టీమిండియాను గడగడలాడించిన ఐర్లాండ్‌ బౌలర్‌కు బంపరాఫర్‌ | Jai Moondra Signed By Indian Team Owner After Destroying India | Sakshi
Sakshi News home page

టీమిండియాను గడగడలాడించిన ఐర్లాండ్‌ బౌలర్‌కు బంపరాఫర్‌

Jul 2 2026 1:06 PM | Updated on Jul 2 2026 1:11 PM

Jai Moondra Signed By Indian Team Owner After Destroying India

ఇటీవల ఐర్లాండ్‌ పర్యటనలో టీమిండియా బ్యాటర్లను గడగడలాడించిన బౌలర్‌కు బంపరాఫర్‌ వచ్చింది. విదేశీ లీగ్‌లో ఓ భారతీయుడు ఓన్‌ చేసుకున్న ఫ్రాంచైజీలో ఆడేందుకు అతడికి పిలుపు అందింది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించి 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌ను భారత జట్టు అనూహ్యంగా 0-2తో చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లను జై మూండ్రా అనే భారత మూలాలున్న (రాజస్థాన్‌) ఐర్లాండ్‌ బౌలర్‌ తెగ ఇబ్బంది పెట్టాడు.

2 మ్యాచ్‌లో 5 ప్రధాన వికెట్లు (సంజూ శాంసన్‌ను రెండు సార్లు, శివమ్‌ దూబే, అభిషేక్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ను తలోసారి) తీసి టీమిండియా సిరీస్‌ ఓటమికి కారకుడయ్యాడు. 

ఈ ప్రదర్శనల తర్వాత మూండ్రా క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాడు. ఐపీఎల్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌లన్నీ ఇతడిపై కన్నేశాయి.

ఈ ​క్రమంలోనే ఈ యువ ఎడమచేతి ఫాస్ట్ బౌలర్‌ను యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) తొలి సీజన్ కోసం Rotterdam Dockers జట్టు తమ స్క్వాడ్‌లోకి తీసుకుంది. 

ఈ ఫ్రాంచైజీకి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహాం సహ యజమానిగా ఉన్నాడు. సౌతాఫ్రికా మాజీలు ఫాఫ్‌ డుప్లెసిస్‌, జాంటీ రోడ్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌కు కూడా ఈ ఫ్రాంచైజీలో భాగముంది.

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఈ ఏడాదే తొలిసారి నిర్వహించబడనుంది. Cricket Ireland, Cricket Scotland, Royal Dutch Cricket Association సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి.

ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనున్న ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. మొత్తం 32 మ్యాచ్‌లు (ప్లే ఆఫ్స్‌తో కలిపి) నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో చాలామంది భారతీయ క్రికెటర్లు, బాలీవుడ్‌ సినీ రంగానికి చెందిన వారు సహ యజమానులుగా ఉన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement