నిరసనల రాజధాని! | Delhi Protests Election Commission Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

నిరసనల రాజధాని!

Oct 13 2026 3:24 AM | Updated on Oct 13 2026 3:24 AM

Delhi Protests Election Commission Gyanesh Kumar

ఎన్నికల సంఘం(ఈసీ) ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ శనివారం నుంచి అటు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ), ఇటు ఇండియా కూటమి పక్షాలు చేస్తున్న ఆందోళనలతో ఢిల్లీ నగరం ‘నిరసనల రాజధాని’ గా మారిపోయింది. జూలై ‘అనుభవం’తో జంతర్‌మంతర్‌ వైపు ఎవరినీ రానీయరాదన్న కృతనిశ్చయం ప్రదర్శించి పోలీసులు చేసిన అతి వల్ల పలుచోట్లకు అది విస్తరించింది! ఆర్‌కే ఆశ్రమ్, ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, నిగంబోద్‌ ఘాట్, కన్నాట్‌ ప్లేస్‌ లాంటి పలు ప్రాంతాల్లో ఉద్యమకారులకూ, పోలీసులకూ బాహాబాహీ తప్పలేదు.

విపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యాన సుప్రీంకోర్టుకు ర్యాలీ తీయటం, వినతిపత్రం ఇస్తామనటం కొత్త పరిణామం. ఢిల్లీలో విమానంలోకి చొరబడి సీజేపీ నేతల్ని అరెస్టుచేశారు. జంతర్‌మంతర్‌ వైపు దూసుకెళ్లే వేలాదిమంది ఉద్యమకారులపై మాత్రమే కాదు... జర్నలిస్టులపైనా పోలీసులు ప్రతాపం చూపారు. గుర్తింపుకార్డులు గుంజుకున్నారు. ఆడ, మగ తేడాలేకుండా ఈడ్చుకు పోవటం, మొరటుగా ప్రవర్తించటం రానున్నకాలంలో బీజేపీని వెంటాడే దృశ్యాలవుతాయి. ఒకటి రెండుచోట్ల హిందూ సంస్థలకు చెందినవారిగా చెప్పుకున్న వ్యక్తులు యువతీయువకులపై పిడిగుద్దులు కురిపించటం, నిండుగా లాఠీలు నింపుకుని కారులో వచ్చినవారికి పోలీసులు రక్షణనివ్వటం దిగ్భ్రాంతి కలిగించింది.

తెలివైన పాలకులు నిరసనల్ని అడ్డుకోరు. అవి వాతావరణాన్ని తెలిపే బారో మీటర్‌ లాంటివి. పదిమంది గుమిగూడి ఎలుగెత్తారంటే పాలన సవ్యంగా లేదని అర్థం చేసుకోవాల్సిందిపోయి, గొంతు నొక్కాలని చూస్తే ఉద్యమం సమసిపోదు సరికదా... అది మరింత బలంగా, వేగంగా విస్తరిస్తుంది. చివరకు సర్వోన్నత న్యాయ స్థానం సైతం జోక్యం చేసుకుని చీవాట్లు పెట్టిందంటే తమ ఓవరాక్షన్‌ ఎంతగా శ్రుతిమించిందో పోలీసులు తెలుసుకోవాలి. ఎందుకనో... ఈ ఆందోళనల హోరులోనే జంతర్‌ మంతర్‌ ఇంకెంత మాత్రం నిరసనలకు వేదిక కాదంటూ ఢిల్లీ పోలీసులు హఠాత్తుగా సోమవారం ప్రకటించారు.

ఢిల్లీ అంతటా బారికేడ్లు, దాదాపు 50,000మంది పోలీసులు, ఇతర బలగాల మోహరింపు, వందల ప్రదేశాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు, 45 మెట్రో స్టేషన్ల మూసివేత, విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాల్సి రావటం వగైరాలన్నీ దేనికోసం? కేవలం జ్ఞానేశ్‌ను కాపాడటానికేనా? ఈసీలో ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ప్రకారం నిర్ణయాలు అమలుకావాల్సివుండగా, జ్ఞానేశ్‌ అభీష్టమే చెల్లుబాటు కావటం చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధం కూడా. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ కథనం గతనెల 23న దీన్ని వెల్లడించాక అదంతా అబద్ధమనీ, ఏ నిర్ణయమైనా సమష్టిగానే తీసుకున్నామనీ ముగ్గురూ కలిసి మీడియా ముఖంగా చెప్పిందిలేదు. కనీసం జ్ఞానేశ్‌ ఒక్కరైనా సంజాయిషీ ఇచ్చింది లేదు.

20 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో దేశ జనాభాలో 10 శాతంమంది ఓట్లు... అంటే 13 కోట్లమందికిపైగా ఓట్లు ఏకపక్షంగా తొలగిస్తే... ఆ విషయంలో ఇద్దరు కమిషనర్లూ ముందే హెచ్చరించినా ఆ  వ్యవస్థ అచేతనంగా ఉండిపోవటం ఆశ్చర్యకరం. ఏపీతో సహా అనేకచోట్ల ఎన్నికల్ని అపసవ్యంగా, అడ్డదిడ్డంగా నిర్వహించిన వైనం సాక్ష్యాధారాలతో బయటపడింది. అయినా కొందరు మాజీ న్యాయమూర్తులూ, ఇంకొందరు మాజీ ఉన్నతాధికారులూ ఈసీ తీరును సమర్థిస్తూ ప్రకటనలు విడుదల చేయటం దిగ్భ్రాంతికరం. ఇలాంటివారి చేతుల్లో కొన్నాళ్లు ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ నడిచాయంటే చోద్య మనిపిస్తుంది. జవాబుదారీతనం జాడలేనిచోట ప్రజాస్వామ్యం మనగలుగుతుందా?

యాదృచ్ఛికమే గానీ... చిలీ, బ్రెజిల్, స్పెయిన్, ఫ్రాన్స్‌ దేశాల్లో సైతం గతవారం జెన్‌ జీ జూలువిదిల్చింది. డిమాండ్లు వేరు కావొచ్చు, నిరసన రూపాలు భిన్నం కావొచ్చు–కానీ పాలకులు తాము చెప్పేది వినాలన్నదే యువత నిరసనల సారాంశం. స్వాతంత్రోద్యమ కాలంలో ఢిల్లీలో నిరసనలకు యమునా తీరం, జమా మసీదు, ఆజాద్‌ పార్క్, ఫిరోజ్‌ షా కోట్లవంటి పలు స్థలాలుండేవి. తదుపరి పటేల్‌ చౌక్, సంసద్‌ మార్గ్‌ల్లో నిరసనలకు చోటిచ్చారు. యాభైయ్యేళ్లు దాటాక అది జంతర్‌మంతర్‌కు చేరింది. ఇప్పుడు అక్కడి నుంచి కూడా వాటిని బహిష్కరించటం అసహనానికి పరాకాష్ఠ. జరుగుతున్న పరిణా మాలు సవ్యంగా లేవు. సకాలంలో సరిచేయకుంటే నిరసనలు మరింత తీవ్రమవుతాయి.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉత్తర్వు చట్టం కాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement