తొలి మ్యాచ్‌లో భారత మహిళల జయభేరి
64 పరుగుల తేడాతో పాకిస్తాన్ చిత్తు
టీమిండియా స్పిన్నర్లకు 9 వికెట్లు
5 వికెట్లతో దీప్తి మాయాజాలం
3 వికెట్లతో మెరిసిన శ్రీచరణి
స్మృతి, రిచా మెరుపులు
మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు విశ్రాంతి దినం
ధనాధన్ ఫార్మాట్‌లోనూ విశ్వవిజేతగా అవతరించాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన భారత మహిళల జట్టు టైటిల్ వేటను బ్రహ్మాండంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను తొలి మ్యాచ్‌లో చిత్తు చేసి టీమిండియా గెలుపు గర్జన చేసింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ విజృంభించగా... బౌలింగ్‌లో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి, స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ తమ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చారు.
బర్మింగ్‌హామ్: ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఘనవిజయంతో కప్పు వేటను ఘనంగా ప్రారంభించింది. గ్రూప్–1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 64 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో విజృంభించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించింది. చివర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టింది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మునీబా అలీ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.
పవర్‌ప్లే ముగిసేసరికి 52/1తో పటిష్ట స్థితిలో కనిపించిన పాకిస్తాన్... స్పిన్నర్ల రంగప్రవేశం తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 10 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ఆంధ్ర అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 21 పరుగులిచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకుంది. భారత పురుష క్రికెటర్ల మాదిరిగానే... మహిళా క్రికెటర్‌లు కూడా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయర్లకు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదు. ప్రపంచకప్‌లో సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌తో శ్రీలంక; ఇంగ్లండ్‌తో ఐర్లాండ్ తలపడతాయి.
తొలి బంతికే సిక్సర్...
ఓపెనర్ షఫాలీ వర్మ (6) తొలి బంతికే సిక్స్ బాదడంతో... టీమిండియాకు మంచి ఆరంభం దక్కుతుందనుకుంటే అది సాధ్యపడలేదు. ఐదో బంతికి షఫాలీ అవుట్ కాగా... జెమీమా (1) విఫలమైంది. దీంతో భారత్ 18/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో నాయకద్వయం జట్టును ఆదుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి వైస్ కెప్టెన్ స్మృతి ఇన్నింగ్స్‌ను నిర్మించింది. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఈ జంట... కుదురుకున్నాక చక్కటి షాట్‌లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించిన అనంతరం స్మృతి అవుట్ కాగా... హార్డ్ హిట్టర్ భారతి ఫుల్మాలి (1) నిరాశ పరిచింది. ఈ దశలో దీప్తి శర్మ (12 నాటౌట్) అండతో రిచా రెచ్చిపోయింది. పాకిస్తాన్ పేలవ ఫీల్డింగ్ కూడా మనవాళ్లకు కలిసి వచ్చింది.
ఒక్క ఓవర్‌లో 23 పరుగులు...
తస్మియా రుబాబ్ వేసిన ఇన్నింగ్స్19వ ఓవర్‌లో భారత బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. తొలి బంతికి ఫోర్ కొట్టిన దీప్తి రెండో బంతికి సింగిల్ తీయగా... ఆ తర్వాత రిచా రఫ్ఫాడించింది. వరుసగా 4, 6, 4, 4 బాదింది. దీంతో ఆ ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో మరో 15 పరుగులు రాబట్టారు. మొత్తంగా తొలి 10 ఓవర్లలో 65 పరుగులకే పరిమితమైన టీమిండియా ఆ తర్వాత 10 ఓవర్లలో 105 పరుగులు చేసింది.
87 అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా స్మతి మంధాన అవతరించింది. 86 సిక్స్‌లతో హర్మన్‌ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి అధిగమించింది.
14 టి20 ఫార్మాట్‌లో పాకిస్తాన్‌పై భారత్ గెలిచిన మ్యాచ్‌లు. ఇరు జట్ల మధ్య 17 మ్యాచ్‌లు జరిగాయి. మూడింటిలో పాక్ గెలిచింది.
166 మహిళల టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ గుర్తింపు పొందింది. 165 వికెట్లతో థిపాచా పథావోంగ్ (థాయ్‌లాండ్) పేరిట ఉన్న రికార్డును దీప్తి సవరించింది.
స్కోరు వివరాలు
భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) మునీబా (బి) సాదియా 6; స్మృతి (సి) సనా (బి) షమీమ్ 68; జెమీమా (సి) నటాలియా (బి) తస్మియా 1; హర్మన్‌ప్రీత్ (సి) నటాలియా (బి) సనా 36; భారతి (స్టంప్డ్) మునీబా (బి) సాదియా 1; రిచా (బి) సనా 34; దీప్తి శర్మ (నాటౌట్) 12; శ్రేయాంక పాటిల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–109, 4–110, 5–123, 6–168. బౌలింగ్: సాదియా 4–0–41–2; ఫాతిమా సనా 4–0–33–2; తస్మియా 4–0–41–1; రమీన్ షమీమ్ 4–0–30–1; నష్ర 4–0–25–0.
పాకిస్తాన్ మహిళల ఇన్నింగ్స్: మునీబా (రనౌట్) 41; ఫెరోజా (సి) భారతి (బి) దీప్తి 12; ఆయేషా (సి) స్మృతి (బి) దీప్తి 12; సైరా జబీన్ (సి) హర్మన్ (బి) శ్రీ చరణి 2; నటాలియా (సి) హర్మన్ (బి) శ్రీ చరణి 7; సనా (సి) స్మృతి (బి) షఫాలీ 0; ఆలియా (సి) జెమీమా (బి) దీప్తి 18; షమీమ్ (సి) శ్రేయాంక (బి) శ్రీ చరణి 4; నష్ర (సి) హర్మన్ (బి) దీప్తి 4; తస్మియా (సి) జెమీమా (బి) దీప్తి 0; సాదియా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 106. వికెట్ల పతనం: 1–38, 2–53, 3–58, 4–75, 5–77, 6–79, 7–91, 8–105, 9–105, 10–106. బౌలింగ్: అరుంధతి రెడ్డి 2–0–21–0; శ్రేయాంక 3–0–17–0; క్రాంతి గౌడ్ 1–0–14–0; దీప్తి శర్మ 4–0–10–5; శ్రీ చరణి 4–0–21–3; షఫాలీ 3–0–22–1.


