సయీమ్‌ అయూబ్‌ (21) అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారత బౌలర్లు పట్టు బిగించడంతో పరుగులు చేయడానికి బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. 

వరుసగా 33 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు! ఐదు పరుగుల వ్యవధిలో హుస్సేన్‌ తలత్‌ (10), ఫర్హాన్‌ అవుట్‌ కాగా, మొహమ్మద్‌ నవాజ్‌ (19 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌)లో దూకుడు లోపించింది. 7–16 మధ్య 10 ఓవర్లలో పాక్‌ 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేసింది. అయితే చివరి 4 ఓవర్లలో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు సాధించి గౌరవప్రదంగా ముగించింది. ఫహీమ్‌ అష్రఫ్‌ (8 బంతుల్లో 20 నాటౌట్‌; 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు.  

మెరుపు బ్యాటింగ్‌... 
ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్, గిల్‌ ఒకరితో మరొకరు పోటీ పడుతూ చెలరేగిపోయారు. తొలి బంతికే సిక్సర్‌తో అభిషేక్‌ జోరు మొదలు పెట్టగా, తర్వాతి రెండు ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టి గిల్‌ తానేంటో చూపించాడు. అయూబ్‌ ఓవర్లో మరో మూడు ఫోర్లు వచ్చాయి. వీరిద్దరి దూకుడుతో భారత్‌ పవర్‌ప్లేలో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 పరుగులు రాబట్టింది. అబ్రార్‌ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన అభిషేక్‌ 24 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. 

ఎట్టకేలకు భారీ భాగస్వామ్యం తర్వాత 18 పరుగుల వ్యవధిలో గిల్, సూర్యకుమార్‌ (0), అభిషేక్‌ వెనుదిరిగారు. సామ్సన్‌ (13) కూడా తొందరగానే అవుటైనా... తిలక్‌ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (7 నాటౌట్‌) కలిసి మ్యాచ్‌ను ముగించారు.

గత మ్యాచ్‌ తరహాలోనే ఈ సారి కూడా ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌ సమయంలో కరచాలనం చేసుకోలేదు. తమ టీమ్‌ షీట్‌లను కూడా ఇద్దరూ రిఫరీ పైక్రాఫ్ట్‌కే అందించారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ఎలాంటి ‘షేక్‌ హ్యాండ్‌’లు లేకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.    

నాలుగు క్యాచ్‌లు నేలపాలు... 
భారత్‌ పేలవ ఫీల్డింగ్‌ కూడా పాక్‌ ఈ స్కోరు చేయడానికి కారణమైంది. అనూహ్యంగా మన ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేశారు. వీటిలో మూడు అతి సులువైనవి కాగా, ఒకటి కాస్త కష్టసాధ్యమైంది. అభిషేక్‌ శర్మ రెండు క్యాచ్‌లు (ఫర్హాన్‌ 0, 32 వద్ద), కుల్దీప్‌ (అయూబ్‌ 4 వద్ద), గిల్‌ (ఫహీమ్‌ 6 వద్ద) వదిలేయడం చూసి ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ తలపట్టుకున్నాడు! 

పాకిస్తాన్‌ మారదు! 
గత మ్యాచ్‌లో భారత జట్టు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకపోవడంతో పాటు యుద్ధం, సైనికుల ప్రస్తావన తీసుకొచ్చి క్రీడలతో రాజకీయాలు చేసిందని పాక్‌ వైపు నుంచి విమర్శలు వచ్చాయి. అయితే తాము మాత్రం అలాంటి రెచ్చగొట్టే పనులు, సైగలను తగ్గించుకోమని వారు చూపించారు. 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఫర్హాన్‌ బ్యాట్‌ను ఏకే–47 గన్‌ తరహాలో ఎక్కు పెట్టి పేలుస్తున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ సైగ వారి ఆలోచనాధోరణిని చూపించింది.  

స్కోరు వివరాలు
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫర్హాన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) దూబే 58; ఫఖర్‌ (సి) సామ్సన్‌ (బి) పాండ్యా 15; అయూబ్‌ (సి) అభిషేక్‌ (బి) దూబే 21; హుస్సేన్‌ (సి) వరుణ్‌ (బి) కుల్దీప్‌ 10; నవాజ్‌ (రనౌట్‌) 21; సల్మాన్‌ (నాటౌట్‌) 17; ఫహీమ్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171.  వికెట్ల పతనం: 1–21, 2–93, 3–110, 4–115, 5–149. బౌలింగ్‌: పాండ్యా 3–0–29–1, బుమ్రా 4–0–45–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–25–0, కుల్దీప్‌ యాదవ్‌ 4–0–31–1, అక్షర్‌ 1–0–8–0, శివమ్‌ దూబే 4–0–33–2.  

భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) రవూఫ్‌ (బి) అబ్రార్‌ 74; గిల్‌ (బి) ఫహీమ్‌ 47; సూర్యకుమార్‌ (సి) అబ్రార్‌ (బి) రవూఫ్‌ 0; తిలక్‌ (నాటౌట్‌) 30; సామ్సన్‌ (బి) రవూఫ్‌ 13; పాండ్యా (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–123, 4–148. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 3.5–0–40–0, అయూబ్‌ 3–0–35–0, అబ్రార్‌ 4–0–42–1, రవూఫ్‌ 4–0–26–2, ఫహీమ్‌ 4–0–31–1.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement