
టీమిండియా జెర్సీలో సంజూ (పాత ఫొటో PC: BCCI)
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ముందు టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మెరుపు హాఫ్ సెంచరీతో రాణించి.. సెలక్టర్లకు తానూ రేసులో ఉన్నానంటూ బ్యాట్ ద్వారానే సందేశం ఇచ్చాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
సెలక్టర్లకు సవాల్
అయితే, ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసే భారత జట్టుకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేస్తారా? లేదంటే.. ఓపెనర్ యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్‌లను పిలిపించి.. ఈ కేరళ బ్యాటర్‌పై వేటు వేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సందేహాల నడుమ సంజూ శాంసన్ తనదైన శైలిలో సెలక్టర్లకు సవాల్ విసిరాడు.
ప్రెసిడెంట్స్ ఎలెవన్ vs సెక్రటరీ ఎలెవన్
కాగా కేరళ క్రికెట్ లీగ్ సీజన్-2 సెప్టెంబరులో ప్రారంభం కానుంది. అయితే, ఈ టోర్నీకి ముందు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎలెవన్- కేరళ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ ఎలెవన్ మధ్య శుక్రవారం ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది.
గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ సెక్రటరీ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఈ పోరులో సచిన్ బేబీ కెప్టెన్సీలోని ప్రెసిడెంట్ ఎలెవన్ తొలుత బ్యాటింగ్ చేసింది.
రోహన్ కన్నుమ్మల్ (29 బంతుల్లో 60), అభిజిత్ ప్రవీణ్ (18 బంతుల్లో 47) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. ప్రెసిడెంట్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
విష్ణు విధ్వంసం.. సంజూ మెరుపు హాఫ్ సెంచరీ
ఇక లక్ష్య ఛేదనలో విష్ణు వినోద్ విధ్వంసకర ఇన్నింగ్స్ (29 బంతుల్లో 69)తో విరుచుకుపడగా.. సంజూ శాంసన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో 54 పరుగులతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అలరించాడు. ఈ క్రమంలో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సెక్రటరీ ఎలెవన్ లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది.
ఆసియా కప్-2025 టోర్నీకి భారత జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైన వేళ సంజూ ఈ మేరకు బ్యాట్‌తో రాణించడం పట్ల అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సెప్టెంబరు 9- 28 మధ్య యూఏఈ వేదికగా ఆసియా కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.
అత్యధికంగా మూడు శతకాలు
కాగా సంజూ అంతర్జాతీయ టీ20లలో ఇప్పటికే మూడు శతకాలు బాదాడు. తద్వారా రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4) తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మొత్తంగా 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 861 పరుగులు సాధించాడు.
చదవండి: ENG vs SA: వన్డే, టీ20లకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఆ సిరీస్‌కు కెప్టెన్‌గా జేకబ్