దయచేసి ఇక ఆపండి! కేతన్‌ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి | Viral AI Videos Leave Ketan Agarwal's Family Heartbroken | Sakshi
Sakshi News home page

దయచేసి ఇక ఆపండి! కేతన్‌ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి

Jun 27 2026 8:46 AM | Updated on Jul 3 2026 2:18 PM

Viral AI Videos Leave Ketan Agarwal's Family Heartbroken

ఒక కుటుంబం జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదం.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినోదంగా మారింది. చనిపోయిన కొడుకును టెక్నాలజీ సాయంతో మళ్లీ "బతికించినందుకు" సంతోషించాలా? లేక అతని హత్య కేసులో నిందితురాలితో కలిసి నవ్వుతూ, మాట్లాడుతున్నట్లు వీడియోలు సృష్టిస్తున్నందుకు బాధపడాలా? అనే వేదనలో కేతన్‌ అగర్వాల్‌ కుటుంబం మునిగిపోయింది. కేవలం వ్యూస్‌, లైక్స్‌ కోసం జరుగుతున్న ఈ ఏఐ ట్రెండ్‌ వారికి మరోసారి తీరని మానసిక వేదనను మిగులుస్తోంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే లోహగడ్‌ హత్య కేసు ఇప్పుడు మరో కారణంతో చర్చనీయాంశమైంది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు సోషల్‌ మీడియా వేదికల్లో కేతన్‌ అగర్వాల్‌, నిందితురాలు సియా గోయల్‌ కలిసి ఉన్నట్లు చూపించే ఏఐ వీడియోలు, ఫోటోలు, రీల్స్‌ భారీగా వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలు పూర్తిగా కల్పితమైనవే అయినప్పటికీ, లక్షలాది మంది వాటిని వీక్షిస్తూ, షేర్‌ చేస్తుండటంతో ఈ ట్రెండ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. "దయచేసి ఇలాంటి ఏఐ వీడియోలు చేయడం ఆపండి" అంటూ వారు సోషల్‌ మీడియా వినియోగదారులను భావోద్వేగంగా వేడుకుంటున్నారు. అలాగే.. కేతన్‌-సియాల వీడియోలను కూడా వైరల్‌ చేయడం ఆపమంటున్నారు.

పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిబ్రవరిలో సియా గోయల్‌తో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. అయితే సియాకు అప్పటికే చేతన్‌ చౌదరితో ప్రేమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులకు చెప్పకుండా, కేతన్‌ను అడ్డంకిగా భావించి హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.

జూన్‌ 18వ తేదీన లోహగడ్‌ కోట వద్ద ఫొటోషూట్‌ కోసం తీసుకెళ్లి లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటన, తర్వాత పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా మారింది. ఈ కేసులో సియా గోయల్‌, చేతన్‌ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఈ విషాద ఘటనను ఇప్పుడు కొందరు ఏఐ కంటెంట్‌గా మార్చి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. కేతన్‌, సియా మళ్లీ కలిసి మాట్లాడుకుంటున్నట్లు, ప్రేమలో ఉన్నట్లు, అలాగే ప్రియుడితో కలిసి కేతన్‌ను సియా ఎలా చంపిందోనంటూ వీడియోలు విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. కొంతమంది వాటిని నిజమని కూడా భావిస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది. అదే సమయంలో సియాకు సంబంధించినవంటూ కొన్ని వీడియోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ఈ వీడియోలను చూసిన కేతన్‌ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొడుకును కోల్పోయిన బాధ నుంచి బయటపడలేకపోతున్నామని, ఇప్పుడు ఇలాంటి ఏఐ వీడియోలు ప్రతిరోజూ ఆ బాధను మళ్లీ గుర్తు చేస్తున్నాయని వాపోయారు. సోషల్‌ మీడియాలో వ్యూస్‌, లైక్స్‌, ఫాలోవర్ల కోసం ఒక కుటుంబం విషాదాన్ని వినోదంగా మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఆపండి.. Please Stop అంటూ సోషల్‌ మీడియా వినియోగదారులకు భావోద్వేగ పిలుపునిచ్చారు.

ఈ ఘటనతో ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. మరణించిన వ్యక్తుల పేరుతో నకిలీ వీడియోలు తయారు చేయడం బాధిత కుటుంబాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సృష్టించిన ఫేక్‌ కంటెంట్‌ను నియంత్రించేందుకు సోషల్‌ మీడియా సంస్థలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వీడియోలను ప్రోత్సహించవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: కొండపై నుంచి తోసేసింది అతడుకాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement