మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది చివరి కిక్ అందనుంది. దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో దాదాపుగా అందరూ టీమిండియా స్టార్లు పాల్గొంటున్నారు. ఏడాది చివర్లో భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు వీరంతా సిద్దంగా ఉన్నారు.
టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. రోహిత్ ముంబై జట్టులో, కోహ్లి ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరే కాక ప్రస్తుత టీమిండియా కెప్టెన్లు శుభ్‌మన్ గిల్ (పంజాబ్), సూర్యకుమార్ యాదవ్ (ముంబై) కూడా వారివారి జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.
ముంబై జట్టుకు రోహిత్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్ లాంటి టీమిండియా స్టార్లు ప్రాతినిథ్యం వహించనుండగా.. ఢిల్లీ జట్టులో కోహ్లితో పాటు రిషబ్ పంత్ (కెప్టెన్), హర్షిత్ రాణా, ఇషాంత్ శర్మ, నవ్‌దీప్ సైనీ లాంటి టీమిండియా ప్లేయర్లు, ప్రియాంశ్ ఆర్మ లాంటి ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.
ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ లాంటి టీమిండియా యువ కెరటాలు వారివారి జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. వీరిలో ఇషాన్ కిషన్ జార్ఖండ్‌కు, రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్రకు, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జట్టుకు సారధులుగా వ్యవహరించనున్నారు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ పంజాబ్ జట్టుకు ఆడనున్నారు.
వీరే కాక సంజూ శాంసన్ (కేరళ), మహ్మద్ షమీ (బెంగాల్), కేఎల్ రాహుల్ (కర్ణాటక), తిలక్ వర్మ (హైదరాబాద్) లాంటి టీమిండియా స్టార్లు కూడా విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండనున్నారు. అయితే జాతీయ విధుల దృష్ట్యా వీరు కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
జనవరి 11 నుంచి టీమిండియా న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లకు ఎంపికైన ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా తమతమ దేశవాలీ జట్లకు అందుబాటులో ఉంటారు.
టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే అన్ని మ్యాచ్‌లు.. లేకపోతే కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడాలని అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్‌ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.


