‘బాబుకు బీపీ డౌన్ కాగానే.. పవన్‌కు బీపీ పెరుగుతోంది’ | Ysrcp Leader Tjr Sudhakar Babu Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘బాబుకు బీపీ డౌన్ కాగానే.. పవన్‌కు బీపీ పెరుగుతోంది’

Jun 21 2026 3:03 PM | Updated on Jun 21 2026 3:35 PM

Ysrcp Leader Tjr Sudhakar Babu Fires On Pawan Kalyan

సాక్షి, తాడేపల్లి: పవన్‌ కళ్యాణ్‌కి మతి భ్రమించిందని.. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బీపీ డౌన్ కాగానే, పవన్ కళ్యాణ్‌కి బీపీ పెరుగుతోందన్నారు.

‘‘పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడటం లేదు. వైఎస్సార్‌సీపీ నేతలను గూండాలతో పోల్చటం సిగ్గుచేటు. మమ్మల్ని తొక్కి నార తీస్తా అనటం ఏంటి?. ప్లేస్, టైం చెబితే మేమే వస్తాం.. నార తీయండి చూస్తాం. సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేస్తున్నారనంటూ అతని తల్లి చేసిన రోదనలు వినపడలేదా పవన్?’’ అంటూ టీజేఆర్‌ నిలదీశారు.

‘‘తన బిడ్డను  చంపేశారని, కనీసం బూడిదనైనా ఇప్పించమని అడిగారు. ఆ తల్లికి మద్దతుగా వైఎస్ జగన్ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు సాయికృష్ణ తల్లిని ఓదార్చితే కుల రాజకీయం అంటూ విమర్శిస్తున్నారు. సాయికృష్ణ నేరగాడనైతే మరి అతని కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పిలిపించారు?. జనసేన నేత ఉదయభాను.. సాయికృష్ణ ఇంటికి ఎందుకు పంపించావ్‌ పవన్?. అంతకంటే ముందు తూర్పు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్‌ను పంపలేదా?. కేసును రాజీ చేసుకోవాలని కోరలేదా?’’ అంటూ టీజేఆర్‌ ప్రశ్నించారు.

‘‘సాయికృష్ణ నేరస్తుడైతే మాత్రం పోలీసులతో చంపేస్తారా?. మరి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంగతేంటి?. ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తున్న చింతమనేనిపై ఏం చర్యలు తీసుకున్నారు?. కనీసం కేసు కూడా పెట్టలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇదికాదా పవన్?. కాపులంతా తనకు మద్దతుగా నిలబడితే సీఎం అవుతానని పవన్ చెప్పలేదా?. మరి తన సినిమాలను కూడా కాపులు మాత్రమే చూడాలని ఎందుకు చెప్పలేదు?. రాజకీయాలకు మాత్రం కులం కావాలా?

..కుల రాజకీయాలు చేస్తూ ఇతరులను విమర్శించటం ఎందుకు?. ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబానికి పవన్ ఎందుకు సానుభూతి చెప్పలేదు?. దళితుడైన క్రాంతికుమార్ పవన్‌కు కనపడలేదా?. హోంమంత్రి పదవి మీద పవన్‌కు మనసు పడింది. అందుకే పదేపదే నేను హోంమంత్రినైతే.. అంటున్నారు. దళితురాలు అనిత హోంమంత్రిగా పనికి రాదని పవన్ చెప్తున్నారు. ముందుగా సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయండి. అతని మిస్సింగ్ వెనుకున్న పోలీసు పెద్దల పాత్రను బయట పెట్టండి’’ అని టీజేఆర్‌ సుధాకర్‌ బాబు హితవు పలికారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement