సాక్షి, న్యూఢిల్లీ: కోట్ల ఓట్లను గల్లంతు చేశారన్న ప్రధాన ఆరోపణలను నెత్తినమోస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ పదవి నుంచి తక్షణం తప్పుకోవాలన్న డిమాండ్‌తో కొద్దిరోజులుగా దేశ రాజధాని వీధుల్లో ఉద్యమిస్తున్న విపక్షపార్టీల నేతలు ఇప్పుడు నేరుగా సర్వోన్నత న్యాయస్థానం దిశగా ర్యాలీగా దూసుకెళ్లి ఉద్యమపథాన్ని కొత్త దిశలో మళ్లించారు. అన్యాయంగా ఓట్లు కోల్పోయిన కోట్లాది మంది ఓటర్లకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసేందుకు వందలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులతో బయల్దేరిన విపక్షాల ‘ఇండియా’కూటమి పార్టీల ర్యాలీ హస్తినవీధుల్లో జనసంద్రంగా మారింది. అడుగడుగునా ఉద్యమకారులు ఎన్‌డీఏ సర్కార్, సీఈసీ, మోదీ, షా, ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది.
‘మోదీ–జ్ఞానేశ్‌ను తప్పిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం’, ‘జ్ఞానేశ్ ఎక్కడ? మోదీ ఒడిలో’, ‘జ్ఞానేశ్‌జీ మీ గడువు ముగిసింది. దిగిపో’, ‘రాజీనామా.. చేయాల్సిందే’నినాదాలు సోమవారం ఢిల్లీ రహదారుల్లో మార్మోగాయి. జ్ఞానేశ్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నాయకులు సోమవారం రఫీమార్గ్‌లోని కానిస్టిట్యూషన్ క్లబ్ నుంచి సుప్రీంకోర్టు వైపు మార్చ్ చేపట్టారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత ఎంఏ బేబీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఎన్సీపీ–ఎస్పీ నాయకురాలు సుప్రియాసూలే, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) అధ్యక్షురాలు నేహా బోరా, విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాది మంది నిరసనకారులు తిలక్ మార్గ్‌లోని సుప్రీంకోర్టు దిశగా కదిలారు.
సుప్రీంకోర్టుకు కొంత దూరంలో భగవాన్ దాస్ రోడ్డులో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కొందరు నిరసనకారులు బారికేడ్లు ఎక్కడంతో పోలీసులు వారిని వెనక్కి నెట్టారు. తర్వాత కాస్తంత తక్కువ మంది నేతలు, కార్యకర్తలతో ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాం«దీ, ప్రియాంక, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్ వాహనం పైకెక్కి ర్యాలీగా ముందుకు కదిలారు. వీళ్లను కార్యకర్తలు జెండాలు ఊపుతూ అనుసరించారు.
తర్వాత నేతలు బస్సులో ప్రయాణించారు. బస్సు బారాఖంబా రోడ్– కన్నాట్‌ప్లేస్ జంక్షన్ సమీప ఇందిరాచౌక్‌కురాగానే రాహుల్, ప్రియాంక, ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహా బోరా కిందకు దిగి కార్యకర్తలతో కలిసి నడిచారు. దీంతో ఆ మార్గంలోని పలు కంపెనీలు, సంస్థల ఉద్యోగులు వీళ్లను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, శివసేన నేత సంజయ్ రౌత్, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ్ఖ, కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, సచిన్ పైలట్, ముకుల్ వాస్నిక్, టీఎంసీ నేత సాగరికా ఘోష్, సామాజిక వేత్తలు యోగేంద్ర యాదవ్, నందితా నారాయణ్ సైతం ర్యాలీలో పాల్గొన్నారు. కానిస్టిట్యూషన్ క్లబ్ నుంచి సెంట్రల్ సెక్రేటేరియేట్, ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా మీదుగా, ఫిరోజా రోడ్, మండీ హౌజ్‌ల నుంచి బారాఖంబాకు మార్చ్ చేరుకుంది.
నేతలతోపాటు వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు అడుగులు వేశారు. ఇతర వామపక్ష సంఘాల సభ్యులు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాన మార్చ్ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభమైంది. సుప్రీంకోర్టుకు చేరేసరికి సమయం సాయంత్రం ఐదున్నర అయింది.
ప్రధాన ఆకర్షణగా బ్యాట్‌మ్యాన్ మాస్క్
ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తల్లో కొందరు బ్యాట్‌మ్యాన్ మాస్క్‌లు ధరించి అందర్నీ ఆకర్షించారు. ఉద్యమంలో ప్రధాన ఆకర్షణగా మారి అందర్నీ ముందుండి నడిపిస్తున్న రాహుల్‌గాం«దీని బ్యాట్‌మ్యాన్‌గా భావిస్తూ మాస్‌్కలు, వేషధారణలో వచ్చామని పలువురు ఉద్యమకారులు తెలిపారు. వారిలో ఒకరు కొన్ని మాస్‌్కలను బస్సులోని ముఖ్యనేతలకు అందజేశారు. వాటిలో ఒకదానిని రాహుల్ ధరించగానే నిరసనకారులు ఆనందంతో నినాదాలుచేశారు. మరో మాస్‌్కను ఖర్గే ధరించారు.
ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్
ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 11 మంది ప్రతిపక్ష నాయకులు సంయుక్తంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాం«దీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, రాష్ర్టీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ–ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జార్ఖండ్ ముక్తి మోర్చా నేత మహువా మాఝీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఈటీ మొహమ్మద్ బషీర్ ఈ పిటిషన్ వేశారు.
పిటిషన్‌లో సీఈసీ జ్ఞానేశ్, ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలను ప్రతివాదులుగా చేర్చారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఉన్న అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి కోసం సుప్రీంకోర్టు తలుపులు తెరచే ఉంటాయని సీజేఐ సూర్యకాంత్ వేరే కార్యక్రమంలో వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే విపక్షనేతలు కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
నేడు ఎస్‌ఐఆర్ పిటిషన్లపై విచారణ?
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ఇతర పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగాల్సి ఉంది. ప్రతిపక్ష నాయకులు తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇప్పటికే విచారణలో ఉన్న సంబంధిత కేసులతో కలిపి పరిశీలించే అవకాశం ఉందని సీజేఐ సూచించినట్లు సమాచారం. అయితే, రాహుల్, ఇతర ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌లోని పూర్తి వాదనలు, కోరిన ఉపశమనాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అందువల్ల మంగళవారం విచారణలో ఈ పిటిషన్ ఏ విధంగా పరిశీలనకు వస్తుంది, న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: నిరసనల రాజధాని!


