
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తీరును మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రీ (Karsan Ghavri) విమర్శించాడు. పటౌడీ ట్రోఫీని ఇంగ్లండ్ బోర్డు ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీగా మారిస్తే.. ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించాడు. ఒకవేళ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ పేరును మార్చి ఉంటే మాత్రం.. సునిల్ గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడని.. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉన్నాడని విమర్శలు చేశాడు.
కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు భారత దిగ్గజం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ గౌరవార్థం పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించగా.. దీనికి ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)గా నామకరణం చేశారు.
ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్, భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్‌ల పేరు మీదుగా ఇకపై ఈ సిరీస్‌ను నిర్వహిస్తామని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది.
అదే జరిగితే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడు
ఈ నేపథ్యంలో కర్సన్ ఘవ్రీ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా తప్పు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య సిరీస్‌ను ఎల్లప్పుడూ ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీగానే వ్యవహరిస్తారు. టీమిండియా- ఆస్ట్రేలియా ట్రోఫీని బోర్డుర్- గావస్కర్ ట్రోఫీ అనే పిలుస్తారు.
ఒకవేళ ఆసీస్‌తో టీమిండియా సిరీస్‌కు ఈ పేరును గనుక మార్చి ఉంటే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడు. అయినా.. ఈసీబీ, ఎంసీసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా బీసీసీఐ కోరాల్సింది. పటౌడీ పేరు తీసివేయొద్దని గట్టిగా చెప్పాల్సింది.
సచిన్ నో చెప్పాల్సింది
సచిన్ టెండుల్కర్ కూడా పేరు మార్పునకు అంగీకరించకుండా ఉండాల్సింది. తను నో చెప్పి ఉంటే బాగుండేది. ఏదేమైనా కనీసం అభ్యంతరం లేవనెత్తకపోవడం సరికాదు’’ అని విమర్శించాడు.
‘‘ఏదేమైనా పటౌడీ భారత క్రికెట్‌లో ఓ దిగ్గజం. ఆయన పేరును తొలగిస్తుంటే మీరెలా ఊరుకున్నారు?’’ అని ఘవ్రీ ప్రశ్నించాడు. ఇక విమర్శల అనంతరం ఈసీబీ విజేత జట్టుకు పటౌడీ మెడల్ ఇస్తామని ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ మీరు మెడల్స్ ఇవ్వాలని అనుకుంటే.. అందుకోసం ట్రోఫీ పేరునే మార్చాల్సిన అవసరం లేదు కదా!’’ అంటూ ఘవ్రీ ఈసీబీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాగా గుజరాత్‌కు చెందిన 74 ఏళ్ల కర్సన్ ఘవ్రీ 1974- 1981 మధ్య టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఘవ్రీ.. 39 టెస్టుల్లో 913 పరుగులు, 19 వన్డేల్లో 114 పరుగులు సాధించాడు. అదే విధంగా.. లెఫ్టార్మ్ మీడియం పేసర్ అయిన ఘవ్రీ టెస్టుల్లో 109, వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
2-2తో సమం చేసిన టీమిండియా
ఇదిలా ఉంటే.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా 2-2తో సిరీస్ సమం చేసింది. ఈ పర్యటనతో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ప్రయాణం ఆరంభించిన శుబ్‌మన్ గిల్ .. 754 పరుగులతో సిరీస్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ టూర్‌లో టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్ గెలవడం హైలైట్‌గా నిలిచింది.
చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!